Asianet News TeluguAsianet News Telugu

హర్రీయప్!: డెబిట్/ క్రెడిట్ కార్డు అప్డేట్ మస్ట్!

ఈ నెలాఖరులోగా డెబిట్, క్రెడిట్ కార్డులను మార్చు (అప్ గ్రేడ్) చేసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. 2016లోనే బ్యాంకులకు ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా అప్ గ్రేడ్ చేసుకోని ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డుల సేవలు నిలిచిపోతాయని ఆయా బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి.

Your debit, credit cards may get blocked from December 31, here's why
Author
Delhi, First Published Dec 14, 2018, 8:55 AM IST

మీ క్రెడిట్, డెబిట్‌ కార్డులను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని మీ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నా.. మీరు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా? అయితే ఈ నెలాఖరు (డిసెంబర్ 31) తర్వాత మీ కార్డులేవీ పనిచేయవు. ఎందుకు? కార్డులు బ్లాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మోసాపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించేందుకు రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 

మ్యాగ్‌స్ట్రైప్‌ డెబిట్‌ కార్డులు ఉన్న ఖాతాదారులు వాటి స్థానంలో ఈఎంవీ చిప్‌ డెబిట్‌ కార్డులు తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఆయా బ్యాంకులు ఈ సేవలను పూర్తిగా అందించాలని, ఈ ఏడాది చివరి లోగా ప్రతి ఒక్కరూ చిప్‌ ఆధారిత కార్డులు తీసుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఈ చిప్‌ ఆధారిత కార్డులను 2016 నుంచే ఆర్బీఐ తప్పనిసరి చేసింది. 2016 జనవరి 31 తర్వాత బ్యాంకు ఖాతాలు తెరిచిన కొత్త కస్టమర్లు, క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులను దరఖాస్తు చేసుకున్న వారిని చిప్‌ ఆధారిత కార్డులే జారీ చేయాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. అంతకు ముందు గల కార్డులనూ తప్పనిసరిగా మార్చాలని ఆర్బీఐ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. 

దీంతో ఈ విషయమై ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమాచారం ఇస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా మ్యాగ్‌స్ట్రైప్‌ డెబిట్‌ కార్డుల స్థానంలో చిప్‌ ఆధారిత కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని లేని పక్షంలో ఆ కార్డులను శాశ్వతంగా నిలిపివేస్తామని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేదా బ్యాంక్‌ శాఖకు వెళ్లి ఈ కార్డులను మార్చుకునే సౌలభ్యం ఉంది.

మరి మీ కార్డులు చిప్‌ ఆధారిత కార్డులా కాదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలంటే.. మీ క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ముందువైపు బంగారు రంగులో చిన్న చిప్‌ ఉంటుంది. అది ఉంటే మీది ఈఎంవీ కార్డే. లేదంటే మార్చుకోవాల్సి ఉంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios