ఫుడ్‌  డెలివ‌రీ యాప్ జోమాటో  ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జోమాటో యాప్‌లో  ఇప్పుడు కస్టమర్లు ఫుడ్ ఆర్డర్‌ చేసేటప్పుడు  కోవిడ్ -19 ఎమర్జెన్సీ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా వేగంగా ఫుడ్‌ డెలివరీ పొందవచ్చు.

ఈ ఫీచర్ ప్రత్యేకంగా కోవిడ్ రోగులకోసం తీసుకొచ్చింది. దీని ద్వారా కోవిడ్‌-19  రోగులకు వేగంగా ఫుడ్‌ను డెలివరీ చేయనుంది. ఫుడ్ ఆర్డర్ చేసిన వెంటనే లొకేషన్, రూట్ ఆధారంగా దగ్గరలో ఉన్న జోమాటో వేగవంతమైన రైడర్ కు ఈ డెలివరీ అప్పగిస్తుంది. ఈ ఫీచర్ క్యూలో  ఉన్న ఫుడ్ ఆర్డర్ల కంటే ముందుగా ప్రాధాన్యత ఇవ్వనుంది.

ఈ ఫీచర్ పై జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ బుధవారం రాత్రి ట్విట్టర్‌లో "ఈ కొత్త ఫీచర్ ఆపిల్ ఐఫోన్‌తో పాటు ఆండ్రాయిడ్ ఫోన్‌లోనూ లభిస్తుందని" ట్వీట్ చేశారు. అలాగే ఈ రోజు మేము  మా రెస్టారెంట్ భాగస్వాములతో  కలిసి జోమాటో యాప్ లో  'కోవిడ్  ఎమర్జెన్సీలకు ప్రాధాన్యత డెలివరీ' ఫీచర్ తీసుకొచ్చాము అని అన్నారు. ఈ డెలివరీలకు అదనపు ఛార్జీలు ఉండవు, కేవలం  ఆర్డర్  ఛార్జీలు మాత్రమే వసూల్ చేయబడతాయి.   అన్ని డెలివరీలు కాంటాక్ట్‌లెస్‌గా ఉంటాయని కూడా భరోసా ఇచ్చింది. 

also read భారతదేశంలోకి త్వరలో కొత్త బ్యాంకులు.. లైసెన్స్ కోసం ఆర్‌బిఐకి దరఖాస్తులు.. ...

"మా కస్టమర్లకు అవసరమైన సర్వీస్ చేయడానికి మాతో చేతులు కలిపినందుకు మొత్తం రెస్టారెంట్ పరిశ్రమకు ధన్యవాదాలు" అని గోయల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఏదేమైనా అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రమే తమ ఆర్డర్ పేజీలో ఈ ఆప్షన్ ఎంచుకోవాలని జోమాటో తన వినియోగదారులను కోరింది.

“దీన్ని అంబులెన్స్‌గా పరిగణించండి, దయచేసి దుర్వినియోగం చేయవద్దు” అని యాప్ లో ఈ కొత్త ఫీచర్ డిస్క్రిప్షన్ లో వ్రాసి ఉంది.కోవిడ్ -19పై  భారత్  తీవ్రంగా పోరాడుతోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం అందించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో  3,14,835 కొత్త కేసులు నమోదయ్యాయి.