మారుతికి గట్టి షాక్: మొదటి స్థానంలోకి దూసుకెళ్లిన హ్యుండాయ్..
హ్యుండాయ్ మోటార్స్ మే నెలలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఆ సంస్థ కొత్తగా విడుదల చేసిన ‘క్రెటా’ మారుతి సుజుకినీ ఢీకొట్టి, విక్రయాల్లో మొదటి స్థానంలో నిలిచింది.
న్యూఢిల్లీ: దేశీయ కార్ల మార్కెట్‌లో కొత్త లీడర్‌గా దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ మోడల్ కారు క్రెటా ఆవిర్భవించింది. మే నెలలో అత్యధిక కార్లను విక్రయించడంతో ఇన్నాళ్లు అగ్రస్థానంలో కొనసాగిన మారుతి రెండో స్థానానికి పరిమితం అయ్యింది. దేశంలో కరోనా లాక్‌డౌన్‌తో ఏప్రిల్ నెలలో కార్ల అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి.
మే నెలలో లాక్‌డౌన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించడంతో కార్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ నెలలో హ్యుండాయ్ తన సరికొత్త మోడల్ అయిన క్రెటా ఎస్‌యూవీ బ్రాండ్‌లో 3212 యూనిట్లను అమ్మింది. తద్వారా తొలిసారి దేశీయ విక్రయాల్లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది.
మే నెలలో మారుతి సుజుకి తన ఎర్టిగా ఎంపీవీ మోడల్ 2353 యూనిట్లను అమ్మడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది. మారుతి డిజైర్, మహింద్రా బొలేరో, మారుతి ఈకో మోడల్ కార్లు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అయితే దేశంలో అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి మొత్తం అమ్మకాల్లో ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నది. మే నెలలో కంపెనీ మొత్తం 13685 కార్లను విక్రయించింది. దేశంలో లాక్‌డౌన్ కంటే కొద్ది రోజుల ముందు హ్యుండాయ్ తన సరికొత్త క్రెటా ఎస్‌యూవీ కారును భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. మార్చి నెలలో ఈ కారుకు అత్యధిక బుకింగ్స్ నమోదయ్యాయి.
also read ప్లాంట్ల పున:ప్రారంభంతో దూసుకెళ్లిన టాటా మోటర్స్ షేర్లు..
అయితే ఇంతలోనే లాక్‌డౌన్ రావడం, ఏప్రిల్‌లో అమ్మకాలు పూర్తిగా లేకపోవడంతో.. మే నెలలో ఆ కార్లను హ్యుండాయ్ డెలివరి చేసింది. దీంతో కార్ల అమ్మకాల్లో తొలిస్థానంలో నిలిచింది. అయితే ఇప్పటివరకు క్రెటా ఎస్‌యూవీ కార్లు 6883 యునిట్లు అమ్ముడుపోయాయి.
మే నెలలో 70 శాతం పడిపోయిన బజాజ్ ఆటో
బజాజ్ ఆటోమబైల్ వాహనాల విక్రయాలు 70 శాతం పతనం అయ్యాయి. 2019 మే నెలలో 4,19,235 వాహనాలను విక్రయించిన బజాజ్ ఆటోమొబైల్ గత నెలలో 1,27,128 వెహికిల్స్ మాత్రమే సేల్ చేయగలిగింది. దేశీయ విక్రయాలు 2,35,824 నుంచి 40,074 యూనిట్లకు, ద్విచక్ర వాహనాలు 69 శాతం తగ్గి 1,12,798కి పడిపోయాయి. ఎగుమతుల్లో 53 శాతం పతనం రికార్డయింది.
హోండా మోటార్ బైక్స్ సేల్స్ 54,820
హోండా మోటారు సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మే నెలలో 54,820 వాహనాలను విక్రయించింది. వీటిలో ఎగుమతి చేసిన వాహనాలు 820 ఉన్నాయి. దేశీయంగా 54 వేల బైకులు అమ్ముడయ్యాయి. రిటైల్ విక్రయాల పరంగా 1.15 లక్షల వాహనాలు విక్రయించామని హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ తెలిపింది. భౌతిక దూరం పాటించాల్సి రావడంతో ద్విచక్ర వాహన కొనుగోళ్లు పెరిగాయని హెచ్ఎంఎస్ఐ తెలిపింది.