హైదరాబాద్ శివారులో మరో భారీ కంపెనీ కొలువుదీరింది. ప్రముఖ కంపెనీ విప్రో రూ.300 కోట్ల రూపాయల పెట్టుబడులతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో విప్రో కన్జ్యూమర్ కేర్ ఫ్యాక్టరీ యూనిట్ నెలకొల్పింది. విప్రో యూనిట్‌ను పరిశ్రమల మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రూ.300 కోట్లతో ఏర్పాటు చేయనున్న విప్రో కన్జ్యూమర్ కేర్ ఫ్యాక్టరీ యూనిట్ ప్రారంభోత్సావానికి విచ్చేసిన విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కంపెనీలకు పాజిటివ్ దృక్పథంతో తెలంగాణ సర్కార్ స్వాగతం చెబుతోందని.. రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. కంపెనీలు రావడం వల్ల స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. కంపెనీ యూనిట్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.
అజీమ్ ప్రేమ్‌జీ వంటి వ్యక్తి మన మధ్య ఉండడం నిజంగా అదృష్టమని మంత్రి కేటీఆర్ అన్నారు. విప్రో సంస్థ రూ.300 కోట్లతో మహేశ్వరంలో ఫ్యాక్టరీ యూనిట్ ప్రారంభిస్తోందని.. అందులో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ సరళీకృత విధానాలతో 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని.. సుమారు 16 లక్షల ఉద్యోగాలు వచ్చేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ఒక కంపెనీ రావాలంటే చాలా కష్టం ఉంటుందని.. పక్క రాష్ట్రాలకు పోకుండా తెలంగాణకు వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు.
కంపెనీలు రావడంతో ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ ఏర్పాటయ్యే కంపెనీల్లో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా ఒప్పందాలు జరిగాయని.. అలా జరిగితేనే స్థానికులకు ఉపయోగం ఉంటుందన్నారు. స్థానిక యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు.
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఈ – సిటీలో విప్రో కన్‌స్యూమర్ కేర్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా అజీమ్ ప్రేమ్‌జీ మాట్లాడారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెరీవెరీ ఛార్మింగ్ అని ప్రేమ్‌జీ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకంగా ఉందని కొనియాడారు. కరోనా నియంత్రణలో తెలంగాణ కీలకంగా నిలిచిందన్నారు. పెట్టుబడులతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించుకుంటున్నామని పేర్కొన్నారు. తాము స్థాపించబోయే కంపెనీల్లో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని ప్రేమ్‌జీ తెలిపారు. ఈ సందర్భంగా అజీమ్ ప్రేమ్‌జీని మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి శాలువాతో సత్కరించి సన్మానించారు.
