వీడియోకాన్-న్యూపవర్ సంస్థకు సంబంధించిన కుంభకోణంపై ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2012లో వీడియోకాన్ సంస్థకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది.

అయితే భర్త వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ఆమె తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్, చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చార్‌తో పాటు మరో ఇద్దరు బంధువులు కలిసి 2008లో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు.

తనకు చెందిన ఒక సంస్థ ద్వారా ధూత్ ఈ కంపెనీకి రూ.64 కోట్ల రుణం మంజూరు చేయించారు. దీనితో పాటు సంస్థకు చెందిన యాజమాన్య హక్కులను కేవలం రూ.9 లక్షలకే దీపక్ కొచ్చర్‌ ఆధ్వర్యంలోని ట్రస్ట్‌కు ధూత్ బదిలీ చేశారు.

వీడియోకాన్‌కు ఐసీఐసీఐ రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేసిన కొద్దినెలల్లోనే ఈ బదిలీ చేయడంతో కార్పోరేట్ ప్రపంచానికి అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐసీఐసీఐ ఇచ్చిన రుణంలో రూ. 2,810 కోట్లను వీడియోకాన్ తిరిగి చెల్లించలేకపోయింది. 2017లో ఇది మొండి బకాయిగా మారింది. క్విడ్ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్‌కు చందా కొచ్చర్ సాయపడ్డారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆమె పదవిని సైతం కోల్పోవాల్సి వచ్చింది.

తాజాగా రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడిన కేసులో చందాకొచ్చర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చార్, వీడియోకాన్ అధినేత వేణుధూత్‌పై గురువారం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ముంబైలోని వీడియోకాన్ ప్రధాన కార్యాలయంతో పాటు మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఉన్న సంస్థ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.