ఇక నుంచి తమ యాప్‌ ద్వారా చేసే ఆర్డర్లను సైకిల్‌, ఎలక్ట్రిక్‌ బైక్‌లపై ఎక్కువగా డెలివరీ చేసే దిశగా అడుగులు వేయనున్నట్లు ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగీ తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు తాము ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇప్పటికే ముంబై, బెంగళూరు నగరాల్లో ఈ తరహా డెలివరీని ప్రారంభించినట్లు తెలిపింది.

మార్చిలో 15 లక్షల ఆర్డర్లు సైకిళ్లపైనే డెలివరీ
మార్చి నెలలో ఇలా మొత్తం 1.5మిలియన్‌ ఆర్డర్లను సైకిళ్లపైనే వినియోగదారులకు డెలివరీ చేశామని స్విగ్గీ పేర్కొన్నది. టూ-టైర్‌, త్రీ-టైర్‌ నగరాలైన సూరత్‌, బెల్గాం‌, గువహటి, లక్నో నగరాల్లో దాదాపు 20శాతం ఫుడ్‌ ఆర్డర్లను ఇలాగే వినియోగదారులకు చేర్చామన్నది.

దేశ వ్యాప్తంగా తమకు 10వేలమంది సైకిల్‌ యజమానులు భాగస్వాములుగా ఉన్నారని, అత్యధికమంది బెంగళూరు, ముంబైలలో ఉన్నట్లు స్విగ్గీ తెలిపింది.

పర్యావరణ పరిరక్షణకే సైకిళ్ల వినియోగం
‘పర్యావరణానికి మేలు చేసేలా ఫుడ్‌ను డెలివరీ చేయాలని కొన్నేళ్ల కిందటే మేం అనుకున్నాం. ఇప్పుడు స్విగీతో 10వేలమంది సైకిల్‌ యజమానులు భాగస్వాములుగా ఉన్నారు. దీనిని మరిన్ని నగరాలకు విస్తరిస్తాం. బైక్‌లు, స్కూటర్ల కన్నా కూడా సైకిల్‌పై ఫుడ్‌ డెలివరీ చేసే వారి సమయం తక్కువగా ఉంటోంది’ అని స్విగీ మార్కెటింగ్‌ ఉపాధ్యక్షుడు శ్రీవాత్స్‌ తెలిపారు. 

ఫిబ్రవరి నుంచే సైకిళ్లపై జొమాటో ఫుడ్ డెలివరీ
స్వీగీకి పోటీ సంస్థ ‘జొమాటో’ కూడా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సైకిల్‌పై ఫుడ్‌ డెలివరీ చేస్తోంది. ఈ మేరకు మొబిసై, యులు, జూమ్‌కార్‌కు చెందిన పెడల్‌ సంస్థలతో ఒప్పందం చేసుకుంది.

ఈ ఏడాది చివరి నాటికి పది ప్రముఖ నగరాల్లో ఎలక్ట్రిక్‌ బైక్‌లపై ఫుడ్‌ డెలివరీ చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు స్విగీ తెలిపింది. దీని వల్ల వ్యయ నియంత్రణతో పాటు, పర్యావరణానికి మేలు జరుగుతుందని స్విగీ భావిస్తోంది. 

ఇక అమెజాన్‌ పే నుంచి కూడా వాలెట్ సేవలు
ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వస్తువులు, నిత్యావసరాలు విక్రయించడంతోపాటు, బిల్లు చెల్లింపుల సేవలను కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. అమెజాన్‌ పే ద్వారా వ్యాలెట్‌ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. 

అమెజాన్ కస్టమర్లు మరో బ్యాంకుకు నగదు బదిలీ చేయొచ్చు
తాజాగా అమెజాన్‌ పే ద్వారా వినియోగదారులు తమ బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేయవచ్చు. ఈ మేరకు పర్సన్‌ టు పర్సన్‌ పేమెంట్స్‌ను ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు అమెజాన్‌ సోమవారం వెల్లడింది.

కాంట్రాక్ట్ మొబైల్ నంబర్‌తో బదిలీ చాలా ఈజీ
‘ఆండ్రాయిడ్‌లో అమెజాన్‌ యాప్‌ వినియోగిస్తున్న వారికి విస్తృతమైన షాపింగ్‌, చెల్లింపు సేవలను అందించడమే కాకుండా, మరిన్ని అదనపు సేవలను జోడించాం. ఇక నుంచి వినియోగదారులు ఇతర వ్యక్తులకు నగదు చెల్లింపులు కూడా చేయొచ్చు.

తమ మొబైల్‌లోని సదరు కాంటాక్ట్‌ నెంబర్‌ను ఎంపిక చేసుకుని వారికి  నగదు బదిలీ చేయొచ్చు’ అని అమెజాన్‌ పే డైరెక్టర్‌ వికాస్‌ బన్సల్‌ తెలిపారు. 

ప్రారంభ ఆఫర్‌లో అమెజాన్ ‘పే’పై రూ.120 క్యాష్ బ్యాక్ ఆఫర్
అమెజాన్‌ పే రిజిస్టర్‌ కస్టమర్‌ అయితే, దానిని అమెజాన్‌ తేలిగ్గా గుర్తిస్తుందని, సులువుగా నగదును బదిలీ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఒక వేళ అమెజాన్‌ పే యూపీఐ రిజిస్టర్‌ కాకున్నా, బీమ్‌ యూపీఐ ఐడీ ద్వారా నగదు పంపుకోవచ్చన్నారు.

ప్రారంభ ఆఫర్‌ కింద నగదు బదిలీ చేసే వినియోగదారులు రూ.120 వరకూ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చని పేర్కొన్నారు. అమెజాన్‌ పే ద్వారా జరిగే చెల్లింపులు చాలా భద్రంగా ఉంటాయని తెలిపారు.