దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎప్పుడూ నీలి రంగు తలపాగ ధరించేవారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం రండి.
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ఆరోగ్యం డిసెంబర్ 26న క్షీణించడంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
దేశంలో వివిధ ప్రాంతాలు, మతాలు నుంచి వచ్చి ప్రధానులు అయిన వారు ఉన్నారు. కాని సిక్కు సమాజం నుండి భారతదేశానికి మొదటి ప్రధాని అయినది మాత్రం మన్మోహన్ సింగ్ మాత్రమే. ఆయన ప్రముఖ ఆర్థికవేత్త కూడా. తలపాగ ధరించడం సిక్కుల సంప్రదాయం. అందులో భాగంగానే మన్మోహన్ సింగ్ ఎప్పుడూ తలపాగతోనే కనిపించేవారు. అయితే ఆ తలపాగ ఎప్పుడూ బ్లూ కలర్ లోనే ఉండేది. అంటే ప్రధాని అయిన తర్వాత మాత్రమే సెంటిమెంట్ గా నీలి రంగు తలపాగ ధరించారని మీరు అనుకోవచ్చు. కాని అది నిజం కాదు. ఆయన చదువుకునేటప్పటి నుంచీ ఇదే రంగు తలపాగ ధరిస్తున్నారు. చివరి నిమిషం వరకు ఆయన నీలి రంగు తలపాగనే ధరించారు.
నీలి రంగు తలపాగ ఎందుకు?
మీరు ఎప్పుడూ నీలి రంగు తలపాగ ఎందుకు ధరిస్తున్నారు అని ఓ విలేకరి అడిగిన ఈ ప్రశ్నకు మన్మోహన్ సింగ్ 2013లోనే సమాధానం చెప్పారు. "నీలి రంగు నాకు చాలా ఇష్టం. అందుకే ఆ రంగు తలపాగ ధరిస్తున్నాను. అంతేకాదు నేను చదువుకున్న కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం రంగు కూడా నీలి రంగే. అక్కడ నేను చదువుకున్న రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నీలి రంగు తలపాగ ధరిస్తున్నాను" అని మన్మోహన్ సింగ్ అన్నారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ 1957లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 2006లో అదే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. మన్మోహన్ సింగ్ మంచి విద్యార్థి మాత్రమే కాదు, మంచి ఉపాధ్యాయుడు కూడా.
సీనియర్ లెక్చరర్
1957 నుండి 1959 వరకు ఆర్థికశాస్త్రంలో మన్మోహన్ సింగ్ సీనియర్ లెక్చరర్‌గా పనిచేశారు. 1966లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గౌరవ ప్రొఫెసర్ అయ్యారు. 1969 నుండి 1971 వరకు అంతర్జాతీయ వాణిజ్య శాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1976లో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్‌గానూ పనిచేశారు.
