న్యూఢిల్లీ: సర్కార్ నుంచి పూర్తి అధికారాలు లభించకపోవడం, ఎగవేత దారులకు ప్రభుత్వ, రాజకీయ నేతల అండతో బ్యాంకుల రాని బాకీలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా బ్యాంకులు చేసేదేమీ లేక వాటిని బాకీల రద్దు ఖాతాలోకి మళ్లించేస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ స్తబ్దతలోకి జారుకోవడంతో పాటు అప్పులు పొందిన కార్పొరేట్లు, ఇతర బడా బాబులు అప్పుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. దీంతో బ్యాంకులు విలవిలలాడుతున్నాయి. 

 

మోదీ అధికారంలోకి వచ్చాక బ్యాంకుల ఉనికే ప్రశ్నార్థకం:

పరిస్థితి ఎంతకు దిగజారిందంటే బ్యాంకులు జారీ చేస్తున్న రుణాల వృద్ధి కంటే కూడా మొండిబాకీల రద్దు పలు రెట్లు అధికంగా పెరుగుతుండడం గమనార్హం. కార్పొరేట్ల అప్పుల రికవరీపై ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనత విధానాల వైఖరి, ఆర్బీఐ అధికారాలకు కోత పెడుతున్న కేంద్ర విధానాలు వెరసీ భారీగా మొండి బాకీల రద్దుకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి బాకీలు, ఆర్ధిక మోసాలు అమాంతం పెరిగి బ్యాంకుల ఉనికినే దెబ్బ తీస్తున్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు. 

కొత్త రుణాల కంటే పాత రద్దులే ఎక్కువ:

ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 16 ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపుగా రూ.31 వేల కోట్ల రుణాలను రద్దు చేశాయి. గతేడాది ఇదే త్రైమాసికం రుణాల రద్దుతో పోలిస్తే 37 శాతం అదనమని నివేదికలు వస్తున్నాయి. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికం రుణాల జారీలో కేవలం 4.5 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ఇదే జూన్‌ ముగింపు నాటికి బ్యాంకు స్థూల అడ్వాన్సులు రూ.53 లక్షల కోట్లకు చేరాయి. తొలి త్రైమాసిక కాలంలో 14 బ్యాంకుల రుణాల రద్దులో పెరుగుదల చోటు చేసుకుంది. 

రుణాల జారీలో 10 బ్యాంకులు మెరుగు:

రుణాల జారీలో 10 బ్యాంకులు కొంత మెరుగ్గా ఉన్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అప్పుల రద్దులో ఏకంగా 70 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం విశేషం. బ్యాంకు ఆఫ్‌ బరోడా రుణాల రద్దు ఏకంగా 63 రెట్లు పెరిగాయి. సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా రుణాల రద్దు 14 రెట్లు పెరిగాయి. కాగా ఈ బ్యాంకు ఇచ్చిన రుణాల్లో మాత్రం వృద్ధి రెండు శాతం దరిదాపుల్లోనే నమోదవడం విశేషం. రిజర్వు బ్యాంకు ఇన్‌కం రికగనైజేషన్‌ అండ్‌ అసెట్‌ క్లాసిఫికేషన్‌ (ఇరాక్‌) విధివిధానాల్లో భాగంగా బ్యాంకులు ఈ అప్పులను రద్దు చేశాయి. 

గత ఏడాది రూ.1.28 లక్షల కోట్లు మొండిబాకీల రద్దు:

గత ఆర్థిక సంవత్సరం (2017-18లో) 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1.28 లక్షల కోట్లు బాకీలను రద్దు చేశాయి. ఇంతక్రితం ఏడాది బాకీల రద్దుతో పోల్చితే ఇది 57 శాతం ఎక్కువ. మొత్తం ఎన్‌పీఎల్లో వీటి విలువ 14 శాతం ఉన్నాయి. ఐడీబీఐ బ్యాంకు మొండి బాకీల రద్దులో ఏకంగా 336 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2017 మార్చితో ముగిసిన ఏడాదిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.81,684 కోట్ల రుణాలకు నీళ్లు వదులుకున్నాయి. 

దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థ ఎస్బీఐలో అత్యధిక రుణాల రద్దు ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ఏడాదికేడాదితో పోల్చితే క్రితం త్రైమాసికం రుణాల రద్దులో 24 శాతం తగ్గుదల చోటు చేసుకోవడం విశేషం. ఇదే సమయంలో రుణాల జారీలో 6 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. రద్దు చేసిన అప్పుల్లోనూ ఎస్బీఐ క్రితం త్రైమాసికంలో రూ.2,426 కోట్లు వసూలు చేయడం విశేషం. జూన్‌ త్రైమాసికానికి అత్యధికంగా అప్పులను రద్దు చేసిన బ్యాంకుల్లో కార్పొరేషన్‌ బ్యాంకు (రూ.24,580 కోట్లు), బ్యాంకు ఆఫ్‌ బరోడా (రూ.6,225.7 కోట్లు), ఐడీబీఐ బ్యాంకు (రూ.3,363.2 కోట్లు), సెంట్రల్‌ బ్యాంకు (రూ.1,309.4 కోట్లు), యునైటెడ్‌ బ్యాంకు (రూ.627 కోట్లు), దేనా బ్యాంకు (రూ.359 కోట్లు), యూనియన్‌ బ్యాంకు (రూ.319 కోట్లు) ఉన్నాయి.

దిగివస్తున్న పసిడి ధరలు:

గత వారం రోజుల్లో బంగారం ధరలు రూ.450 తగ్గాయి. న్యూఢిల్లీ బులియన్‌ మార్కె ట్‌లో ఆగస్టు 11న 10 గ్రాముల పసిడి ధర రూ.30,700గా నమో దు కాగా.. తాజాగా శనివారానికి ఈ ధర రూ.30,250కు పడిపోయింది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ.1000ల మేర తగ్గి రూ.38,000గా పలికింది. డాలర్‌కు డిమాండ్‌ పెరగడం, పసిడి, వెండిపై పెట్టుబడులు తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. శనివారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.90 తగ్గి వరుసగా రూ.30,250, రూ.30,100గా నమోదయ్యింది. మరోవైపు కిలో వెండి ధర యథాతథంగా రూ.38వేలుగా పలికింది. అభరణాల వర్తకుల నుంచి డిమాండ్‌ కొరవడటంతో పాటు ఇతర వాటిపై పెట్టుబడులు పెరగడంతో వరకు బంగారం ధరల్లో 14% తగ్గుదల చోటు చేసుకుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.