న్యూఢిల్లీ: రూపాయి మారకం విలువ పతనం వల్ల చమురు బిల్లొక్కటే పెరగడం కాదు. రోజవారీ నిత్యావసర వస్తువుల ధరలు.. రుణాలు ప్రత్యేకించి విదేశీ రుణాలు కూడా తలకు మించిన భారంగా పరిణమించాయి. ఈ ఏడాది డాలర్‌తో మారకం విలువ 13 శాతం పతనమైన నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో స్పల్పకాలిక విదేశీ రుణాలను చెల్లించడానికి అదనంగా దాదాపు రూ. 68,500 కోట్లు చెల్లించాల్సి వస్తున్నదని దేశీయ అగ్రశ్రేణి బ్యాంక్ ఎస్బీఐ పేర్కొంది. వర్థమాన దేశాల్లో పెరుగుతున్న రిస్క్‌లు, దేశీయంగా కరెంట్ ఖాతా లోటు పెరుగుదలతో గురువారం రూపాయి మారకం విలువ రూ. 72ని దాటేసింది. 

పరిస్థితులు ఇలాగే ఉంటే ఆరు నెలల్లో రూ.70 వేల కోట్ల అదనపు భారం
మున్ముందు పరిస్థితులు ఇలాగే కొనసాగుతూ రూపాయి మారకం విలువ సగటున ఈ ఏడాదికి రూ. 73 వద్ద స్థిరపడితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగతా ఆరునెలల కాలానికి క్రూడాయిల్ ధర సగటున 76 డాలర్లగా ఉంటే మన దేశం అదనంగా రూ. 45,700 కోట్లను ముడి చమురు దిగుమతి కోసం చెల్లించాల్సి వుంటుందని ఎస్‌బీఐ ఛీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ సౌమ్యా కాంతి ఘోష్ రాసిన తెలిపారు. 2017లో కంపెనీలు తీసుకున్న విదేశీ వాణిజ్య రుణాలు, ఎన్నారైల డిపాజిట్లు మొత్తం కలిపి 217.6 బిలియన్ డాలర్ల వరకు ఉన్నాయి. ఇందులో సగం రుణాలను ఇప్పటికే చెల్లించేసినా.. వచ్చే ఏడాదికి రోలోవర్ చేసినా మిగతా సగం మొత్తాన్ని చెల్లించడానికి రూ. 7.1 లక్షల కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఆరు నెలలకాలానికి సగటున డాలర్‌కు 71.4 చొప్పున రూ.7.8 లక్షల కోట్లను చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల దాదాపుగా రూ. 70వేల కోట్ల అదనపు భారం పడుతుందని విశ్లేషించారు.

జూన్ నెలాఖరు నాటికి 79.8 లక్షల కోట్లకు విదేశీ రుణాలు
జూన్ ముగిసిన త్రైమాసికానికి మనదేశ విదేశీ రుణాలు రూ.79.8 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 77.98 లక్షల కోట్ల రుణాలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్- జూన్ మధ్యకాలంలో రూ. 1.44 కోట్ల రుణాలను ప్రభుత్వ సెక్యూరిటీల జారీ ద్వారా సమీకరించినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. విదేశీ వాణిజ్యంలో కరెంటు ఖాతాలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీలో 2.4 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదేకాలంలో 2.5 శాతంగా ఉంది. ఈ లోటు విలువ 158 బిలియన్ డాలర్లు.

ఆగిన రూపాయి పతనం
ఎట్టకేలకు వారం తర్వాత భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) జోక్యంతో రూపాయి మారకం విలువ శుక్రవారం 26 పైసలు కోలుకుని రూ. 71.73 వద్ద ముగిసింది. ప్రారంభంలో రూ. 72.04ను తాకిన డాలర్‌తో మారకం విలువ మరింత పతనం కాకుండా ఆర్బీఐ రంగంలోకి దూకింది. భారీగా డాలర్ల విక్రయం చేపట్టడంతో రూపాయి విలువ రికవరీ అయింది. వరుస పతనం తర్వాత ప్రభుత్వం ఆర్థికవ్యవస్థపై సానుకూల వ్యాఖ్యానాలు చేయడంతోపాటు, ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువపై విశ్వాసాన్ని పెంచే చర్యలు చేపట్టడంతో సెంటిమెంట్ ఒక్కసారిగా పుంజుకుంది. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో రూ. 1.89 నష్టపోయి చరిత్రలోనే అత్యధిక పతనాన్ని నమోదు చేసింది. 

పౌండ్ తో స్వల్పంగా తగ్గిన రూపాయి విలవు
పౌండ్‌తో మారకం విలువ మాత్రం స్వల్పంగా తగ్గి రూ. 93.08 నుంచి రూ. 93.19 కు పడిపోయింది. అలాగే జపాన్ యెన్‌తో మారకం విలువ ఒక పైస తగ్గింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ 13 శాతం నష్టపోయిన రూపాయి మారకం విలువ ఆసియా కరెన్సీలన్నింటి కన్నా ఎక్కువగా నష్టపోయింది. దేశంలో విదేశీ పెట్టుబడులు తగ్గడం, వాణిజ్య లోటు పెరుగుతూ ఉండడం, జీఎస్టీ వసూళ్లు కూడా గత నెలల తక్కువగా ఉండడంతో పాటు అమెరికా - చైనా వాణిజ్య సుంకాల పోరు కరెన్సీ మార్కెట్‌లో ఆటుపోట్లను సృష్టిస్తున్నది. మరో వైపు చమురు ధరలు పెరుగుతూనే ఉండడంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు పెరిగాయి. దీంతో రిజర్వ్‌బ్యాంక్ తదుపరి పరపతి విధానంలో వడ్డీ రేట్లను పెంచవచ్చునన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

తగ్గిన ఫారెక్స్ నిల్వలు
విదేశీ కరెన్సీ నిల్వలు ఈవారం కూడా తగ్గుముఖం పట్టాయి. గతనెలాఖరుతో ముగిసిన వారానికి విదేశీ కరెన్సీ నిల్వలు 191. 1 కోట్ల డాలర్లు తగ్గి 400.101 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. రూపా యి మారకం విలువ పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వ్‌బ్యాంక్ డాలర్లను విక్రయించడంతో ఈ వారం విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గాయి. కాగా, మొత్తం రిజర్వులలో ప్రధాన భాగం విదేశీ కరెన్సీ ఆస్తులు 605.1 మిలియన్ డాలర్లు తగ్గి 375.986 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. విదేశీ కరెన్సీ ఆస్తుల్లో డాలర్లతో పాటు ఇతర విదేశీ కరెన్సీలు కూడా ఉంటాయి. బంగారం రిజర్వులు కూడా 600.9 మిలియన్ డాలర్లు తగ్గి 20.162 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.