ట్విట్టర్ పేరును, పిట్ట గుర్తును ఎందుకు వదులుకున్నాడంటే? ఎలన్ మస్క్ వివరణ ఇదే
ట్విట్టర్ పేరును, బర్డ్ లోగోను తొలగిస్తున్నట్టు ఎలన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని స్థానంలో ఎక్స్‌డాట్‌కామ్‌ను ప్రకటించారు. ఇంతకీ ఆయన ఈ సంచలన నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు అనే అనుమానాలు చాలా మందిలో వచ్చాయి. దీనికి ఆయనే స్వయంగా సమాధానం చెప్పారు.
న్యూఢిల్లీ: ఎలన్ మస్క్ సంచనాలకు కేరాఫ్. చంచలంగా కనిపించే ఆయన నిర్ణయాలు కూడా అంతే వేగంగా కనిపిస్తుంటాయి. మొన్నటికి మొన్నే ట్విట్టర్ పేరు మార్చాలని, దానికి లోగో కావాలని అడిగాడు. ఓ ఫ్యాన్ బాయ్ తయారు చేసిన లోగోను అఫిషియల్‌గా ప్రకటించేశాడు. ఇప్పుడు ఎక్స్.కామ్ అని టైప్ చేసినా ట్విట్టర్ ఓపెన్ అయిపోతున్నది. లోగోలోని పిట్ట ఎగిరిపోయింది. దాని స్థానంలో ఎలన్ మస్క్ ప్రకటించిన ఎక్స్ గుర్తు వచ్చి కూర్చుంది. ఇదంతా రోజుల వ్యవధిలో గడిచిపోయింది.
కొన్నేళ్ల తరబడి ట్విట్టర్, దాని లోగో చాలా ఫేమస్. ఆ లోగో కూడా పలుమార్లు పరిణామం చెంది మొన్నటి తుది రూపునకు వచ్చింది. ఎక్కడ ఆ బర్డ్ గుర్తు కనపడినా ట్విట్టర్ వెంటనే గుర్తుకు వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ గుర్తు, ఆ పేరు మాయమైపోతున్నది. ట్విట్టర్, ట్వీట్, రీట్వీట్ అనే దాని అనుబంధ పదాలు చరిత్రలోకి వెళ్లిపోతున్నాయి. బిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూ గల ఆ ట్విట్టర్ పేరు, గుర్తును గడ్డిపోచలా తీసిపారేశాడు ఎలన్ మస్క్. ఈ భారీ నిర్ణయంతో చాలా మంది షాక్ అయ్యారు. ఇది తప్పిదమే అంటూ పలువురు ఓ అభిప్రాయానికి వచ్చేశారు. అయితే.. ఈ మార్పు ఎందుకు అనే వివరణ ఈ సందర్భంలో ఎలన్ మస్క్ ఇచ్చారు.
ట్విట్టర్‌ను ఎక్స్ అనే కార్పొరేట్‌కు మార్చామని, అది ట్విట్టర్ భావ ప్రకటన స్వేచ్ఛకు, దాని పురోగతికి కట్టుబడి ఉంటుందని ఎలన్ మస్క్ ట్వీట్ సారీ.. ఎక్స్.కామ్‌లో పోస్టు చేశారు. ఇది ఏదో కేవలం పేరు మార్చడమే అనుకోవద్దని వివరించారు. ట్విట్టర్ గతంలో 140 పదాలకు పరిమితమై ఉండేదని, అప్పుడు దానికి ఓ పక్షి ట్వీటింగ్ చేస్తున్నదనే పోలిక నప్పేదని తెలిపారు. కానీ, ఇప్పుడు పదాల సంఖ్య పెరిగిందని, గంటల వ్యవధితో గల వీడియోలను ఇప్పుడు ఈ వేదికపై పోస్టు చేయవచ్చని వివరించారు.
అంతేకాదు, వచ్చే కొన్ని నెలల్లో ఈ వేదికపై కమ్యూనికేషన్స్‌ను, ఫైనాన్షియల్ వ్యవహారాలను జోడించనున్నట్టు మస్క్ ప్రకటించారు. కాబట్టి, ఆ నేపథ్యంలో ట్విట్టర్ అనే పేరు సరిపోదని వివరించారు. అందుకే ఆ పక్షికి సెలవు పలికామని పేర్కొన్నారు. ఈ వివరణ చాలా మంది సందేహాలు సమాధానం ఇచ్చినట్టయింది.