న్యూఢిల్లీ/ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ‘బేర్’మంటూనే ఉన్నాయి. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ పై రూపాయి విలువ గురువారం భారీగా పతనమైంది. ఒకశాతం నష్టపోయి రూ.74.98 వద్ద అంటే రూ.75లకు చేరువైంది. పసిడి ధర కూడా ఒక శాతం పతనమైంది.

నగదు, భారతదేశంలో ప్రజల్లోకి వైరస్ విస్తరణ, క్రెడిట్ డిఫాల్ట్ భయాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల విక్రయం, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి వంటి అంశాలు గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేశాయి. తొలి కొన్ని నిమిషాల్లోనే బీఎస్ఈ సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా పతనమైంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనమైంది. కేవలం కొన్ని నిమిషాల్లో రూ.7 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. 

మరోవైపు గురువారం మధ్యాహ్నం 11.13 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ రోజువారీ అంతర్గత ట్రేడింగ్ లో 1000 పాయింట్లకు పైగా రికవరీ సాధించినా ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 8200 పాయింట్ల దిగువన కదలాడుతోంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏడు శాతానికి పైగా పతనమై ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది. 

మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆరు శాతం నష్టంతో నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఇక బీఎస్ఈలోని 30 స్టాక్స్‌లో ఐదు మినహా 25 స్టాక్స్ రెడ్ జోన్ లోనే కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్, ఐటీసీ షేర్లు మాత్రం లాభాల్లో సాగుతున్నాయి. రియాల్టీ ఇండెక్స్ 9.73 శాతం పతనమైంది. ఎన్ఎస్ఈలో ఐటీసీ, వొడాఫోన్ ఐడియా, యెస్ బ్యాంక్, ఓఎన్జీసీ షేర్లు యాక్టివ్ గా ఉన్నాయి. 

బుధవారం ట్రేడింగ్‌లో అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. డోజోన్స్ 6.3 శాతం, నాస్డాక్ 4 శాతం, ఎస్ అండ్ పీ 500 కూడా నష్టాలతోనే ముగిశాయి. గురువారం ఉదయానికి ఫ్యూచర్స్ విభాగంలో డోజోన్స్ 700 పాయింట్లకు పైగా పతనం కావడం సంక్షోభం తప్పదనే సంకేతాలు మదుపర్లలోకి స్పష్టంగా వెళ్లాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు పతనాన్ని ఎదుర్కోవడానికి కారణమిదేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బుధవారం రాత్రి భారీగా పతనమయ్యాయి. అమెరికా బ్రెంట్ ఆయిల్ బ్యారెల్ ధర 20 డాలర్ల వద్దకు చేరి 2002 నాటి స్థాయికి పతనమైంది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఓఎన్జీసీ, రిలయన్స్ షేర్లు భారీగా నష్టపోయాయి.

బుధవారం రాత్రి అమెరికా ఫెడరల్ రిజర్వు రంగంలోకి దిగింది. మినీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ కోసం అత్యవసర రుణాలు మంజూరు చేస్తామని పేర్కొన్నది. ఫైనాన్సియల్ మార్కెట్లకు ఇబ్బంది లేకుండా ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించడం రాబోయే కష్టాలకు సంకేతమని మదుపర్లు భావిస్తున్నారు. కరోనా వైరస్ కేసులు 2.15 లక్షలు దాటాయి. 

కరోనా ప్రభావం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. పటిష్ఠ మూలాలు ఉన్న షేర్లు కూడా భారీగా నష్టపోతున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ముందుకు ఓ ప్రతిపాదన వచ్చింది. ఇలా ప్రతిరోజూ మార్కెట్లు పతనమౌతున్నప్పుడు వాటిని మూసివేయడమే మంచిదని అసెట్ మేనేజర్లు కోరినట్లు వార్తలొచ్చాయి. 

అమెరికా మార్కెట్ల విషయంలోనూ ఇదే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. అమెరికా, బ్రిటన్ మార్కెట్ల మూసివేతకు నిర్ణయం తీసుకుంటే మిగతా దేశాలు కూడా పాటించే అవకాశాలు ఉన్నాయి.