న్యూఢిల్లీ: గగనతలంలో దర్జా చూపి, మోడ్రనైజేషన్‌కు, సరికొత్త టెక్నాలజీకి మారుపేరుగా నిలిచిన బోయింగ్ 737 మాక్స్-8 విమానాలు కనుమరుగు కానున్నాయా? ఈ ప్రశ్నకు పరస్పర విరుద్ధ సమాధానాలు వినిపిస్తున్నాయి. బోయింగ్ 737 మాక్స్-8 విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

లయన్‌ ఎయిర్‌కు చెందిన విమానం ఇండోనేషియా సముద్రజలాల్లో కుప్పకూలిన ఘటన స్మృతి పథం నుంచి తొలగక ముందే.. మరో దుర్ఘటన జరిగింది.ఈ సారి ఇథియోపియా ప్రభుత్వ రంగ సంస్థ ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆ దేశంలోనే కుప్పకూలడంతో 157 మంది దుర్మరణం పాలయ్యారు.ఈ రెండు ఘటనల్లోనూ ప్రమాదానికి గురైన విమానం మోడల్‌ ‘బోయింగ్‌ 737 మాక్స్‌ 8’కావడం గమనార్హం.

తాజా ఘటనలో బోయింగ్‌కు కష్టాలు ఎక్కువ కానున్నాయి. అమెరికా మాత్రం ఆ విమానాలు భద్రమైనవేనని అంటున్నా.. ఆస్ట్రేలియా నుంచి మెక్సికో వరకు విమానయాన నియంత్రణాధికార సంస్థలు ఆ విమానాలనే నిషేధిస్తున్నాయి. 1960ల్లో 737 మోడల్‌ను తీసుకొచ్చిన బోయింగ్‌కు దాని వల్ల భారీ విక్రయాలు జరిగాయి. ఆ తర్వాత మాక్స్‌ మోడల్‌ను తీసుకురాగా.. 5000 ఆర్డర్లు వచ్చాయి. ఇపుడు ఆ ఆర్డర్లు డోలాయమానంలో పడ్డాయి.

తాజాగా ఇథియోపియా విమాన ప్రమాదంతో విమానయాన సంస్థలు, నియంత్రణ సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బోయింగ్‌ 737 మాక్స్‌ 8 కార్యకలాపాలను రద్దు చేస్తున్నాయి. తాజాగా అమెరికాలో సైతం వీటిని నిలిపివేస్తూ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ తరుణంలో తరచుగా విమాన ప్రయాణాలు చేసే వారికి ఆందోళన కలగడం సహజం. ఆయా దేశాలు ఈ మోడల్‌ విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపి వేసినందున, తమ ప్రయాణాలపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. కానీ ఈ మోడల్‌ విమానాలు ప్రపంచవ్యాప్తంగానే 376 మాత్రమే ఇప్పటివరకు నడుస్తున్నందున, ప్రయాణాలపై అధిక ప్రభావం పడదనే నిపుణులు పేర్కొంటున్నారు.

కొన్ని దేశాలు మాత్రం మార్చి 10న జరిగిన ప్రమాద కారణాలు తెలిసే వరకు మాక్స్‌ విమానాలను పక్కన పెట్టనున్నాయి. మన దేశానికి వస్తే స్పైస్‌జెట్‌ వద్ద 12, జెట్‌ ఎయిర్‌వేస్‌ గల ఐదు ఈ మోడల్‌ విమానాలను నిలిపేశారు. వీటిని రద్దు చేసినా, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని విమానయాన సంస్థలు ప్రకటిస్తున్నాయి. 

తాజా పరిణామాల వల్ల దేశీయ సాధారణ బీమాకంపెనీలపై ఎటువంటి ప్రభావం పడదని అధికార వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఇతర దేశాలకు వెళ్తూ, విమాన టికెట్లను ఖరీదు చేసి వారికి ఎక్కబోయేది 737 మాక్స్‌ విమానమా కాదా అన్న అనుమానం రావొచ్చు. 

అటువంటప్పుడు టికెట్‌ను పరిశీలిస్తే.. బుకింగ్‌ వివరాల్లోనూ ఉంటుంది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసి ఉండే.. చాలా సైట్లు విమాన మోడల్‌ వివరాలను ఇస్తాయి. ఒక వేళ లేకపోతే ఫ్లైట్‌స్టాట్స్‌.కామ్‌ను పరిశీలించాలి.

ఒకవేళ అదే విమాన మోడల్‌ అదే అయితే ఒక వేళ మార్చుకోవాలి అనుకుంటే.. చాలా విమానయాన సంస్థలు అందుకు అనుమతినిస్తాయి. కాకపోతే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 

737 మాక్స్‌ విమానాలను ఎక్కువగా ఉపయోగించే సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ ఇప్పటికే తమ ప్రయాణికులకు ఎటువంటి ఛార్జీలు లేకుండా మార్చుకోవడానికి వీలు కల్పిస్తోంది.  

అంతర్జాతీయ విమానాల సంఖ్యలో 737 మాక్స్‌ విమానాల శాతం చాలా తక్కువే కాబట్టి విదేశాలకు వెళ్లే వారి ప్రయాణానికి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఫిబ్రవరి చివరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ మోడల్‌ విమానాలను 376 బోయింగ్‌ డెలివరీ చేసింది. 2017 చివరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమానాల సంఖ్య 24,400 మాత్రమే.

బోయింగ్‌ 737 మాక్స్‌ ప్రమాద వివరాలు తెలిసే వరకు, ఇతర బోయింగ్‌ మోడళ్లలో కార్యకలాపాలు నిర్వహించాలని చాలా వరకు విమానయాన సంస్థలు భావిస్తున్నాయి. అదే మార్గంలో వెళ్లే ఇతర విమానాల్లో ప్రయాణికులకు తిరిగి బుకింగ్‌ చేస్తున్నాయి. 

అంతర్జాతీయంగా విమానయాన సంస్థల మధ్య ఒప్పందాలు ఉంటాయి. వీటి కింద ఏదైనా కారణంతో విమానం రద్దయితే, ఇతర విమానయాన సంస్థల విమానాల్లో ప్రయాణికులను పంపుతుంటారు. ఇపుడూ అదే చేస్తున్నారు.

ఇథియోపియాలో దర్యాప్తు ఎపుడు కొలిక్కి వస్తుందన్న దాన్ని బట్టి ‘బోయింగ్ 737 మ్యాక్ ’ విమానాల భవితవ్యం ఆధారపడి ఉంది. దర్యాప్తు పూర్తయి.. ఏవైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటే.. అవి పూర్తయ్యాక కానీ ఈ విమానాలపై నిషేధం ఎంత వరకు కొనసాగుతుందన్నది తెలియదు. 

గతేడాది అక్టోబర్ 29వ తేదీన జరిగిన లయన్‌ ఎయిర్‌ విమాన దుర్ఘటనలో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లోని ఒక లోపం వల్ల విమానం కుప్పకూలిందని తెలిసింది. తాజా ఘటనలో ఇప్పటికే విమాన డేటా రికార్డర్‌, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. 

వీటిని ఐరోపా పంపుతున్నట్లు సదరు ఎయిర్ లైన్స్ ప్రకటించాయి. మరి ఈసారి ఇథియోపియా విమాన ప్రమాదానికి ఏ కారణం వెల్లడవుతుందో అని ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తోంది. బ్లాక్‌బాక్స్‌ లభించినందున త్వరలోనే ప్రమాద కారణం తెలుస్తుందని అందరూ భావిస్తున్నారు.

ఇథియోపియా ప్రమాదం నేపథ్యంలో బోయింగ్‌ సంస్థకు చెందిన విమానాల ఆర్డరు విషయంలో విమానయాన సంస్థలు ఆలోచనలో పడ్డాయి. ఇప్పటికే కెన్యా ఎయిర్‌వేస్‌ తన ఆర్డరుపై పునరాలోచనలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 370కి పైగా ఈ మోడల్‌ విమానాలు సేవలందిస్తుండగా.. 5,000 వరకు ఆర్డర్లు ఉన్నాయి. 

ఎయిర్‌బస్‌ ఎస్‌ఈకి చెందిన ఎ320కి మారే అవకాశం ఉందని, లేదంటే బోయింగ్‌లోనే పెద్ద విమానం 787 డ్రీమ్‌లైనర్‌ను పరిశీలించొచ్చని ఆ సంస్థ ఛైర్మన్‌ మైఖేల్‌ జెసెఫ్‌ చెబుతున్నారు. ఇక అక్టోబర్ 29 నాటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని లయన్‌ ఎయిర్‌ తన 22 బిలియన్ డాలర్ల ఆర్డరును వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

తాజా ప్రమాదం నేపథ్యంలో భారత్‌ సహా పలు దేశాలు బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాలను నిషేధించాయి. కొన్ని విమానయాన సంస్థలు ఆ విమానాల కార్యకలాపాలను నిలిపివేశాయి. మరికొన్ని దర్యాప్తు జరుగుతున్నందున కొనసాగిస్తున్నాయి. 

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఆస్ట్రేలియా, చైనా, భారత్‌, ఇండోనేషియా, కజకిస్థాన్‌, మలేషియా, న్యూజిలాండ్‌.. మధ్య ప్రాచ్యంలోని ఈజిప్ట్‌, కువైట్‌, లెబనాన్‌, ఒమన్‌, యూఏఈలతోపాటు అన్ని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు, టర్కీ, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాలు బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలను నిషేధించాయి. 

కానీ తమ విమానం చాలా సురక్షితమైందని బోయింగ్ ప్రతినిధి తెలిపారు. సందేహాలను నివ్రుత్తి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోనూ చర్చించారు. ఇదిలా ఉంటే భారత్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ కూడా బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలను విమానాశ్రయాలకు పరిమితం చేయాలని దేశీయ విమానయాన సంస్థలను ఆదేశించారు. 

ఆయా విమానయాన సంస్థలు, నియంత్రణ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర వాణిజ్య, విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు అధికారులను ఆదేశించారు. అయితే గతేడాది అక్టోబర్‌లో లయన్ ఎయిర్‌, ఈ నెల 11న అడిస్‌అబాబా సమీపంలో ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ మాక్స్-8 ప్రమాదాల తీరు ఒకేలా ఉన్నది. 

టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే ఈ రెండు విమానాలు కుప్పకూలాయి. సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వెనుకకు వచ్చేందుకు అనుమతించాలని పైలట్లు విజ్ఞప్తి చేసిన కొద్ది క్షణాల్లోనే విషాదం చోటుచేసుకున్నది. ఈ నేపథ్యంలో బోయింగ్ విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాల తయారీ సంస్థ అయిన అమెరికాకు చెందిన బోయింగ్‌పై ముప్పేటా దాడి తీవ్రతరమైంది.