పొల్యూషన్ కంట్రోల్: అడిషనల్ సేఫ్టీ ఫీచర్లతో విపణిలోకి మారుతి ఆల్టో
ప్రయాణికుల కార్ల విక్రయాల్లో ముందు వరుసలో ఉండే మారుతి సుజుకి.. కర్బన ఉద్గారాలను నియంత్రించే కార్ల తయారీలోనూ ముందు పీఠినే నిలుస్తోంది. సోమవారం నిర్దేశిత బీఎస్ -6 ప్రమాణాలతో అప్డేట్ చేసిన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు బాలెనోను విపణిలోకి ప్రవేశపెట్టింది. తాజాగా ఎంట్రీ లెవెల్ కారు ఆల్టో 800ను బీఎస్ -6 స్టాండర్డ్‌కు అనుగుణంగా వినియోగదారుల ముంగిట్లోకి తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ: దేశీయ ప్రయాణికుల కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతీ సుజుకీ, చిన్న కారు ఆల్టో 800లో కొత్త వెర్షన్‌ను విపణిలోకి ప్రవేశపెట్టింది. ధరల శ్రేణి రూ.2.93- 3.71 లక్షలుగా నిర్ణయించారు.
బీఎస్-6 ఉద్గార నిబంధనలకు లోబడి రూపొందించిన కొత్త వెర్షన్‌లో అదనపు భద్రతా ఫీచర్లు చేర్చామని కంపెనీ తెలిపింది. దీని వల్ల ప్రస్తుత మోడల్ ధరతో పోలిస్తే కొత్త మోడల్ ధర న్యూఢిల్లీలో రూ.30 వేలు పెరుగనున్నది.
‘2000లో మొదటిసారి విడుదల చేసినప్పటి నుంచి.. ఇప్పటి వరకు 37 లక్షలకు పైగా ఆల్టో కార్లు అమ్ముడుపోయాయి. దాదాపు 58 శాతం మంది కొత్త కొనుగోలుదార్లు ఆల్టోనే ఎంచుకున్నారు’అని మారుతీ సుజుకీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌ఎస్ కల్సీ పేర్కొన్నారు.
దేశంలోనే బీఎస్-6 నిబంధనలకు లోబడిన మొదటి చిన్నకారు ఆల్టోయేనని మారుతి సుజుకి వెల్లడించింది. లీటరుకు 22.05 కి.మీ మైలేజీ ఇస్తుందని తెలిపింది. పూర్తిగా పెట్రోల్ వేరియంట్ ఇంజిన్‌తో నడిచే ఈ కారు యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ (ఏబీఎస్) తదితర అదనపు సేఫ్టీ ఫీచర్లు కలిగి ఉంది.
ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ (ఈబీడీ), రివర్స్ పార్కింగ్ సెన్సర్, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సీట్ బెల్ట్‌ను గుర్తు చేసే ఏర్పాటు వంటి అదనపు భదత్రా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పాదచారుల భద్రతా నిబంధనలను సైతం ఈ మోడల్ లోబడి ఉందని సంస్థ పేర్కొంది.
ఈ నెల ప్రారంభంలో అప్ గ్రేడెడ్ ఆల్టో కే 10 మోడల్ కారు అదనపు సేఫ్టీ ఫీచర్లతో దాని ధర రూ.23 వేలు పెరుగుతుందని ప్రకటించింది. సోమవారం పూర్తిగా పెట్రోల్‌తో నడిచే అప్‌గ్రేడెడ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బీఎస్ -6 ప్రమాణాలతో బాలెనో కారును మారుతి సుజుకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.