Asianet News TeluguAsianet News Telugu

నల్లధనానికి అడ్డుకట్ట: క్రమంగా తగ్గుతున్న రూ.2000 నోటు!

నల్లధనం వెలికితీయడంతోపాటు అవినీతిని అరికట్టేందుకు 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధాని నరేంద్రమోదీ పాత పెద్దనోట్లు రూ.1000, రూ.500 విలువైన నోట్లు రద్దు చేశారు. తర్వాత జారీ చేసిన రూ.2000 నోటు ముద్రణ తగ్గుముఖం పట్టింది. దీనికి నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం, ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Why has circulation of Rs 2000 notes decreased this year? Read to know more
Author
Mumbai, First Published Aug 31, 2018, 11:36 AM IST

భవిష్యత్‌లో రూ.2,000 నోటు అరుదుగా కనిపించబోతోందా? ఈ దిశగానే భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) చర్యలు తీసుకుంటుందా? ఈ నోటును ‘రద్దు’ చేయకుండానే చలామణిని తగ్గించేయాలని భావిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం సెంట్రల్ బ్యాంక్ భవిష్యత్‌ వ్యూహం ఇదేననే అభిప్రాయాలు ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్నాళ్లపాటు ఎవరి చేతిలో చూసినా రూ.2,000 నోటే.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోనున్నది.

రూ.2000 నోటు చలామణి క్రమంగా తగ్గిపోతోంది. నల్లధనాన్ని కూడబెట్టుకునేందుకు ఈ నోటు బాగా ఉపయోగపడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ రూ.2,000 నోట్ల ముద్రణ, సరఫరాను గణనీయంగా తగ్గించి వేస్తోంది. ఆర్బీఐ విడుదల చేసిన తాజా వార్షిక నివేదికతో ఇది వెల్లడైంది. గత ఏడాదిలో చలామణిలో ఉన్న నోట్లలో 2,000 నోటు వాటా 50 శాతం ఉంటే.. ఇప్పుడది 37 శాతానికి తగ్గిపోయింది. ఈ నోట్ల ముద్రణ కోసం ఆర్బీఐ ఇచ్చే ఇండెంట్‌ (ఆర్డర్) 2017-18లో 15.1 కోట్ల నోట్లకు తగ్గిపోయింది. 

అంతకు ముందేడాది (2016- 17)లో 350 కోట్ల నోట్లకు ఆర్బీఐ ఇండెంట్‌ ఇచ్చింది. అంటే ఏడాదిలో 95 శాతానికి పైగా తగ్గిందన్న మాట. రూ.2,000 నోటు సరఫరా తగ్గించడం వెనుక వ్యూహం నల్లధనాన్ని కట్టడి చేయడమే ఆర్బీఐ ప్రధాన ఉద్దేశమని అభిప్రాయ పడుతున్నారు. అధిక విలువ కలిగిన నోట్లను దాచడం సులభమని, అదే జరిగితే.. నల్లధనాన్ని నివారణకు కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్ద నోట్ల లక్ష్యం విఫలమవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇక 500 నోట్ల విషయానికిస్తే.. 2016-17లో వీటి చలామణి 23 శాతం ఉంటే 2017-18లో 43 శాతానికి పెరిగింది. విలువ పరంగా చూస్తే 5.9 శాతం నుంచి 15.1 శాతానికి చేరుకుంది. 2017-18 సంవత్సరంలో ఈ నోట్ల ఇండెంట్‌ 921.3 కోట్ల నోట్లకు పెరిగింది. ఇదే కాలంలో సప్లయ్‌ 969.3 కోట్ల నోట్లకు చేరుకుంది.

ఇదిలా ఉంటే.. వివిధ డినామినేషన్లలోని మొత్తం కరెన్సీల కోసం ఆర్బీఐ 2017-18లో ఇచ్చిన ఇండెంట్‌ అంతకు ముందు ఏడాదితో పోల్చితే 9.1 శాతం పెరిగింది. చలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ ఈ ఏడాది మార్చినాటికి 37.7 శాతం పెరిగి రూ.18 లక్షల కోట్లకు చేరుకుంది. నోట్ల పరిమాణం కూడా 2.1 శాతం పెరిగింది. చలామణిలో ఉన్న నోట్ల విలువలో రూ.500, రూ.2,000 నోట్ల వాటా 2017 మార్చి చివరినాటికి 72.7 శాతం ఉండేది. 2018 మార్చి చివరినాటికి ఇది 80.2 శాతానికి చేరుకుంది.
 
ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్ల ముద్రణ కోసం ఆర్బీఐ ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. కొన్నేళ్ల తర్వాత నోట్లు చిరిగి పోవడం వల్ల వాటి స్థానంలో కొత్త నోట్లను ముద్రించాలి. ఇది కూడా అదనపు భారమే. ఎన్ని రకాల భద్రతా ఫీచర్లు తెచ్చినా నకిలీ నోట్ల బెడద మాత్రం తప్పడం లేదు.

ఈ నేపథ్యంలో ఎక్కువ కాలం మన్నికగా ఉండటమేకాక నకిలీకి అవకాశం లేకుండా చేసే వార్నిష్డ్‌ కరెన్సీ నోట్లను త్వరలోనే ప్రయోగాత్మకంగా చలామణిలోకి తేవాలని ఆర్బీఐ యోచిస్తోంది. వీటి వల్ల ముద్రణ వ్యయం కూడా తగ్గుతుందని చెబుతున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios