ప్ర‌ముఖ ప్ర‌యాణ సేవ‌ల సంస్థ యాత్రా ఆన్‌లైన్ లిమిటెడ్ ఐపీవోకి ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఈ మేర‌కు శ‌నివారం సెబీకి ముసాయిదా ప‌త్రాలు అంద‌జేసింది. రూ. 750 కోట్లు విలువ చేసే తాజా షేర్ల‌తో పాటు 93,28,358 ఈక్వీటీ షేర్లు ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ కింద‌ట అందుబాటులో ఉంచ‌నుంది. 

దేశీయ లీడింగ్ ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్ యాత్ర ఆన్‌లైన్ లిమిటెడ్.. త్వరలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (Yatra Online IPO)కు రానుంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌ను సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)కి సమర్పించింది. 93 లక్షలకు పైగా ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్‌కు పెట్టింది. యాత్ర ఆన్‌లైన్ లిమిటెడ్ మాతృసంస్థ యాత్ర ఆన్‌లైన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్.. ఇదివరకే అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ నాస్డాక్‌లో లిస్టింగ్ అయింది.

పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా 750 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని యాత్ర ఆన్‌లైన్ లిమిటెడ్ నిర్ణయించింది. ఈ మొత్తాన్ని జనరల్ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకుంటామని కంపెనీ తెలిపింది. ఈ విషయాన్ని సెబికి అందజేసిన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌లో పొందుపరిచింది. వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడం, ఇతర ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్లను టేకోవర్ చేయడం, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఖర్చు చేస్తామని పేర్కొంది.

ఆఫర్ ఫర్ సేల్ కింద పెట్టిన ఈక్విటీల మొత్తం 93,28,358. ఇందులో 88,96,998 షేర్లను టీహెచ్‌సీఎల్ ట్రావెల్ హోల్డింగ్స్ సైప్రస్ లిమిటెడ్, 4,31,360 షేర్లను పండారా ట్రస్ట్ స్కీమ్‌కు కేటాయిస్తుంది. ట్రస్టీ విస్టా ఐటీసీఎల్ (ఇండియా) లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ ఇది. కాగా- యాత్ర ఆన్‌లైన్ ఐపీఓ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ఎస్బీఐ కేపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, డీఏఎం కేపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌ అపాయింట్ అయ్యారు.

కాగా- వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే ఏప్రిల్-మే-జూన్ మధ్యకాలంలో ఈ కంపెనీ ఐపీఓ జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. సెబి అనుమతి లభించిన వెంటనే- ప్రైస్ బ్యాండ్‌, లాట్‌ను నిర్ధారిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం పూర్తిగా తగ్గిన తరువాత ఆన్‌లైన్ ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్లకు మళ్లీ గిరాకీ పెరిగింది. ఇదివరకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోండటాన్ని దృష్టిలో ఉంచుకుని వెనక్కి వెళ్లిన గో ఎయిర్ వంటి సంస్థలు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పబ్లిక్ ఇష్యూను జారీ చేయొచ్చని తెలుస్తోంది.