కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల డ్రీమ్ 11కి అతిపెద్ద దెబ్బ తగిలింది. కొన్ని కోట్ల విలువైన కంపెనీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో కుప్పకూలిపోయింది. దీని యజమాని హర్ష జైన్. ఇతడు అంబానీ ఫ్యామిలీకి సన్నిహితుడుగా చెప్పుకుంటారు. 

మన భారత క్రికెట్ జట్టు జెర్సీపై కూడా డ్రీమ్ 11 అని రాసి ఉంటుంది. ఇప్పుడు అది ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఇక భారత జట్టు జెర్సీలపై డ్రీమ్ 11 ఇక కనిపించదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం డ్రీమ్ 11ను పూర్తిగా కూల్చేసింది.ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025ను లోక్ సభ, రాజ్యసభల్లో కూడా ఆమోదం పొందింది. ఇక త్వరలోనే అది చట్టంగా మారబోతుంది. డ్రీమ్ 11 వంటి రియల్ మనీ గేమింగ్ ప్లాట్ ఫామ్‌లు పూర్తిగా నిషేధానికి గురవుతాయి. డ్రీమ్ 11 కంపెనీ బీసీసీఐతో కూడా 355 కోట్లకు మూడేళ్ల పాటు స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఇప్పుడు బీసీసీఐ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. కాగా డ్రీమ్ 11 యజమాని హర్ష్ జైన్ ఇతడు చాలా చిన్న వయసులోనే ఈ కంపెనీని స్థాపించి విజయాన్ని పొందాడు.

డ్రీమ్ 11 ఎప్పుడు మొదలైంది?

హర్ష్ 2008 సంవత్సరంలో దీన్ని ప్రారంభించాడు. చాలా తక్కువ సమయంలోనే ఇది ప్రజాదరణ పొందింది. 2019 సంవత్సరం కల్లా అతని కంపెనీ యూనికార్న్ బిరుదును కూడా సంపాదించింది. కంపెనీ మార్కెట్ విలువ ఒక బిలియన్ డాలర్లకు పైగా చేరుకుంది. ఈ డ్రీమ్ 11 ఎంతోమంది తమ ఫాంటసీ జట్లను తయారుచేసి వర్చువల్ గా క్రికెట్ ఆడుకునే వారు. డ్రీమ్ 11లో క్రికెట్ మాత్రమే కాదు హాకీ, ఫుట్ బాల్, కబడ్డీ, బాస్కెట్ బాట్ జట్లను కూడా తమకు నచ్చినట్టు ఎంపిక చేసుకొని ఆడుకోవచ్చు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చేసిన చట్టంతో డ్రీమ్ 11 తమ కార్యకలాపాలను పూర్తిగా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ముఖేష్ అంబానీతో అనుబంధం

ఈ కంపెనీ అధినేత హర్ష్ జైన్ తండ్రి ఆనంద్ జైన్. ఈయన ముఖేష్ అంబానీకి చాలా సన్నిహితుడిగా చెప్పుకుంటారు. వారి కుటుంబంతో వీరికి లోతైన అనుబంధం ఉందని అంటారు. అంతేకాదు ముఖేష్ అంబానీ ఇంటి పక్కనే ఒక బంగ్లాను కూడా హర్ష్ జైన్ కొనుగోలు చేశాడు. హర్ష్ తండ్రి ఆనంద్, ముఖేష్ అంబానీ స్కూల్లో కలిసి చదువుకున్నారు. వీరు బాల్య స్నేహితులు. అప్పటినుంచి వారి స్నేహం ఇప్పటివరకు కొనసాగుతూనే వస్తోంది. ఆనంద్ జైన్ ను ధీరూబాయ్ అంబానీ మూడవ కొడుకుగా చెప్పుకుంటారు. అంతగా వీరు క్లోజ్ గా ఉంటారు.

రిలయన్స్ లోనే ఉద్యోగం

రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడైన ధీరుభాయ్ అంబానీకి ఆనంద్ జైన్ అంటే ఎంతో ఇష్టం. ధీరుభాయ్ అంబానీ సలహా మేరకే ఆనంద్ ఢిల్లీలోని తన వ్యాపారాన్ని వదిలివేసి 1981లోనే రిలయన్స్ గ్రూపులో చేరారు. ఆయన రిలయన్స్ లోని ఎన్నో ప్రాజెక్టులలో ముఖ్యపాత్ర వహించారు. ప్రస్తుతం ఆనంద్ జైన్ రిలయన్స్ క్యాపిటల్ వైస్ చైర్మన్ గా ఉన్నారు. అలాగే ఇండియన్ పెట్రోల్ కెమికల్స్ లిమిటెడ్ బోర్డులో కూడా మెంబర్ గా ఉన్నారు. దీన్నిబట్టి డ్రీమ్ 11 యజమాని అయిన హర్ష్ జైన్ కు అంబానీ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందని తెలుస్తోంది.

హర్ష్ జైన్ ప్రస్తుతం ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. హర్ష్ విదేశాల్లోనే చదువును పూర్తి చేశారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ను చదివారు. ఆ తర్వాత కొలంబియా బిజినెస్ స్కూల్లో ఎంబీఏను పూర్తి చేశారు. హర్ష్ జైన్ రచన అనే వైద్యురాలిని వివాహం చేసుకున్నారు. ఇతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతి తక్కువ కాలంలోనే హర్ష్ జైన్ విజయాన్ని అందుకున్నారు. ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40లో కూడా చోటు సంపాదించారు.