Asianet News TeluguAsianet News Telugu

జేఆర్డీ టాటాకు నివాళి: ‘వీటీవీ-ఏటీవీ’ పేరిట విస్తారా ఇలా సర్వీస్

భారతదేశంలో తొలి విమానయాన సంస్థను ప్రారంభించిన జేఆర్డీ టాటాకు నివాళులర్పించేందుకు విస్తారా ఎయిర్ లైన్స్ సిద్ధమైంది. టాటా గ్రూప్ 150వ వసంతోత్సవం సందర్భంగా ఈ నెల ఐదో తేదీన వీటీవీ- ఏటీవీ పేరిట నూతన సర్వీస్ ప్రారంభించనున్నది. మరో వైపు టాటా గ్రూప్ అనుబంధ సంస్థ ఎయిర్ ఏషియా కూడా ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.

Vistara Retrojet: See how full-service air carrier takes retro route to pay tribute to JRD Tata; pics inside
Author
New Delhi, First Published Sep 3, 2018, 10:26 AM IST

న్యూఢిల్లీ: వినియోగదారులకు పూర్తిస్థాయి విమాన సర్వీసులు అందిస్తున్న ప్రైవేట్ విమాన యాన సంస్థ ‘విస్తారా ఎయిర్‌లైన్స్’ నుంచి టాటా గ్రూప్‌తో కలిసి దేశంలో విమాన సర్వీసులు అందిస్తున్న ఎయిర్ ఏసియా వరకు విమాన యాన సర్వీసులు ఆఫర్ల బాట పట్టాయి. కాకపోతే విస్తారా ఎయిర్ లైన్స్ ఒక అడుగు ముందుకేసి భారతదేశంలో మొట్టమొదటి విమాన యాన సంస్థ టాటా ఎయిర్ లైన్స్‌ను ప్రారంభించిన జేఆర్డీ టాటాకు నివాళిగా ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో దేశంలో తొలి కమర్షియల్‌ పైలటైన జేఆర్డీ టాటాకు నివాళిగా విస్తారా ఎయిర్‌లైన్స్‌ వినూత్న సేవలందించబోతోంది.

వీటీవీ- ఏటీవీ పేరిట విస్తారా 22వ సర్వీస్ ఇలా
విస్తారా తాను నడుపనున్న 22వ విమాన సర్వీస్‌కు కూడా జేఆర్డీ టాటాను స్ఫురణకు తెచ్చేలా ‘వీటీవీ - ఏటీవీ’ అని పేరు పెట్టింది. దీనికి తోడు దేశంలో అనుపమాన సేవలందిస్తున్న టాటా గ్రూప్‌ 150 వసంతోత్సవాలు కూడా కలిసి వచ్చాయి. నాటి టాటా ఎయిర్‌లైన్స్‌ను గుర్తుకు తెచ్చేలా ముస్తాబు చేసిన తన 22 విమానాన్ని విస్తారా శనివారం ఆవిష్కరించింది. టాటా ఎయిర్‌లైన్స్‌ డీసీ-3 ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన ‘వీటీ-ఏటీవీ’ రిజిస్ట్రేషన్‌నే ఈ విమానానికి ఉపయోగించారు. ఐదో తేదీన ఈ విమానంతో ఢిల్లీ నుంచి ముంబైకి తొలి సర్వీసును నడపనున్నట్లు సంస్థ తెలిపింది.
 
వీటీవీ-ఏటీవీ విమాన ప్రయాణికులకు జేఆర్డీ టాటాకు ఇష్టమైన రుచులు
ఈ విమానంలో ప్రయాణించే వారి కోసం జెఆర్‌డి టాటాకు ఇష్టమైన వంటకాలతో కూడిన మెనూను అందుబాటులోకి తేనున్నట్లు విస్తారా వెల్లడించింది. దేశంలో తొలి విమాన సంస్థ అయిన టాటా ఎయిర్‌లైన్స్‌ను జెఆర్‌డి టాటా 1932లో ప్రారంభించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కంపెనీని జాతీయం చేశారు. ఎయిర్‌ ఇండియాగా పేరు మార్చారు. విస్తారా బ్రాండ్‌నేమ్‌తో విమానయాన సేవలందిస్తోన్న టాటా సియా ఎయిర్‌లైన్స్‌.. టాటా సన్స్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ భాగస్వామ్యంలో ఏర్పాటైన సంస్థ. 2015 జనవరిలో ప్రారంభమైన విస్తారా ప్రస్తుతం 22 ప్రాంతాలకు విమానయాన సేవలందిస్తోంది. త్వరలో విదేశాలకు రెండు సర్వీసులను నడుపనున్నది. 

రూ.999కే ఎయిర్‌ఏషియా దేశీయ టిక్కెట్
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా బిగ్ సేల్ ప్రమోషన్ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద దేశీయంగా ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.999గా, అంతర్జాతీయ రూట్లకు రూ.1,399గా నిర్ణయించింది. ఎయిర్‌ఏషియా గ్రూపు నడుపుతున్న అన్ని విమానాలకు ముఖ్యంగా ఎయిర్‌ఏషియా ఇండియాకు కూడా ఈ ఆఫర్ వర్తించనున్నది. శనివారం అర్దరాత్రి ప్రారంభంకానున్న ఈ ఆఫర్ ఎనిమిది రోజుల పాటు ఉండనున్నదని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి నవంబర్ 26 లోగా ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చునని తెలిపింది. 

ఎయిర్ఏషియా డాట్ కామ్, యాప్‌తో టిక్కెట్ల బుకింగ్ ఇలా
ఎయిర్‌ఏషియా.కామ్, ఎయిర్‌ఏషియా మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న టిక్కెట్లకు మాత్రమే ఈ రాయితీ ఆఫర్ వర్తించనున్నది. అంతర్జాతీయ రూట్లైన కౌలాలంపూర్, బ్యాంకాక్, క్రాబి, సిడ్నీ, మెల్‌బోర్న్, సింగపూర్, బాలీ రూట్లలో గ్రూపు ఎయిర్‌లైన్స్‌లు నడుపుతున్న విమాన సర్వీసులకు కూడా ఈ రాయితీ లభించనున్నది. ప్రస్తుతం సంస్థ దేశీయంగా 21 రూట్లకు విమాన సేవలు అందిస్తున్నది.

మరో రెండు రూట్లను ప్రారంభించనున్న ఏయిర్ ఏసియా
ఎయిర్‌ఏషియా మరో రెండు కొత్త రూట్లకు సర్వీసులను ప్రారంభించనున్నది. ఇటీవల కొన్న 19వ ఎయిర్‌క్రాఫ్ట్‌ను హైదరాబాద్ - ఇండోర్, హైదరాబాద్ - కోల్‌కతా మధ్య నడుపనున్నది. వీటితోపాటు హైదరాబాద్ - బెంగళూరు మధ్య సర్వీసుల సంఖ్యనూ పెంచబోతున్నట్లు ప్రకటించింది. ప్రారంభ ఆఫర్ కింద కోల్‌కతా - హైదరాబాద్‌ మధ్య టిక్కెట్ ధరను రూ.1999గా, హైదరాబాద్ - ఇండోర్‌ మధ్య రూ.1,799, కోల్‌కతా-ఇండోర్‌ మధ్య రూ.3,999గా నిర్ణయించింది. ఈ నెల 9లోపు బుకింగ్ చేసుకున్న వారు అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 13 మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చు.
 

Follow Us:
Download App:
  • android
  • ios