న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో మరో సరికొత్త వాహనాన్ని విపణిలోకి విడుదల చేసింది. ‘వెన్యూ’ పేరుతో తీసుకొచ్చిన ఈ కారు ధర రూ.6.5లక్షల నుంచి రూ.11.1లక్షలుగా ఉంది.

మూడు రకాల ఇంజిన్స్ ఆప్షన్లతో హ్యుండాయ్ ‘వెన్యూ’ను విపణిలోకి తీసుకొచ్చారు. ఒక లీటర్ టర్బో, 1.2 లీటర్ పెట్రోల్ పవర్ట్రైన్స్, 1.4 లీటర్ డీజిల్ వర్షన్లతో కూడిన ఇంజిన్‌తో ఇది రానుంది. 

అదే సమయంలో వాటి శ్రేణిని బట్టి ధరలను కూడా ప్రకటించారు. పెట్రోల్ వేరియంట్ ధర రూ.6.5లక్షల నుంచి 11.1లక్షల మధ్య ఉండగా, డీజిల్తో నడిచే వాహనం ధర రూ.7.75లక్షల నుంచి 10.84లక్షల మధ్య ఉంది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతీ సుజుకీ వితారా బ్రెజా, టాటా మోటార్స్ నెక్సాన్, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మహీంద్రా ఎక్స్యూవీ300లకు హ్యుండాయ్ వెన్యూ గట్టి పోటీ ఇవ్వనుంది. దేశీయంగా కాంపాక్ట్ ఎస్యూవీ వాహనాల విభాగంలో వేగంగా వృద్ధి నమోదవుతోంది.

‘హ్యుండాయ్ అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికకు భారత మార్కెట్ గుండెలాంటిది. వెన్యూ విడుదలతో మా మార్కెట్ మరింత బలోపేతం అవుతుందన్న కృత నిశ్చయంతో ఉన్నాం’ అని హ్యుండాయ్ ఎండీ, సీఈవో ఎస్ఎస్ కిమ్ అన్నారు. ఇందుకోసం 100 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టినట్లు కిమ్ చెప్పారు. 

గత పది నెలల్లో భారత మార్కెట్లో కార్ల విక్రయాలు పడిపోయాయి. భారతదేశంలో ఎకనామిక్ సెంటిమెంట్ చాలా తక్కువగాగా ఉంటుందని, ధరలు సున్నితమైన అంశం అని హ్యుండాయ్ ఎండీ, సీఈవో ఎస్ఎస్ కిమ్ తెలిపారు. ఇప్పటికే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో హ్యుండాయ్ సంస్థ.. వెన్యూ కారును ఆవిష్కరించింది. 

ఇక వెన్యూ మోడల్ కారులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. కంపెనీకి చెందిన బ్లూలింక్ టెక్నాలజీ 33 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్తో అనుసంధానించారు. 

ఇందులో 10 ఫీచర్లను కేవలం భారత మార్కెట్ కోసమే తయారు చేశారు. ఈ కారులో ఎలక్ట్రానిక్ సన్రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, క్రూయిజ్ కంట్రోల్, ఆరు ఎయిర్ బ్యాగ్లు, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, వాహన నియంత్రణ వ్యవస్థ ఇందులోని ప్రత్యేకతలు.

 లీటర్ ప్రెటోల్ ఇంజిన్(మ్యానువల్ ట్రాన్స్మిషన్) వెన్యూ లీటర్కు 18.27కి.మీ. మైలేజీని ఇస్తుంది. ఇక ఆటో ట్రాన్స్మిషన్ వాహనం లీటర్కు 18.15కి.మీ. మైలేజీ ఇస్తుంది. 1.2లీటర్ పెట్రోల్ ఇంజిన్ లీటర్కు 17.52కి.మీ మైలేజీ, 1.4లీటర్ డీజిల్ ఇంజిన్ లీటర్కు 23.7కి.మీ. మైలేజీని ఇస్తుందని హ్యుండాయ్ చెబుతోంది.

ఇప్పటికిప్పుడు భారతదేశంలో కార్ల విక్రయం.. వెన్యూ సేల్స్ పరిస్థితిపై స్పందించడం తొందరపాటవుతుందని హ్యుండాయ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, వికాస్ జైన్ చెప్పారు. ఇప్పటికైతే 15 వేల కార్ల బుకింగ్స్ జరిగాయి. 

వచ్చేనెలాఖరు నాటికి వాటిని డెలివరీ చేస్తామని హ్యుండాయ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, వికాస్ జైన్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్లో 5.8 లక్షల కార్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వికాస్ జైన్ వివరించారు. 

గత ఆర్థిక సంవత్సరంలో 5,45,243 కార్లను హ్యుండాయ్ విక్రయించింది. హ్యుండాయ్ మోటార్స్ ఆర్ అండ్ డీ డివిజన్ అధ్యక్షుడు ఆల్బర్ట్ బైర్మన్ మాట్లాడుతూ భారత కస్టమర్లు ఇంధన వినియోగంలో పొదుపు పాటిస్తారన్నారు. 

బీఎస్ -6 ప్రమాణాలు అమలులోకి వచ్చినా డీజిల్ వినియోగ కార్లను తయారు చేస్తామని హ్యుండాయ్ మోటార్స్ ఆర్ అండ్ డీ డివిజన్ అధ్యక్షుడు ఆల్బర్ట్ బైర్మన్ తెలిపారు. వచ్చే జూలై నాటికి ఎస్యూవీ కొనా పేరిట పూర్తిస్థాయి విద్యుత్ కారు ఆవిష్కరించేందుకు హ్యుండాయ్ మోటార్స్ సిద్ధమవుతోంది.