Paytmను కొనుగోలు చేసిన Zomato: ఇక సినిమాలు, ఫుడ్ ఒకచోటే
సినిమా టిక్కెట్స్ బుక్ చేయడానికి మనం ఎక్కువగా ఉపయోగించే పేటీఎంను ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొనుగోలు చేసింది. ఫుడ్ డెలివరీ చేసే సంస్థ ఎంటర్‌టైన్మెంట్ విభాగాన్ని ఎందుకు కొనుగోలు చేసింది. పేటీఎం తదుపరి చర్యలు, జొమాటో కార్యకలాపాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. రండి.
ప్రఖ్యాత ఫుడ్ ఆర్డర్ డెలివరీ సంస్థ జొమాటో తన వ్యాపారాన్ని విస్తరించే చర్యలు చేపట్టింది. అయితే ఈ సారి ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలోకి అడుగుపెట్టంది. ఇందులో భాగంగానే పేటీఎం సంస్థకు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్, క్రీడలు, ఈవెంట్‌లు కండక్ట్ చేసే విభాగాలను కొనుగోలు చేసింది. రూ.2,048 కోట్లకు Paytm అనుబంధ సంస్థలైన Orbgen Technologies Pvt Limited (OTPL), Wasteland Entertainment Pvt Ltd (WEPL) కొనుగోలు చేసింది. ఈ మేరకు రెండు కంపెనీలు ధ్రువీకరణ పత్రాలు మార్చుకున్నాయి.
ఫిన్‌టెక్ అందించిన సమాచారం ప్రకారం Paytm 2017 లో రూ.268 కోట్లతో సినిమా టికెటింగ్‌ని ప్రారంభించింది. తర్వాత కూడా మరింత పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేసింది. ఇప్పుడు రూ.2,048 కోట్లకు విక్రయించింది. అయితే పేటీఎం ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారంలో ఉన్న దాదాపు 280 మంది ఉద్యోగులు Zomatoలో భాగం అవుతారు.
Paytm తన ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారం ద్వారా సినిమా ప్రియులకు ఎంతో విలువైన సేవలు అందించింది. పేటీఎం ద్వారా కోట్ల మంది భారతీయులు టిక్కెట్లు బుక్ చేసుకొని సినిమాలను ఎంజాయ్ చేసేవారు. మరి Zomato విషయానికొస్తే ఏ సమయంలోనైనా ఫుడ్ డెలివరీ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది. ఈ రెండు కంపెనీలు కేవలం మెట్రో పాలిటన్ సిటీల్లోనే కాకుండా చిన్న పట్టణాలకు సైతం తమ వ్యాపారాన్ని వ్యాపించాయి.
ఎలాగో ఫుడ్ డెలివరీలో ముందున్న Zomato ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే పేటీఎం అనుబంధ సంస్థలను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. దీంతో సినిమా టిక్కెట్ బుక్ చేసుకున్న వాళ్లు అక్కడే ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చన్న మాట. Zomato కొత్త వ్యాపారాన్ని 'డిస్ట్రిక్ట్' అనే కొత్త యాప్‌గా ద్వారా చేస్తుందని Zomato మేనేజింగ్ డైరెక్టర్, CEO దీపిందర్ గోయల్ ప్రకటించారు.