న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానాన్ని సవరించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పొరుగు దేశాల నుంచి భారత కంపెనీల్లోకి అవకాశవాద పెట్టుబడులు రాకుండా నిరోధించేందుకు కొత్త ఎఫ్‌డీఐ నిబంధనలను తీసుకొచ్చింది.

చైనా సెంట్రల్‌ బ్యాంకు ఇటీవల హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ)లో తన వాటాను 1.01 శాతం పెంచుకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్య చేపట్టింది. ఇతరదేశాలు భారత కంపెనీల్లో వాటాలు చేజిక్కించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. అమెరికాకు చెందిన కొన్ని కంపెనీల్లోనూ చైనా వాటాలు కొనుగోలు చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం పొరుగు దేశాల నుంచి భారత కంపెనీల్లోకి వచ్చే ఎఫ్‌డీఐలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. భారత్‌తో సరిహద్దును పంచుకొంటున్న చైనా లాంటి అన్ని దేశాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. 

భారత్‌తో సరిహద్దులు పంచుకొనే దేశాలు, అక్కడి వ్యక్తులు, వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఒకటి (ఆటోమేటిక్‌). ప్రభుత్వ అనుమతి తీసుకొని పెట్టడం రెండోది. ఇప్పటి వరకు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ రెండో విభాగంలో ఉండేవి. ప్రస్తుత నిబంధనలతో చైనాను రెండో విభాగంలో చేర్చారు.

చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌తో ప్రపంచమంతా బాధపడుతోంది. లాక్‌డౌన్‌, ఆంక్షలు అమలు చేయడంతో అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇదే అదనుగా అవకాశవాదంతో భారత కంపెనీలను చేజిక్కించుకోకుండా, విలీనాలు జరక్కుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. 

also read:‘తీవ్ర మాంద్యం’ తప్పదు.. ద్వితీయార్థం తర్వాతే రివైవల్: ఐఎంఎఫ్‌

‘భారత్‌తో సరిహద్దులు పంచుకొనే దేశాల్లోని కంపెనీ లేదా యజమాని లేదా పౌరుడు స్థానిక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి’ అని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 
రక్షణ, టెలికాం, ఫార్మా సహా 17 రంగాల కంపెనీల్లో నిర్దేశిత శాతాన్ని మించి విదేశీ పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. రూ.5000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలంటే ఆ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది.