వాహన కొనుగోలుదారులకు షాక్: కార్ల ధరలు పెంపు...
ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సార్వత్రిక బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించకముందే వినియోగదారులకు షాకిచ్చింది. ఎంపిక చేసిన కొన్ని మోడల్ కార్లపై 4.7 శాతం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. తక్షణం ఆ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపింది.
న్యూఢిల్లీ: వాహన కొనుగోలుదారులకు ప్రయాణికుల వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకీ సార్వత్రిక బడ్జెట్ కంటే ముందుగానే షాకిచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.10 వేల వరకు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది.
also read టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్...ధర ఎంతో తెలుసా...
ఉత్పత్తి వ్యయాలు అధికమవడం వల్లనే ధరలను 4.7 శాతం వరకు సవరించాల్సి వచ్చిందని మారుతి సుజుకి ఒక ప్రకటనలో వెల్లడించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎంట్రి లెవల్ ఆల్టో కారు రూ.900 నుంచి రూ.6000 వరకు, ఎస్-ప్రెస్సో రూ.1,500 నుంచి రూ.8,000 వరకు, వ్యాగన్ ఆర్ రూ.1,500 నుంచి రూ.4,000 వరకు ప్రియం కానున్నాయి.
వీటితోపాటు మల్టీ పర్పస్ వాహనం ఎర్టిగా రూ.4,000 నుంచి రూ.10 వేల వరకు, బాలెనో రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు, ఎక్స్‌ఎల్6 రూ.5 వేల వరకు అధికం కానున్నాయి. ప్రస్తుతం సంస్థ రూ.2.89 లక్షలు మొదలుకొని రూ.11.47 లక్షల లోపు ధర కలిగిన పలు మోడళ్లను దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నది.
ఆల్టోలో సీఎన్జీ వర్షన్ ధర రూ.4.32 లక్షలే
మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్ బ్యాక్ ఆల్టోలో బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా సీఎన్జీ వర్షన్‌లో అందుబాటులోకి తెచ్చింది మారుతి. దీని ధర రూ.4.32 లక్షలుగా మారుతి సుజుకి నిర్ణయించింది. ఈ ఆల్టో ఎస్ సీఎన్జీ కారు కిలో గ్యాస్ మీద 31.59 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.
also read మహీంద్రా నుండి కొత్త ఆఫ్-రోడ్ వాహనం....
కాలుష్య నియంత్రణకే బీఎస్-6 ఆల్టోఎస్
కాలుష్య నియంత్రణలో భాగంగా బీఎస్-6 ప్రమాణాలతో సీఎన్జీ వర్షన్ ఆల్టోఎస్ కారును ఆవిష్కరించామని మారుతి సుజుకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. చమురు దిగుమతులను నియంత్రించడానికి, సహజవాయువు వాడకం పెంపొందించడానికి కేంద్రం క్రుత నిశ్చయంతో ఉన్నది. 2030 నాటికి 15 నుంచి 6.2 శాతానికి పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలని చూస్తోంది.