Asianet News TeluguAsianet News Telugu

కుప్పకూలిన సన్ ఫార్మా షేర్లు...రెండు రోజుల్లోనే రూ.8,735 కోట్లు హాంఫట్

దేశీయ ఔషధ దిగ్గజం ‘సన్‌ ఫార్మా’కు విజిల్ బ్లోయర్ (ప్రజా వేగు) సెగ బాగానే తగిలింది. కేవలం రెండు రోజుల్లో 14.27 శాతం నష్టపోయిన సన్ ఫార్మా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తద్వారా సంస్థ మార్కెట్‌ విలువలో రూ.8736 కోట్ల కోత పడింది. ప్రమోటర్ల అక్రమాలపై సెబీకి మరో ఫిర్యాదు అందినట్లు వార్తలు రావడం వల్లే దుష్ప్రచారం చేస్తున్నారని సెబీకి లేఖ రాసిన సన్ ఫార్మా.. ఆ వార్తా కథనంలోని విషయాలతో సంబంధం లేదని ఎక్స్ఛేంజీలకు స్పష్టం చేసింది. తమ సంస్థకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఈ విషయమై జోక్యం చేసుకోవాలని సెబీని చైర్మన్‌ అజయ్‌ త్యాగిని సన్‌ ఫార్మా ఆ లేఖలో కోరింది. ఈ కుట్రలో కొన్ని మీడియా సంస్థల, వ్యక్తుల పాత్ర ఉందని ఈ విషయమై పూర్తిగా విచారణ జరపాలని కోరింది.  
Why Sun Pharma is under a cloud: Decoding Aditya Medisales link
Author
Mumbai, First Published Jan 19, 2019, 11:11 AM IST

న్యూఢిల్లీ: సన్‌ ఫార్మా ఇన్వెస్టర్లకు గడ్డుకాలం.. ఈ ఫార్మా దిగ్గజ సంస్థ గురు, శుక్రవారాల్లో శుక్రవారం కూడా ఈ దిగ్గజ ఔషధ కంపెనీ షేరు 14.27 శాతం నష్టపోయింది. అందులో శుక్రవారం 8.5% షేర్ కోల్పోయింది. కంపెనీ ప్రమోటర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు సెబీకి ఓ ప్రజావేగు ఫిర్యాదు చేశారని వచ్చిన వార్తలే దీనికి కారణంగా కనిపిస్తోంది. 

శుక్రవారం ఉదయం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)లో సన్ ఫార్మా షేర్ 12.11% నష్టంతో రూ.375.40 వద్ద ట్రేడింగ్ మొదలైంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) లోనూ 13.21% పతనంతో రూ.370.20 వద్ద మొదలైంది. ఆ తర్వాత కాస్త కోలుకున్నా  చివరకు 8.52 శాతం నష్టంతో రూ.390.75 వద్ద ముగిసింది. ఇది ఆరేళ్ల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. 

షేర్ పతనం ప్రభావంతో సన్ ఫార్మా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.8,735.71 కోట్లు హరించుకుపోయి రూ.93,751.44 కోట్లకు పరిమితమైంది. శుక్రవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో భారీగా నష్టపోయిన దిగ్గజ కంపెనీ షేర్ ఇదే కావడం గమనార్హం. ఆదిత్యా మెడి సేల్స్‌, సన్‌ ఫార్మా ప్రమోటర్ల మధ్య భారీ లావాదేవీలు జరిగినట్లు  ఆరోపిస్తూ ఓ ప్రజావేగు (విజిల్‌ బ్లోయర్‌) సెబీకి 172 పేజీల ఫిర్యాదు సమర్పించారని ఈ వార్త సారాంశం.
 
2014 -17 మధ్య ఆదిత్యా మెడిసేల్స్, సన్ ఫార్మా ప్రమోటర్ల మధ్య జరిగిన ఈ లావాదేవీల విలువ రూ.5,800 కోట్లు ఉంటుందని ఫైనాన్షియల్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ ‘మనీలైఫ్’  తన వార్తా కథనంలో తెలిపింది. సన్‌ ఫార్మా సహ ప్రమోటర్ సుధీర్‌ వాలియా నేతృత్వంలోని సురక్షా రియాల్టీ ఈ లావాదేవీలు నిర్వహించిందని పేర్కొంది. 

సన్‌ఫార్మాపై సెబీకి ఇలాంటి ఫిర్యాదు వచ్చినట్లు ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. సన్‌ఫార్మా ప్రమోటర్లు, మరికొందరు అతిక్రమణలకు పాల్పడుతున్నారని గత ఏడాది నవంబర్ నెలలో ఓ ఫిర్యాదు వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిని ధ్రువీకరించడమే కాక ఈ ఫిర్యాదులోని విషయాలను పరిశీలిస్తున్నట్లు అప్పుడు సెబీ తెలిపింది. ఇప్పుడు మరో సారి ఆ తరహాలోనే ఫిర్యాదు వచ్చిందన్న వార్తలతో సన్ ఫార్మా షేర్ భారీగా నష్టపోయింది.

మనీలైఫ్‌లో వచ్చిన వార్తా కథనం విషయాలతో తమకు సంబంధం లేదని సన్‌ఫార్మా ఎక్స్ఛేంజీలకు స్పష్టం చేసింది. అందువల్ల వాటిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని పేర్కొంది. కొందరు వ్యక్తులు, సంస్థలు తమ వాటాదార్ల ప్రయోజనాలను దెబ్బతీసేలా అనైతిక వ్యాపార పద్ధతులను అనుసరిస్తున్నట్లు ఆరోపిస్తూ, సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగికి సన్‌ఫార్మా ఓ లేఖ రాసింది. ఇందువల్ల వాటాదార్ల ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయని, షేర్ విలువ స్పల్పకాలంలోనే పతనమైందని పేర్కొంది.

కొన్ని ప్రసార మాధ్యమ సంస్థలు ఈ తరహా ఆరోపణలు/ ఫిర్యాదుల ప్రచారానికి తెరలేపుతున్నాయని సెబీ చైర్మన్ అజయ్ త్యాగికి రాసిన లేఖలో సన్ ఫార్మా తెలిపింది. వీటి కారకులపై విచారణ చేయాలని కోరింది. ప్రజావేగు (విజిల్‌ బ్లోయర్‌) సమర్పించిన పత్రాలు, ఇతరత్రా రహస్య ఈ-మెయిళ్లను తనిఖీల నిమిత్తం సంస్థాగత మదుపర్లకు కొన్ని మీడియా సంస్థలు అందజేశాయని తెలిపింది. 

ప్రజావేగు సమర్పించిన పత్రాల్లోని సమాచారం కొందరు వాటాదార్లకు మాత్రమే  చేరవేస్తుండటంతో, చిన్న మదుపర్లు సహా మిగతా మదుపర్లు నష్టపోవాల్సి వస్తోందని సన్ ఫార్మా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజావేగు సమర్పించిన 172 పేజీల ఫిర్యాదు తమకు ఇంతవరకు అందలేదని, అందులోని అంశాలు తమకు తెలియదని, అందువల్ల వార్త కథనంలో లేవనెత్తిన అంశాలపై ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్య చేయబోమని తెలిపింది. ఈ లేఖ నకలును స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు కూడా సన్‌ ఫార్మా అందజేసింది.

కాగా సన్‌ఫార్మాపై ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసు విచారణను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని కొన్ని వర్గాలు గతేడాది నవంబర్ నెలలోనే తెలిపాయి. విదేశాల్లో నిధుల సమీకరణ విషయంలో కంపెనీ ప్రమోటర్లు కొందరు అక్రమాలకు పాల్పడటంపై కూడా విచారణను పునఃప్రారంభించే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. 2017 ఆగస్టులో సన్‌ఫార్మా, దిలీప్‌ సంఘ్వీతోపాటు తొమ్మిది ఇతర సంస్థలు రూ.18 లక్షలు చెల్లించి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ దర్యాప్తును నిలిపి వేయించుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios