న్యూఢిల్లీ: కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలు, మొండిబాకీల సమస్యలతో సతమతం అవుతున్న ప్రైవేట్‌ రంగ బ్యాంకు ‘యెస్‌ బ్యాంక్‌’ తాజాగా ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆదేశాల మేరకు మాజీ ఎండీ రాణా కపూర్‌కు చెల్లించిన రూ. 1.44 కోట్ల బోనస్‌లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.

బోనస్‌ కింద 2014–15లో రూ. 62.17 లక్షలు, 2015–16లో చెల్లించిన రూ. 82.45 లక్షల మొత్తాన్ని ఆర్బీఐ ఆదేశాల మేరకు వెనక్కి తీసుకోవాలని బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ నిర్ణయించినట్లు యెస్ బ్యాంక్ తెలిపింది. అయితే  2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాలకు కపూర్‌కు బోనస్‌లేమీ చెల్లించలేదని పేర్కొంది.

2004లో ప్రారంభమైన యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుల్లో రాణా కపూర్‌ కూడా ఒకరు. ఆయనకు ఇప్పటికీ బ్యాంకులో 4.32 శాతం వాటా కూడా ఉంది. నిబంధనల అమలు, ఇతర వివాదాలతో కపూర్‌ పదవీకాలాన్ని పొడిగించేందుకు ఆర్బీఐ నిరాకరించడంతో ఆయన వైదొలగాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రూ. 6 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీతో రవ్‌నీత్‌ గిల్‌ నియమితులయ్యారు.  

మరోవైపు, బ్యాంకు బోర్డులో ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీని అదనపు డైరెక్టర్‌గా ఆర్బీఐ నియమించడం ముందు జాగ్రత్త చర్య అని  విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతంలో ధనలక్ష్మి బ్యాంక్, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ)ల్లో కూడా ఆర్బీఐ అదనపు డైరెక్టర్లను నియమించిన సంగతి వారు గుర్తు చేస్తున్నారు.

ధనలక్ష్మి బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)ల్లో పరిస్థితి దారుణంగా ఉండేదని, వీటితో పోలిస్తే చాలా పెద్ద సంస్థ అయిన యస్‌ బ్యాంక్‌ విఫలమైన పక్షంలో మరిన్ని ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగానే ఆర్‌బీఐ వ్యవహరించి ఉంటుందని మెక్వారీ రీసెర్చ్‌ సంస్థ అభిప్రాయపడింది. అటు గాంధీ నియామకం సానుకూల, నిర్మాణాత్మక చర్య అని యస్‌ బ్యాంక్‌ అభివర్ణించింది. 
పటిష్టమైన యస్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ పూర్తి స్థాయిలో తోడ్పాటును అందిస్తోందని పేర్కొంది. గాంధీ నియామకం వల్ల కార్యకలాపాలకేమీ ఆటంకాలు ఉండబోవని తెలిపింది. అయితే ఆర్బీఐ నామినీగా గాంధీని డైరెక్టర్‌గా నియామకం వల్ల ఇప్పటికిప్పుడు మదుపర్లు పొలోమని వచ్చి బ్యాంకు షేర్లలో పెట్టుబడులేమీ పెట్టరని యెస్‌ బ్యాంకుకు మర్చంట్‌ బ్యాంకరుగా పనిచేసిన ఒక సీనియర్‌ బ్యాంకరే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీని యెస్‌ బ్యాంకు బోర్డు సభ్యుడిగా చేరినా నియామకం జరిగినా..యెస్‌ బ్యాంకుపై ఆర్‌బీఐకున్న అనుమానాలను ఇది ధ్రువపరుస్తోందని విశ్లేషకులు అనుకుంటున్నారు. సాధారణ ప్రజల, బ్యాంకు ప్రయోజనాలను కాపాడడం కోసం గాంధీ నియామకాన్ని చేపట్టినట్లు ఇప్పటికే ఆర్‌బీఐ ప్రకటించింది. 

ఇపుడు గాంధీ నియామకం ద్వారా ఏప్రిల్‌-జూన్‌, ఆ తర్వాతి త్రైమాసికాల్లో యెస్‌ బ్యాంకు ఖాతాలను మరింతగా ప్రక్షాళన చేయాలన్నది ఆర్‌బీఐ ఉద్దేశంగా ఉందా అన్నదే ఇక్కడ కీలకం. అదే జరిగితే ఫలితాలు స్తబ్దుగా, మొండి బకాయిలు ఎక్కువగా నమోదవుతాయి. ఈ నేపథ్యంలో బోర్డులో గాంధీ క్రియాశీలకంగా వ్యవహరిస్తారా లేదా స్తబ్దుగా ఉంటారా అన్న అంశంనూ మదుపర్లు ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే అదే మధ్య నుంచి దీర్ఘకాలంలో బ్యాంకు భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది.

కానీ యెస్ బ్యాంకులో ఆర్బీఐ నామినీ నియామకం ప్రభావం ప్రతికూలతలే తెచ్చిపెడుతుందనడానికి మరికొందరు విశ్లేషకులు చెబుతున్నారు. 2016 సెప్టెంబర్‌లో యెస్ బ్యాంకు బిలియన్‌ డాలర్లను సంస్థాగత మదుపర్ల నుంచి సమీకరించాలని భావించినా.. నియంత్రణపరమైన మార్పులతో వెనక్కి తగ్గింది. ఆ తర్వాత 2017 మార్చిలో 750 మిలియన్‌ డాలర్లను సమీకరించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే చివరి సమీకరణ.

బిలియన్‌ డాలర్ల సమీకరణకు బోర్డు అనుమతి ఇప్పటికే ఉన్నా కూడా బ్యాంకు షేరు ధర బాగా క్షీణించడంతో సమీప భవిష్యత్‌లో సమీకరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే మదుపర్లకు ఆందోళనకర అంశంగా మారింది. ఇపుడు  యెస్‌ బ్యాంకు బోర్డులోకి ఆర్‌బీఐ డైరెక్టర్ రాక నేపథ్యంలో సమీకరణ మరింత ఆలస్యమవుతుందని విశ్లేషకుల మాట. ఇప్పటికే మూలధనం లేకపోవడంతో నిధుల సమీకరణ అత్యంత ఆవశ్యకంగా మారింది. అయితే ప్రస్తుతానికి నిధుల సమీకరణ అన్నది ఇప్పట్లో జరిగేలా లేదు.

కొద్ది నెలలుగా యెస్‌ బ్యాంకు పరిస్థితి బావుండడం లేదు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌లకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారడంతో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకు గణాంకాలు డీలా పడ్డాయి. సెప్టెంబర్ నెలలో రాణాకపూర్‌కు మరో మూడేళ్ల పాటు పదవీ కాలాన్ని పొడిగించడానికి ఆర్‌బీఐ నిరాకరించడంతో.. కపూర్‌ వారసుడిగా వచ్చిన రవ్‌నీత్‌ గిల్‌ బ్యాంకును ప్రక్షాళన చేయడానికి ప్రయత్నించారు. 

అందులో భాగంగా జనవరి-మార్చిలో రూ.1510 కోట్ల నికర నష్టం ప్రకటించి స్టాక్‌ మార్కెట్లను దిగ్భ్రాంతికి గురి చేశారు. రుణ వ్యయాల విషయానికొస్తే 2018-19కి 80 బేసిస్‌ పాయింట్లుగా బ్యాంకు అంచనా కట్టింది. అయితే ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ల వల్ల అది కాస్తా 209 బేసిస్‌ పాయింట్లుగా నమోదైంది. 2019-20లో అంచనాలను రెట్టింపు చేసి 125 బేసిస్‌ పాయింట్లుగా ప్రకటించింది.