Asianet News TeluguAsianet News Telugu

జెఫ్ బెజోస్-మెక్కెంజీ డైవోర్స్ సరే.. అమెజాన్ భవితవ్యం?

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన భార్య మెక్కంజీ విడిపోతున్నట్లు ప్రకటించారు. వారిద్దరూ విడిపోవడం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో అమెజాన్ సంస్థ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పరిస్థితులు తారుమారైతే బెజోస్ తదుపరి వాటాదారు వాన్‌గార్డ్ సంస్థ యాజమాన్య హక్కుల కోసం ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు.

What Jeff and MacKenzie Bezos' divorce could mean for Amazon
Author
Washington, First Published Jan 12, 2019, 11:18 AM IST

ప్రపంచంలోనే అత్యంత కుబేరుడైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తన భార్యతో విడాకులు తీసుకోవడం అమెరికా కుటుంబ వ్యవస్థలో పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడి వ్యక్తి ప్రపంచ కుబేరుడు కావడమే అసలు సమస్య.

ఇది అమెజాన్‌లోని వేల ఉద్యోగుల కుటుంబాలతో పాటు మదుపర్ల భవితవ్యంతో ముడి పడి ఉన్న ఈ పరిణామం. ఈ విపత్కర అంశం అమెజాన్‌ను ఎటు వైపునకు అడుగులు వేయిస్తుందన్నది తేలాల్సి ఉంది. 

ఇలాగైతేనే విడాకులు వస్తాయి
ముందస్తు ఒప్పందం లేకుంటే భార్యకు భర్త సగం ఆస్తి భరణంగా అందజేస్తేనే విడాకులు లభిస్తాయి. అయితే విడాకుల ఒప్పందంలోనూ వారి అభిప్రాయాలు పొసగకపోతేనే సమస్య మొదలవుతుంది. కంపెనీపై నీలినీడలు కమ్ముకుంటాయి.

ఒక వేళ మెకంజీ తన వాటాను ఇతరులకు విక్రయిస్తుంటారా? తన వద్దే ఉంచుకుంటారా? అన్నది ఇపుడే చెప్పలేం. ఒక వేళ ఇతర పోటీ సంస్థలు ఇదే అదనుగా భావించి ఆమె వాటాను కొనుగోలు చేస్తే సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు. 

అమెజాన్ చేజారకుండా ఉండాలంటే..
ఇప్పటికే తక్కువ వాటా వల్ల భవిష్యత్‌లో బెజోస్‌ చేతి నుంచి అమెజాన్ కంపెనీ జారినా జారిపోవచ్చు. కంపెనీ చేజారకుండా చూసుకోవాలంటే కంపెనీ కార్యకలాపాలకు ఇబ్బంది రాకుండా షేర్ల ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అందుకు వేచి చూడాల్సి ఉంది. ఇక అత్యధిక వ్యక్తిగత వాటా వీరిద్దరిదే కానుంది. ఒక వేళ 8%, 8 శాతంగా విడిపోయినా వీరిదే పైచేయి. 

పరిస్థితులు తారుమారైతే.. వాన్ గార్డ్ వంటి వారు ముందుకు రావొచ్చు
అమెజాన్ సంస్థలో రెండో అత్యధిక వ్యక్తిగత వాటా 6 శాతం వాన్‌గార్డ్‌ చేతిలో ఉంది. పరిస్థితులు తారుమారైతే.. సంస్థను ఆధీనంలోకి తీసుకోవడానికి బెజోస్‌ తర్వాత అధిక వాటా ఉన్న వాన్‌గార్డ్‌ కూడా పావులు కదిపినా ఆశ్చర్యం లేదు.

అపుడు కంపెనీలో ఆధిపత్యంపై పోరు తప్పదు. అదే జరిగితే వేలకొద్దీ కుటుంబాలు, మదుపర్ల పరిస్థితిని ఊహించలేం. ఈ పరిణామాల మధ్య అమెజాన్‌ భవితవ్యం ఎటు వెళుతుందన్న అపుడే చెప్పలేమని అమెరికా మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 

ఇలా కలిసిన బెజోస్, మెక్కెంజీ మనస్సులు
వాల్‌స్ట్రీట్‌లో హెడ్జ్‌ ఫండ్‌ మేనేజరుగా బెజోస్‌ పనిచేస్తున్న సమయంలో అంటే 1992లో ఈ జంట కలిసింది. అప్పటికి అమెజాన్‌ను ఏర్పాటు చేయలేదు. ఒక ఏడాది కంటే తక్కువ సమయంలోనే మనసులు కలిశాయి. 1993 సెప్టెంబరులో ఫ్లోరిడాలో పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాతి ఏడాదే సియాటెల్‌లోని ఒక గ్యారేజీలో బెజోస్‌ తన అంకుర సంస్థ అమెజాన్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అమెజాన్‌ వటుడింతై వరకు బెజోస్‌ భార్య మెకంజీ వెన్నంటే ఉన్నారు. కానీ బుధవారం అంటే దాదాపు పాతికేళ్ల తర్వాత తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. 

బెజోస్ కుటుంబం నేపథ్యం ఇదీ..
బెజోస్‌కు ఇపుడు 54 ఏళ్లు. భార్య, నవలా రచయిత్రి అయిన మెకంజీకి 48 ఏళ్లు. వీరికి ముగ్గురు కుమారులు. ఒక దత్త కుమార్తె ఉన్నారు. ఫ్లోరిడాలో వీరి పెళ్లి జరిగినా విడాకులు తీసుకోవాలనుకున్నా  ఎక్కడ ఉన్నారన్న దాన్ని బట్టి విడాకుల ప్రక్రియ ఉంటుందని ఏఎఫ్‌పీ అంటోంది.

వీరికి అమెజాన్‌ ప్రధాన కార్యాలయం ఉన్న సియాటెల్‌తో పాటు వాషింగ్టన్‌ డీసీ, టెక్సాస్‌, బెవర్లీ హిల్స్‌, కాలిఫోర్నియాల్లోనూ నివాసాలు ఉన్నాయి. అట్లాంటాలోని కుటుంబ చట్ట సంస్థ అయిన కెస్లర్‌ ప్రతినిధి అంటున్నారు. విషయం ఏమిటంటే అక్కడి చట్టాల ప్రకారం.. ముందస్తు ఒప్పందం లేకపోతే భాగస్వామికి తన ఆస్తిలో సగం ఇవ్వాల్సి ఉంటుంది. 

మెక్కెంజీకి ఎంత ఆస్తి వెళుతుంది 
ప్రస్తుతం బెజోస్‌కున్న ఆస్తుల్లో ఎక్కువ భాగం అమెజాన్‌ షేర్ల రూపంలో ఉన్నవే. గురువారం నాటి లెక్కల ప్రకారం.. బెజోస్‌కు అమెజాన్‌లో ఉన్న 18 శాతం(7.9 కోట్ల షేర్లు) వాటా 130 బిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.9.1 లక్షల కోట్లు). విడాకుల సెటిల్‌మెంట్ జరగాలంటే ఈ షేర్లలోనూ సగం వాటా ఆమెకు వెళ్లే అవకాశం ఉంది.

అంటే ఆమెకు అమెజాన్‌లో 8 శాతం(రూ.4.5 లక్షల కోట్లకు పైగా) వాటా దక్కుతుంది. ఇక ఓటింగ్‌ హక్కుల విషయం పెద్దగా ప్రస్తావనలోకి రాదు. ప్రస్తుతం జెఫ్‌ బెజోస్‌ ఒక మైనారిటీ వాటాదారు కావడం ఇందుకు నేపథ్యం. 

కంపెనీలో వారి పరిస్థితి ఏమిటి? 
బెజోస్‌ భార్యకు సగం షేర్లు వెళితే ఆమె కూడా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరుగా మారతారు. ఒక వేళ విడాకుల ఒప్పందంలో భాగంగా వారు తమ షేర్లను ఒక ట్రస్టు లేదా ఏదైనా చట్టబద్ధ వ్యవస్థలోకి బదిలీ చేసి.. అమెజాన్‌ వాటాదార్లలో తమ అధికారాన్ని అట్టే పెట్టిఉంచుకునే అవకాశం కూడా ఉంది. 

విడాకుల దిశగా బెజోస్, మెక్కెంజీ అడుగులు ఇలా
వీరిద్దరూ కోర్టు బయట సెటిల్‌మెంట్‌ చేసుకోవచ్చునని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరిద్దరూ కానీ.. వీరి లాయర్ల ద్వారా కానీ ఇది జరగవచ్చని భావిస్తున్నారు. చర్చల్లో కూడా సగం వాటాను ఆమె, ఆమె తరఫు న్యాయవాది కోరే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ వీరిద్దరి మధ్య పెళ్లికి ముందు ఒప్పందం  జరిగి ఉంటే బెజోస్‌ భార్యకు పరిమితంగానే ఆస్తి దక్కేది. 

అమెరికాలో వివాహం చేసుకుంటే ఇలా ఒప్పందాలు
అమెరికాలో ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకునే ముందు ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటుంటారు. ఇలా చేసినపుడు పెళ్లికి ముందు ఎవరి ఆస్తులు ఎంత అన్నది అందులో పొందుపరుస్తారు. అదే సమయంలో పెళ్లి తర్వాత ఇరువురి ఆస్తులపై హక్కులు ఎలా ఉండాలో కూడా రాసుకుంటారు. అయితే 1993లో జరిగిన బెజోస్‌ దంపతుల వివాహ సమయంలో ఇటువంటి ఒప్పందం జరగలేదు.

వాషింగ్టన్‌లోనే విడాకులకు దరఖాస్తు చేసుకునే అవకాశం
బెజోస్‌ దంపతులకు పలు చోట్ల నివాసాలున్నా.. వాళ్లిద్దరూ వాషింగ్టన్‌లోనే విడాకులకు దరఖాస్తు చేస్తారని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాషింగ్టన్‌ రాష్ట్ర చట్టాల ప్రకారం.. పెళ్లి తర్వాత సమకూర్చుకున్న ఆస్తులన్నీ ఇద్దరూ కలిసి సంపాదించినవనే భావిస్తారు. ఒక వేళ విడాకులు తీసుకుంటే పెళ్లి తర్వాత సంపాదించిన ఆస్తులన్నిటినీ పంచుతారన్నమాట. అయితే కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ సగం, సగం ఏమీ పంచరు.

బెజోస్ దంపతుల భవితవ్యంపై న్యాయ నిపుణులు ఇలా
బెజోస్‌ కేసు విషయానికొస్తే.. వీరి పెళ్లి అయి చాలా కాలం అయింది. వీరిద్దరి పెళ్లి తర్వాతే అమెజాన్ ఏర్పాటు జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కోర్టులు ఆస్తులను దాదాపు సగానికి చేయవచ్చనని న్యాయ నిపుణులు అంటున్నారు.

బెజోస్‌కు హాలీవుట్‌ టాలెంట్‌ ఏజెంట్‌ పాట్రిక్‌ వైట్‌షెల్‌ భార్య, మాజీ రిపోర్టర్‌ లారన్‌ షాంజ్‌తో సంబంధం ఉందని అమెరికా వార్తా పత్రిక ద నేషనల్‌ ఎంక్వైరర్‌ పేర్కొంది. ఎనిమిది నెలల కింద వీరిరువురు దగ్గరయ్యారని ఆ పత్రిక అంటోంది. ఆ సంబంధమే ఈ తెగదెంపులకు కారణమని వివరించింది.

ఇలా పురుడు పోసుకున్న అమెజాన్
జెఫ్ బెజోస్ సారథ్యంలో 1994-95లో కెడబ్రా ఇంక్‌గా పురుడు పోసుకున్న స్టార్టప్ సంస్థ తదుపరి అమెజాన్‌‌గా అవతరించింది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇ-కామర్స్‌, కృత్రిమ మేధ, కంప్యూటర్‌ హార్డ్‌వేర్ సేవలందిస్తున్నది. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం సియాటెల్ నగరంలో ప్రధాన కార్యాలయం గల అమెజాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తోంది. 

అమెజాన్ ఉత్పత్తులివి..
అమెజాన్‌ యాప్‌స్టోర్‌, అమెజాన్‌ ఈకో, అమెజాన్‌ కిండిల్‌ అమెజాన్‌ ప్రైమ్‌, అమెజాన్‌ వీడియో, కామిక్సాలజీ తదితర ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్న ఈ సంస్థ.. 2017 నాటికి 177.86 బిలియన్ల డాలర్లతోపాటు 3.033 బిలియన్ డాలర్ల నికర లాభం గడించింది. ప్రపంచ వ్యాప్తంగా 6,13,300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios