Tomato Price Hike:ప్రతి వంటింట్లో వంట వండాలంటే తప్పనిసరిగా ఉల్లి, టమాటా ఉండి తీరాల్సిందే. ఈ రెండింటిలో ఏది లేకపోయినా వంటల రుచి అంతగా ఉండదు. అందుకే మార్కెట్లో ఉల్లి, టమాటాకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం కిలో టమాటా ధర మార్కెట్లో రూ. 100 పైనే పలుకుతోంది. దీంతో సామాన్యుల వంట ఇంట్లో టమాటా మాయం అవుతోంది.
Tomato Price Hike: సరఫరా సమస్యల కారణంగా గత నెల రోజులుగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఇది కొత్త సమస్యగా మారింది. మెట్రో నగరాల్లో టమాటా రిటైల్ ధరలు కిలో రూ.77కి చేరాయి. అదే సమయంలో, దేశంలోని చాలా నగరాల్లో, టమాటా ధరలు రూ.100 కూడా దాటాయి.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఢిల్లీలో టమోటాల ధరలు పెద్దగా పెరగలేదు. ఢిల్లీలోని రిటైల్ మార్కెట్‌లో నెల రోజుల క్రితం కిలో రూ.30 కి విక్రయించే టమాటా ఇప్పుడు రూ.40 నుంచి 60కి పెరిగింది. అయితే, ఇతర నగరాల పరిస్థితి ఢిల్లీలా లేదు. టొమాటో ధరలు ముంబైలో టొమాటో ధరలు మే 1న కిలో రూ.36కి విక్రయించగా జూన్ 01న రూ.74కి చేరింది. ఈ క్రమంలో చెన్నైలో టమాట ధరలు కిలో రూ.47 నుంచి రూ. 62కు పెరిగాయి. కోల్‌కతాలో టమాటా ధరలు భారీగా పెరిగాయి. నెల రోజుల క్రితం కిలో రూ.25 మాత్రమే ఉండగా, ప్రస్తుతం రూ.77కు చేరుకుంది. ఇక హైదరాబాద్ లో గత నెల ఇదే రోజున కిలో రూ.30 లకు టమాటా విక్రయించగా, నేడు రూ. 80 దాటేసింది.
ఈ నగరాల్లో టమోటా వంద రూపాయలు దాటింది
ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలోని చాలా నగరాల్లో టమాట ధరలు కిలో రూ.100 కూడా దాటాయి. డేటా ప్రకారం తెలంగాణలోని టైర్ 2 పట్టణాలు వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి మార్కెట్లలో టమోటాలు సెంచరీ దాటేశాయి. డేటా ప్రకారం, ఆంధ్రప్రదేశ్ , కర్నాటక, మహారాష్ట్ర వంటి ప్రధాన టమోటా ఉత్పత్తి రాష్ట్రాలలోని అనేక నగరాల్లో దీని రిటైల్ ధర కిలో రూ. 50 నుండి రూ. 100 మధ్య ఉంటుంది.
ఒక నెలలో సగటు ధర చాలా పెరిగింది
ఆంధ్రప్రదేశ్, కర్నాటక వంటి ప్రధాన టమాటా ఉత్పత్తి రాష్ట్రాల నుంచి సరఫరా తక్కువగా ఉండడంతో వాటి ధరలు భారీగా పెరిగాయని వ్యాపారులు, నిపుణులు చెబుతున్నారు. గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా సగటు టమోటా ధరలు కూడా భారీగా పెరిగాయి. దేశంలో టమోటా సగటు రిటైల్ ధర మే 1న రూ.29.5 ఉండగా, జూన్ 1న రూ.52.30కి పెరిగింది. ఈ విధంగా, గత నెలలో టమోటా సగటు ధర 77 శాతం పెరిగింది.
కారణాలు ఇవే..
టమాటా ధరల పెరుగుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. అవేంటంటే.. ఒకటి రాష్ట్రంలో ఎండలు మండిపోవడం, రెండోది ఇంధన ధరలు అమాంతం పెరగడం అని పేర్కొంటున్నారు.
అలాగే ఈ సారి వేసవిలో ఎండలు మండిపోవడం, కూడా మే నెలలో టమాటా పంటల దెబ్బతినడానికి కారణం అయ్యిందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా రైతులు టమాటాను ఉత్పత్తి చేయలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా వాతావరణ పరిస్థితులు కారణంగా టమాటా పంటకు తీవ్ర నష్టం కలిగిందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇక మరోవైపు తెలంగాణలో లభిస్తున్న టమాటాలో అత్యధిక భాగం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి 70 శాతం టమాటా దిగుమతి అవుతోంది. రాష్ట్రంలో కేవలం 30 శాతం టమాటా మాత్రమే దిగుబడి అవుతుందని పేర్కొన్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి టమాటాను రవాణా చేయడం భారంగా మారిందని నిపుణులు పేర్కొంటున్నారు. పెరిగిన ఇంధనం ధరల కారణంగా, రవాణాపై భారం పడటంతో టమాటాపై రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.