Asianet News TeluguAsianet News Telugu

సంస్కరణల ధాటికి: భారత్ నుంచి వాల్‌మార్ట్ ఔట్..? మరి ఫ్లిప్‌కార్ట్..

కేంద్రం ఈ- కామర్స్ విధానంలో మార్పులు తేవడంతో అంతర్జాతీయ దిగ్గజాలు అమెజాన్, వాల్‌మార్ట్ అల్లాడిపోతున్నాయి. 2017లో దేశీయ ఆన్ లైన్ మేజర్ ఫ్లిప్ కార్ట్‌లో 77 % వాటా కొనుగోలు చేసి కైవసం చేసుకున్నది వాల్ మార్ట్.

Walmart May Exit Flipkart As Tough New FDI Rules Bite: Morgan Stanley
Author
New Delhi, First Published Feb 6, 2019, 11:06 AM IST

భారత్‌లో లాభాలు రాకపోతే వాల్‌మార్ట్‌ సంస్థ వెంటనే వైదొలగాలని వాల్‌మార్ట్‌కు ప్రముఖ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ సూచించింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన ఈ-కామర్స్‌ నిబంధనలు వ్యాపారాన్ని కష్టంగా మార్చివేయడం, ఫ్లిప్‌కార్ట్‌లో లాభాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

‘అసెసింగ్‌ ఫ్లిప్‌కార్ట్‌ రిస్క్‌ టూ డబ్ల్యూఎంటీ ఈపీఎస్‌’అనే నివేదికలో మోర్గాన్ స్టాన్లీ ఈ సంగతి తెలిపింది. చైనాలో వ్యాపారం లాభదాయకం కాదని తేలగానే అమెజాన్‌ 2017లో మార్కెట్‌ నుంచి వైదొలగిన విషయాన్ని ఉటంకించింది. 

గమ్మత్తు ఏమిటంటే 2017 మేలో వాల్‌మార్ట్‌ కంపెనీ దాదాపు 16 బిలియన్‌ డాలర్ల వ్యయంతో వెచ్చించి ఫ్లిప్‌కార్ట్‌లో 77% వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్‌తో వాల్‌మార్ట్‌ భారతీయ మార్కెట్లో నేరుగా అమెజాన్‌తో తలపడినట్లైంది.

కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనలకు అనుగుణంగా తన వ్యూహాన్ని మార్చుకుని వాల్‌మార్ట్‌ భారత్‌లో కొనసాగుతుందని పేర్కొంది. గతంలో ఈ రెండు సంస్థలు గతంలో భారీ ఎత్తున ఎక్స్‌క్లూజివ్‌ వస్తువులను విక్రయించేవి. కొత్త నిబంధనలు  ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లను విక్రయాలను దెబ్బతీస్తాయని అంచనా వేసింది. 

మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం ఫ్లిప్‌కార్ట్ సంస్థతో వాల్‌మార్ట్ అనుబంధం మూణ్ణాళ్ల మురిపెంగాగానే మిగిలిపోతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్‌లో ఆన్‌లైన్ మార్కెట్‌కు నానాటికీ పెరుగుతున్న ఆదరణ.. వాల్‌మార్ట్‌ను భారీ డీల్ వైపు నడిపించగా, ఫ్లిప్‌కార్ట్‌ను ఒడిసిపట్టుకునేలా చేసింది.

ఇక్కడివరకు కథంతా బాగానే ఉన్నది. అసలు వ్యథ వాల్‌మార్ట్‌కు ఈ నెల ఒకటో తేదీ నుంచే మొదలైంది. ఈ-కామర్స్ కంపెనీల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నూతన నిబంధనల ప్రకారం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ మార్కెటింగ్ వేదికలు తమ వెబ్‌సైట్ల ద్వారా జరిపే అమ్మకాలు పారదర్శకంగా ఉండాలి. 

ఆయా ఉత్పాదక సంస్థలతో టై-అప్ అవడం లేదా వాటిల్లో వాటాలను కొనడం ద్వారా మార్కెట్‌ను  అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ శాసిస్తున్నాయని, కొన్ని బ్రాండ్ల అమ్మకాలకే పెద్దపీట వేసి, మార్కెట్‌లో ఆరోగ్యకర పోటీని దెబ్బతీస్తున్నాయనే కేంద్రం కొత్త ఈ-కామర్స్ పాలసీని తెచ్చింది. సంప్రదాయ మార్కెట్ నుంచి భారీగా అభ్యంతరాలు, ఆందోళనలూ వ్యక్తం కావడం కూడా నయా పాలసీ రాకకు ఓ కారణమే.

దీంతో వాల్‌మార్ట్ ఆశలు నీరుగారిపోయాయి. లాభం లేకపోతే ఫ్లిప్‌కార్ట్ ఎందుకు దండగ అన్నతీరులో మోర్గాన్ స్టాన్లీ అంచనాలూ ఉన్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఇక కొత్త నిబంధనలతో ఆన్‌లైన్ మార్కెటీర్లకు ఆదాయం ఆవిరైపోతున్నది. ఇప్పటికే ఈ నూతన ఈ-కామర్స్ విధానంతో అమెజాన్ రాత్రికిరాత్రి లక్షల వస్తువులను తమ వెబ్‌సైట్ నుంచి తొలగించింది.

ఫ్లిప్‌కార్ట్ సైతం 25 శాతం ఉత్పత్తులను తీసేయాల్సి వస్తున్నది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులే అధికం. ఫ్లిప్‌కార్ట్ అమ్మకాల్లో 50 శాతం వాటా వీటిదే. దీంతో భారతీయ ఆన్‌లైన్ మార్కెట్ పరుగులకు ఇక బ్రేక్ పడినట్లేనని అంటున్నది అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ మోర్గాన్ స్టాన్లీ. 

ఏ ఆదాయం కోసమైతే, ఏ వ్యాపారాభివృద్ధి కొరకైతే ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ చేజిక్కించుకున్నదో.. అవే దూరమయ్యాక మార్ట్‌కు ఫ్లిప్‌కార్ట్ భారమేనని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయ పడుతున్నది. భవిష్యత్‌లో ఫ్లిప్‌కార్ట్ ఆదాయం ఊసూరుమనిపించేలాగానే ఉండొచ్చని హెచ్చరిస్తున్నది.

ఈ క్రమంలోనే 2017 చివరన చైనాలో అమెజాన్‌కు ఎదురైన అనుభవమే.. ఇప్పుడు భారత్‌లో వాల్‌మార్ట్‌కు ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదని సోమవారం పొద్దుపోయాక విడుదలైన ఓ నివేదికలో మోర్గాన్ స్టాన్లీ అంటున్నది. నాడు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్లు, మొబైల్ యాప్ చైనా వినియోగదారులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఫలితంగా ఈ గ్లోబల్ ఆన్‌లైన్ దిగ్గజం చైనాకు బైబై చెప్పేసింది.

దేశీయ ఈ-కామర్స్ విధానం సెగ.. అంతర్జాతీయంగానూ వాల్‌మార్ట్, అమెజాన్‌లకు తగులుతున్నది. భారత్‌లో కొత్త పాలసీ అమల్లోకి తెచ్చినరోజే అమెరికా స్టాక్ మార్కెట్లలో వాల్‌మార్ట్, అమెజాన్‌ సంస్థల మార్కెట్ విలువ భారీగా పతనమైంది. గత శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 50 బిలియన్ డాలర్లకుపైగా మార్కెట్ విలువ దిగజారింది. 

నాస్‌డాక్ స్టాక్ మార్కెట్‌లో అమెజాన్ షేర్ విలువ 5.38 శాతం క్షీణించి 1,626.23 డాలర్ల వద్దకు చేరడంతో సంస్థ మార్కెట్ విలువ 45.22 బిలియన్ డాలర్లు తగ్గింది. న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌వైఎస్‌ఈ)లో వాల్‌మార్ట్ షేర్ విలువ 2.06 శాతం క్షీణించి 93.86 డాలర్ల వద్ద నిలువడంతో సంస్థ మార్కెట్ విలువ 5.7 బిలియన్ డాలర్లు పడిపోయింది. రెండు సంస్థలు కలిసి 50.92 బిలియన్ డాలర్ల (డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రకారం దాదాపు రూ.3,64,400 కోట్లు) మార్కెట్ విలువను నష్టపోయాయి.

Follow Us:
Download App:
  • android
  • ios