న్యూఢిల్లీ/ వాషింగ్టన్: ‘ఈ - కామర్స్’ దిగ్గజం అమెజాన్ సంస్థకు దీటుగా తన వినియోగదారులు తేలిగ్గా, శరవేగంగా షాపింగ్ లక్ష్యంగా రిటైల్ జెయింట్ ‘వాల్‌మార్ట్’ అడుగులేస్తున్నది. క్యాష్ అండ్ క్యారీ షాపింగ్ నిర్వహణ కోసం మంగళవారం టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో వాల్ మార్ట్ ఐదేళ్ల వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. ఐదేళ్లపాటు వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే వాల్‌మార్ట్.. క్రిటికల్ అప్లికేషన్స్, వర్క్ లోడ్స్ కోసం మైక్రోసాఫ్ట్ సేవలను వినియోగిస్తున్నది. తాజాగా విస్త్రుత శ్రేణిలో వినియోగదారులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్ కోసం మెషిన్ లెర్నింగ్, క్రుత్రిమ మేధస్సు, డేటా ప్లాట్ ఫామ్ సొల్యూషన్స్ పరిష్కారం దిశగా వాల్‌మార్ట్ విస్త్రుత స్థాయిలో క్లౌడ్ ఇన్నోవేటివ్ ప్రాజెక్టుల్లో అడుగు పెట్టడంపైనే ద్రుష్టి సారించింది. 

కస్టమర్లకు కన్వీనియంట్ షాపింగ్ మార్గాల కల్పనకే ప్రాధాన్యం


వాల్‌మార్ట్ సీఈఓ డౌగ్ మిక్ మిల్లోన్ స్పందిస్తూ కస్టమర్లకు కన్వినియెంట్ షాపింగ్ మార్గాలను కల్పించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉన్నదని తెలిపారు. వారికి మెరుగైన వసతులతో సాధికారత కల్పించడానికి క్రుష్టి చేస్తున్నదని పేర్కొన్నారు. ‘మా ఏజిల్ క్లౌడ్ ఫ్లాట్ ఫామ్ లేదా మెషిన్ లెర్నింగ్‌లో లీవరేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విధానాలతో కలిసి మరింత స్మార్ట్‌ సేవలు అందించాలని భావిస్తున్నాం. భవిష్యత్‌లో నూతన ఆవిష్కరణలతో కూడిన సేవలందించడంలో మైక్రోసాఫ్ట్ గట్టి భాగస్వామిగా ఉంటుందని మేం నమ్ముతున్నాం’ అని మిక్ మిల్లోన్ చెప్పారు.

మైక్రోసాఫ్ట్ నుంచి అందుబాటులోకి ఇలా సొల్యూషన్స్ 


అజూర్, మైక్రోసాఫ్ట్ 365తోపాటు వాల్‌మార్ట్ ఇప్పటికే పూర్తిస్థాయి మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సొల్యూషన్స్‌ను ఎంపిక చేసుకున్నది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫాం ‘అజూర్‌’ ద్వారా వాల్‌మార్ట్‌ సరఫరా, రవాణాను మెరుగుపరచడానికి మైక్రోసాఫ్ట్‌ సహకరిస్తుంది. 

వాల్‌మార్ట్ పార్టనర్ షిప్ ఆనందకరమన్న సత్యనాదెళ్ల


మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మాట్లాడుతూ ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలు మా క్లౌడ్ అప్లికేషన్లపై ఆధారపడి పని చేస్తున్నాయని పేర్కొన్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో వాల్‌మార్ట్ సంస్థతో భాగస్వామ్యం పొందినందుకు తాను థ్రిల్ అవుతున్నట్లు సత్య నాదెళ్ల చెప్పారు. మైక్రోసాఫ్ట్ అజూర్, మైక్రోసాఫ్ట్ 365 వేదికలతో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రక్రియను వాల్‌మార్ట్ వేగవంతం చేస్తున్నదని తెలిపారు. భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా వాల్‌మార్ట్, మైక్రోసాఫ్ట్ ఇంజినీర్లు పరస్పర సహకారంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అప్లికేషన్స్‌ నుంచి క్లౌడ్ నేటివ్ ఆర్కిటెక్చర్స్ వైపు అడుగులు వేస్తారు. 

స్కిల్ ఇండియా మిషన్‌తో జట్టు కట్టిన ఫేస్‌బుక్


సోషల్ మీడియా జెయింట్ ఫేస్‌బుక్ మంగళవారం భారత జాతీయ నైపుణాభివ్రుద్ధి సంస్థ (ఎన్ఎస్డీసీ)తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో చేరింది. ఇందులో భాగంగా డిజిటల్ స్కిల్స్‌పై యువతకు, పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించేందుకు శిక్షణ ఇస్తున్నది. యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా స్థానిక, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉపాధి పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. 

స్కిల్ ఇండియాలో భాగంగా ప్రాంతీయ భాషల్లో శిక్షణ


ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రాంతీయ భాషల్లో డిజిటల్ మార్కెటింగ్, ఆన్ లైన్ సేఫ్టీ, ఫైనాన్సియల్ లిటరసీ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నది. ఎన్ఎస్డీసీ సిఫారసు చేసిన యువతకు శిక్షణ ఇస్తుంది. దీని ద్వారా అన్ స్కిల్డ్ ఉద్యోగార్థులు ఉపాధి పొందే అవకాశాలు పెరుగుతాయి. ఫేస్ బుక్ దక్షిణ, మధ్యాసియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకీ దాస్ మాట్లాడుతూ ‘జాతీయ నైపుణ్యాభివ్రుద్ధి సంస్థతో భాగస్వామి అయినందుకు మేం ఆనందంగా ఉన్నాం. స్థానిక వ్యాపారంలో సాధికారత కల్పించడానికి వనరులను స్రుష్టించడానికి చేయూతనిస్తుంది’ అని తెలిపారు. 

రెండేళ్లలో ఐదు లక్షల మందికి శిక్షణ ఫేస్‌బుక్ లక్ష్యం


స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో ఫేస్ బుక్ రెండు లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం మరో 30 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చినట్లు ఫేస్ బుక్ తెలిపింది. 2017లో ఫేస్ బుక్ డిజిటల్ ట్రైనింగ్ హబ్ ను ప్రారంభించింది. 2020 నాటికి ఐదు లక్షల మంది యువతకు, పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని తలపెట్టింది ఫేస్‌బుక్.