Asianet News TeluguAsianet News Telugu

మాల్యా ఆర్థిక నేరగాడే.. స్కామే లేదన్న నీరవ్ మోదీ

ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని చెల్లింపుల కోసం పట్టుబట్టడంతో లండన్ నగరానికి చెక్కేశారు. కాకపోతే లండన్ న్యాయస్థానం ఆయనను భారతదేశానికి అప్పగించేయాలని ఆదేశించింది. తాజాగా ముంబై పీఎంఎల్ఏ కోర్టు పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించింది. 

Vijay Mallya a fugitive economic offender: Court
Author
Mumbai, First Published Jan 6, 2019, 4:32 PM IST

పరారీ ఆర్థిక నేరగాళ్ల (ఎఫ్‌ఈవో) చట్టం కింద శనివారం విజయ్ మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది ముంబైలోని మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రత్యేక కోర్టు. గతేడాది ఆగస్టులో ఈ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర్నుంచి ఈ ముద్రపడిన తొలి వ్యక్తిగా, వ్యాపారిగా మాల్యా రికార్డులకెక్కడం గమనార్హం.

తాజా ప్రకటనతో ఇక ఈ లిక్కర్ వ్యాపారి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకోవచ్చు. బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా ఎగవేసి 2016 మార్చి రెండో తేదీన మాల్యా దేశం విడిచి లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. 

విజయ్ మాల్యా కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఆయనను పరారీ ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని పీఎంఎల్‌ఏ కోర్టును అభ్యర్థించింది. దాదాపు రూ.12,500 కోట్ల ఆస్తులను తక్షణమే జప్తు చేసేందుకూ అనుమతినివ్వాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన జడ్జి ఎంఎస్ అజ్మీ పరారీ ఆర్థిక నేరగాడి ముద్ర వేశారు. వచ్చే నెల 5 నుంచి ఆస్తుల జప్తుపై ఈడీ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారిస్తామని ప్రకటించారు.

మాల్యా పిటిషన్లు తిరస్కరించిన పీఎంఎల్ఏ, బాంబే హైకోర్టు తిరస్కుతి
నిరుడు జూలైలో దాఖలైన ఈడీ పిటిషన్‌పై స్టే విధించాలని కోర్టును మాల్యా కోరినా.. అక్టోబర్ 30న తోసిపుచ్చింది. అనంతరం మాల్యా బాంబే హైకోర్టునూ ఆశ్రయించగా, నవంబర్ 22న ఈ అప్పీల్‌ను కొట్టేసింది.

కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం ప్రధాన నిందితులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను పరారీ ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్లనూ ఈ పీఎంఎల్‌ఏ కోర్టే విచారిస్తున్నది.

రూ.100 కోట్లు అంతకుమించి ఆర్థిక మోసాలకు పాల్పడి నేర విచారణను తప్పించుకునేందుకు దేశం విడిచి పారిపోయి, తిరిగి వచ్చేందుకు విముఖత చూపేవారిపై అరెస్టు వారెంట్ జారీ అయితే ఎఫ్‌ఈవో చట్టం కింద పరారీ ఆర్థిక నేరగాడిగా ప్రకటించవచ్చు.

తన తప్పేమీ లేదని నీరవ్ మోదీ వాగాడంబరం
దేశీయ బ్యాంకింగ్‌ రంగంలోనే అతిపెద్ద కుంభకోణంగా సంచలనం సృష్టించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్బీ) రూ.13వేల కోట్ల కుంభకోణం.. ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీ ద్రుష్టిలో తప్తే కాదని చెప్పారు.

తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. మోడీని ఆర్థిక నేరగాడిగా ప్రకటించడం కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పీఎంఎల్‌ఏ కోర్టులో వేసిన పిటిషన్‌పై ఆయన సమాధానమిచ్చారు. పీఎన్బీలో రుణాల ఎగవేత ఒక ద్రవ్యపరమైన సాధారణ వివాదాంశమేనని తెలిపారు.

సదరు లావాదేవీలు అన్నీ తప్పుల తడకలని ఆయన తెలిపారు. గతంలో జరిగిన ఈ లావాదేవీలను ప్రస్తుతం వెలుగులోకి తెచ్చి వాస్తవానికంటే ఎక్కువ చేసి చూపుతున్నారని ఆయన వివరించారు. ఈ విషయంలో తాను ఏ తప్పు చేయలేదని మోడీ వివరించారు. 

భద్రత వల్లే రాలేకపోతున్నట్లు నీరవ్ మోదీ వాదన
భద్రత కారణాల వల్లే తాను భారత్‌ తిరిగి రాలేకపోతున్నానని నీరవ్ మోదీ తెలిపారు.  పీఎన్బీ కుంభకోణంలో నిందితుడిగా నీరవ్‌పై ఇప్పటికే ఇంటర్‌పోల్‌ అధికారులు రెడ్‌ కార్నర్‌ నోటీసులను జారీ చేశారు.

అతడిని భారత్‌ తిరిగి రప్పించేందుకు ఈడీ, సీబీఐ అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నీరవ్‌ బ్రిటన్‌లోనే తలదాచుకుంటున్నట్లు ఆ దేశ అధికార వర్గాలు ఇటీవల భారత్‌ ప్రభుత్వ అధికారులకు తెలియజేశాయి. ఈ కేసులో ఇప్పటి వరకూ రూ.4,765కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios