లండన్/ న్యూఢిల్లీ: ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియంకు రూ.9000 కోట్లకు పైగా రుణ బకాయిల చెల్లింపునకు శఠగోపం పెట్టి లండన్ చెక్కేసిన మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యాను వెనక్కు పంపాలన్న భారత్‌ అభ్యర్థనపై బ్రిటన్‌ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించనున్నది. అత్యంత కీలకమైన ఈ కీలక విచారణకు హాజరయ్యేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సంయుక్త డైరెక్టర్‌ ఎస్‌ సాయి మనోహర్‌ నేతృత్వంలోని అధికారుల బృందం లండన్‌ బయలుదేరివెళ్లింది. 

సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్తానాకు బదులుగా మనోహర్‌ వెళ్లినట్లు అధికారులు తెలిపారు. మొదట్నుంచీ ఈ కేసు విచారణకు అస్తానానే వెళ్లేవారు. సంచలన అవినీతి ఆరోపణల వివాదం నడుమ సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మతోపాటు ఆయననూ కేంద్రం బలవంతపు సెలవులపై పంపిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మనోహర్‌తోపాటు ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు లండన్‌ వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బ్యాంకులకు రూ.9,000 కోట్లను ఎగవేసి 2016లో బ్రిటన్‌కు మాల్యా పరారైన సంగతి తెలిసిందే. ఆయనపై అక్రమ నగదు చలామణీ, రుణాల నిధులు ఇతర అవసరాలకు మళ్లింపు ఆరోపణలూ ఉన్నాయి.

విజయ్ మాల్యాను వెనక్కు పంపాలన్న భారత్‌ అభ్యర్థనపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టెర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు విచారణ చేపడుతోంది. కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా భారత్‌ అభ్యర్థనపై బ్రిటన్‌ హోం మంత్రి నిర్ణయం తీసుకుంటారు. అయితే కోర్టు తీర్పును ఇక్కడి హైకోర్టులో అప్పీలు చేయొచ్చు.

ఐదు సెషన్లలో రూ.400 కోట్లు ఉపసంహరించుకున్న విదేశీ మదుపర్లు  
అంతర్జాతీయ పరిణామాలు, చైనా దిగ్గజ టెలికాం కంపెనీ హువాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంగ్‌ వాంగ్ జో అరెస్టయిన నేపథ్యంలో గత ఐదు సెషన్లలోనే విదేశీ మదుపరులు స్టాక్‌మార్కెట్‌ నుంచి దాదాపు రూ. 400 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకే విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) రూ. 383 కోట్లను ఈక్వీటీ మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారని డిపాజిటరీలు తెలిపాయి.

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, రూపాయి బలం పుంజుకోవటం వలన ఈక్వీటీ మార్కెట్‌లో ఇటీవల రూ. 6900 కోట్లు రాగా ప్రస్తుతం ఈ నిధుల ప్రవాహ వేగం తగ్గింది. డిసెంబర్ 6న ఒక్కరోజే ఎఫ్ఐఐలు రూ. 361 కోట్ల విలువైన ఆస్తుల అమ్మకాలు జరిపారు. చైనా టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంగ్‌ వాంగ్‌జోను కెనడాలో అరెస్ట్‌ చేయటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా మారటానికి కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనటం వల్ల మదుపర్లు ఆందోళనకు గురవుతున్నారని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్టెమెంట్‌ సలహాదారు హిమన్షు శ్రీవాత్సవ అన్నారు. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేపిటల్‌ మార్కెట్‌ నుంచి విదేశి మదుపర్లు రూ. 86,500 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఇందులో రూ. 50,000 కోట్లు డెట్‌మార్కెట్‌వి కాగ, రూ. 35,600 కోట్లు ఈక్వీటీ మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు.