జొమాటో గోల్డ్ సభ్యులకు లభించే స్పెషల్ ఆఫర్లను ఫుడ్ డెలివరీకి కూడా బదలాయించాలని సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని భారత రెస్టారెంట్ల సంఘం (ఎన్ఆర్ఎఐ) అధ్యక్షుడు అనురాగ్ కత్రియార్ వ్యతిరేకించారు. డెలివరీలకు కూడా ‘గోల్డ్’ను విస్తరింపజేయడం సరైన ప్రయత్నం కాదని అనురాగ్ కత్రియార్ పేర్కొన్నారు.

జొమాటో తన గోల్డ్ ప్రమోషన్ కోసం పెద్దమొత్తంలో రాయితీలు అందించాల్సి వస్తుందని, తర్వాత నెమ్మదిగా ఈ భారం అంతా భాగస్వామ్య రెస్టారెంట్లపైనే పడుతుందని ఎన్ఆర్ఎఐ అధ్యక్షుడు అనురాగ్ కత్రియార్ ఆందోళన వ్యక్తం చేశారు.

‘జొమాటో గోల్డ్’ ఆఫర్‌ను డెలివరీ విభాగానికి విస్తరింపజేయడానికి అంగీకరించొద్దని రెస్టారెంట్లను ఎన్ఆర్ఎఐ అభ్యర్థించింది. ప్రస్తుతం జొమాటో గోల్డ్ సభ్యులకు ఆఫర్లు నిర్దేశించిన రెస్టారెంట్‌కు వెళితేనే లభిస్తున్నాయి.

వీటిని హోం డెలివరీలకు కూడా అందజేస్తామని శనివారం జొమాటో ప్రకటించింది. జొమాటో గోల్డ్ ప్రస్తుతం దేశంలోని 16 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. వచ్చే వారానికల్లా 25 నగరాలకు విస్తరిస్తామని సంస్థ వెల్లడించింది.

గోల్డ్ ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి తమ భాగస్వామ్య రెస్టారెంట్లు, వినియోగదారులకు జొమాటో సహ వ్యవస్థాపకుడు సీవోవో గౌరవ్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు.

భవిష్యతలో మొత్తం 41 నగరాల పరిధిలో సుమారు 13 వేల రెస్టారెంట్లలో డెలివరీ విభాగానికి కూడా జొమాటో గోల్డ్ ఆఫర్లను విస్తరిస్తాలని భావిస్తున్నట్లు జొమాటో సీఈఓ మోహిత్ గుప్తా తెలిపారు.

దీనివల్ల వినియోగదారులకు ఎక్కువ సంఖ్యలో రెస్టారెంట్లు అందుబాటులో ఉండటంతోపాటు వాటికి కూడా బిజినెస్ కూడా కల్పించినట్లు అవుతుందని మోహిత్ గుప్తా చెప్పారు.

ఒక సంవత్సరానికి రూ.2000 చెల్లిస్తే జొమాటో గోల్డ్ సభ్యత్వం లభిస్తుంది. దీన్ని ఉపయోగించి నిర్దేశించిన జొమాటో భాగస్వామ్య రెస్టారెంట్లలో ప్రత్యేక ఆఫర్లు పొందవచ్చు.