కేంద్రంలోని మోదీ సర్కార్‌పై ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్‌ బజాజ్‌ తీవ్ర విమర్శలు చేశారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ విధానాల్ని విమర్శించే దమ్ము కూడా లేకుండా పోయిందన్నారు. ఒక ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో బజాజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

లోలోపల అసంతృప్తి ఉన్నా ఎక్కడ ఆ విషయాన్ని బయటికి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోననే భయంతో పారిశ్రామికవేత్తలు నోరు కట్టేసుకుంటున్నట్టు బజాజ్‌ తెలిపారు. ‘యూపీఏ-2 హయాంలో ఎవరినైనా విమర్శించే అవకాశం ఉండేది. మీరు మంచి పనులే చేస్తున్నారు. అయినా కొన్ని విషయాల్ని మేము బహిరంగంగా విమర్శిస్తే మీరు మెచ్చుకుంటారన్న నమ్మకం మాకు లేదు’ అని కుండబద్ధలు కొట్టారు.
 
‘నా పారిశ్రామిక మిత్రులు ఎవరూ ఈ విషయం మాట్లాడరు. నేను మాత్రం ఈ విషయం బహిరంగంగానే చెబుతున్నా. నేను చెబుతున్న ఈ విషయం తప్పు కావచ్చు. అయితే అందరూ ఇదే అనుకుంటున్నారు’ అని రాహుల్ బజాజ్ పేర్కొన్నారు. రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు ఆరున్నరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన నేపథ్యంలో బజాజ్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. 

ఇదే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌ షా వెంటనే బజాజ్‌ వ్యాఖ్యలను తోసిపుచ్చారు.గతంలోనూ విమర్శలు రాహుల్‌ బజాజ్‌.. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడం ఇదే తొలిసారి కాదు. మోదీ సర్కార్‌ ప్రతిష్ఠ మసకబారుతోందని 2015లోనే బజాజ్‌ విమర్శించారు. 

స్వేచ్ఛ ఉన్నందునే రాహుల్ బజాజ్ విమర్శలు చేయగలిగారని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మరో అడుగు ముందుకేసి సమాజంలో క్రమశిక్షణా రాహిత్యం వల్లే ఇటువంటి దుస్థితి నెలకొన్నదని ట్వీట్ చేశారు. నకిలీ భయాలు కలిగిస్తున్నందు వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న పూరి.. అలా ఎవరు చేస్తున్నారో పేర్కొనక పోవడం గమనార్హం. 

ఆయన కుమారుడు రాజీవ్‌ బజాజ్‌ కూడా 2017లో మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దుతో జీడీపీ వృద్ధి రేటు చతికిల పడి, నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. విద్యుత్‌ వాహనాల విషయంలోనూ మోదీ సర్కార్‌ పిల్లి మొగ్గలు వేస్తోందని ఇటీవల విమర్శించారు. పడిపోతున్న డిమాండ్‌ను గాడిలో పెట్టేందుకు ప్రైవేట్‌ పెట్టుబడులు పెంచేందుకూ మోదీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇటీవల జరిగిన బజాజ్‌ వార్షిక సమావేశంలో రాహుల్‌ బజాజ్‌ దెప్పి పొడిచారు.