20 స్టోర్ల ఏర్పాటు వాల్‌మార్ట్ లక్ష్యం.. బిగ్ బీ యాడ్‌పై తగ్గిన కళ్యాణ్ జ్యువెల్లరీస్

Walmart on expansion spree in India, plans to open 20 cash and carry stores in next three years
Highlights

ఇప్పటికే భారతదేశంలో ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ స్వాధీనానికి ఒక అడుగు ముందుకేసిన వాల్‌మార్ట్.. తన వ్యాపారాల విస్తరణ పట్ల మరో అడుగేస్తున్నది. అందులో భాగంగా మూడేళ్లలో 20 క్యాష్ అండ్ క్యారీ స్టోర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

లక్నో: భారతదేశంలో ఆన్‌లైన్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకున్న అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ తన సేవల విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. తన స్టోర్లను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది. వచ్చే మూడు సంవత్సరాల్లో మరో 20 హోల్‌సేల్‌ క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం లక్నోలో ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తూ వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ క్రిష్‌ అయ్యర్‌ ఈ విషయం చెప్పారు. భారతదేశంలో వాల్‌మార్ట్ సంస్థ ఏర్పాటు చేసిన రెండో‌ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ ఇది. గతేడాది నవంబర్‌లో వాల్‌మార్ట్ తొలి ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది.

ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాల పెంపు ద్వారా కస్టమర్లకు విస్తృత సేవలు 


ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలను పెంచడం ద్వారా ఆన్‌లైన్‌ బిజినెస్‌–టూ–బిజినెస్‌ (బీ టు బీ) కస్టమర్లకు విస్తృత సేవలు అందించే అవకాశం లభిస్తుందని వాల్ మార్ట్ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ క్రిష్ అయ్యర్ తెలిపారు. వేగంగా పెరుగుతున్న ఈ–కామర్స్‌ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ‘ఈ ఏడాదిలో రెండు, వచ్చే ఏడాదిలో ఎనిమిదేళ్లు, ఆ తరువాత ఏడాదిలో 10 స్టోర్లను ప్రారంభించడం ద్వారా వచ్చే మూడేళ్లలో మరో 20 స్టోర్లను భారత్‌లో ప్రారంభిస్తాం. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో 50 స్టోర్లు ప్రారంభిస్తాం’ క్రిష్ అయ్యర్ చెప్పారు. 

తొమ్మిది రాష్ట్రాల్లో 21 క్యాష్ & క్యారీ స్టోర్లు


‘బెస్ట్‌ప్రైస్‌’ పేరుతో ఇప్పటికే భారత్‌లోని తొమ్మిది రాష్ట్రాల్లో 21 క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్లు ఉన్నాయి. భవిష్యత్‌లో 15 స్టోర్లను ఏర్పాటు చేసేందుకు యూపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదిరింది. తాజా ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా 1,500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. పరోక్షంగా ఎస్‌ఎంఈ సప్లయర్లకు ప్రయోజనం చేకూరుతుంది. వాల్‌మార్ట్‌ ఇండియా వ్యాపారంలో సగం వరకు స్టోర్‌ రహిత, అవుట్‌ ఆఫ్‌ స్టోర్‌ అమ్మకాల ద్వారా జరుగుతుంది’ అని క్రిష్ అయ్యర్ వివరించారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడు స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు మూడు స్థలాలను ఎంపిక చేశామని, మరో ఆరోచోట్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్ఫూర్, మొరాదాబాద్, వారణాసి, గోరఖ్ పూర్, సహరాన్‌పూర్, లక్నో, ఘజియాబాద్ నగరాల్లో వాల్‌మార్ట్ బెస్ట్ ప్రైస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నది. 

బ్యాంకర్ల ఆందోళనతో దిగొచ్చిన కల్యాణి జ్యువెల్లర్స్


ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫిడరేషన్ ‌(ఏఐబీవోసీ) డిమాండ్‌ మేరకు తాము రూపొందించిన వాణిజ్య ప్రకటనను అన్ని మాధ్యమాల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్‌ జ్యూవెల్లర్స్‌ తెలిపింది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కూతురు శ్వేతాబచ్చన్‌ నందాలతో రూపొందించిన యాడ్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థపై అప నమ్మకాన్ని కలిగించేలా ఉన్నదని బ్యాంకింగ్‌ యూనియన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక చట్టపరంగానూ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యాడ్‌ను తొలగించనున్నట్లు కళ్యాణ్‌ జువెల్లర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ కళ్యాణరామన్‌ తెలిపారు.

బిగ్ బీ యాడ్ ఉపసంహరించుకున్న కళ్యాణ్ జ్యువెలర్స్


‘కేవలం ప్రచారం కోసం రూపొందించిన మా కంపెనీ యాడ్‌ వల్ల కొంత మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేకాక మా వ్యాపారంలో కీలక పాత్ర పోషించే బ్యాంకింగ్‌ వ్యవస్థకు కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఎదురైనందుకు చింతిస్తున్నాం. అందుకే అన్ని మాధ్యమాల నుంచి తక్షణమే ఈ యాడ్‌ను తొలగిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్‌ వ్యవస్థకు నష్టం కలిగించే చర్యలను ప్రోత్సహించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. కాగా అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కూతురు శ్వేతా నందా తొలిసారి కళ్యాణ్‌ జువెల్లర్స్‌ కోసం ఓ యాడ్‌లో నటించారు. కేవలం వాణిజ్య అవసరాల కోసం లక్షల మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు తలెత్తడంతో కళ్యాణ్‌ జువెల్లర్స్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

loader