వాషింగ్టన్: కరోనా వ్యాపించడంతోపాటు పలు అంశాల్లో ‘డ్రాగన్’పై అమెరికా గుర్రుగా ఉన్నది. చైనాను దెబ్బ కొట్టేందుకు ప్రతి అవకాశాన్ని అమెరికా ఉపయోగించుకుంటున్నది. దాదాపు ఏడాది క్రితం వరకు చైనాతో వాణిజ్య యుద్ధం సాగించిన డొనాల్డ్ ట్రంప్.. తమ దేశ భద్రత అంశాన్ని పణంగా పెట్టేందుకు మాత్రం సిద్ధంగా లేరు. 

ఈ విషయమై ఇంతకుముందే చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హువావే వినియోగంపైనా, దానికి అమెరికాలోని టెక్ దిగ్గజ సంస్థల సహకారంపై డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించారు. తాజాగా భారతదేశంతో సరిహద్దుల్లో గల్వాన్ లోయలో ఘర్షణ సందర్భంగా డ్రాగన్‌తో తలెత్తిన వివాదాన్ని ట్రంప్ తనకు అనువుగా మార్చుకున్నారు.

 
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ టెక్ దిగ్గజ సంస్థలు హువావే, జడ్‌టీఈ నుంచి తమకు భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని అమెరికా ప్రకటించింది.  హువావే, జడ్‌టీఈ సంస్థల నుంచి కొనుగోళ్లపై అమెరికా నిషేధం విధించింది. ఈ మేరకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ (ఎఫ్సీసీ) ప్రకటన చేసింది. 

దీంతో అమెరికాలో టెలికం సర్వీసెస్ సంస్థను విస్తరణ దిశగా చేపట్టిన ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన ‘యూనివర్సల్ సర్వీస్ ఫండ్’ నిధులతో ఈ సంస్థల నుంచి పరికరాలు కొనుగోలు చేయకూడదు. అలాగే ఇర సేవల్ని పొందడానికి కూడా ఆ నిధుల్ని వినియోగించొద్దు. ఎఫ్సీసీకి ఈ ఏడాది 8.3 బిలియన్ డాలర్లు కేటాయించారు. అంటే రూ.62,676 కోట్లు అన్నమాట’ అని ఎఫ్సీసీ చైర్మన్ అజిత్ పాయ్ చెప్పారు.

also read  రికార్డు స్థాయిలో బంగారం ధరలు.. తులం ఎంతంటే ? ...

సుంకాలతో చైనాను లొంగదీసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ‘డ్రాగన్’ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘హువావే’ను అడ్డం పెట్టుకుని సాధించాలని వ్యూహం అమలు చేశారు. అందులో భాగంగా 2019లో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. తమ భద్రతకు ముప్పు వాటిల్లనున్నదన్న సాకుతో హువావే కొనుగోళ్లపై నిషేధం ప్రకటించారు. కానీ దీన్ని తాము పట్టించుకోమని సిద్ధమని హువావే తేల్చి పారేసింది. 

అమెరికా మొబైల్ నెట్ వర్క్ వ్యవస్థను రక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్సీసీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో 5జీ టెక్నాలజీ మౌలిక వసతుల ఏర్పాట్లలో హువావే కీలక పాత్ర పోషిస్తున్నది. అమెరికా తాజా నిర్ణయంతో ఆయా దేశాల్లో ఏర్పాట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారనుందని టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

హువావే, జడ్ టీఈ నుంచి అమెరికా జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని ఎఫ్సీసీ చైర్మన్ అజిత్ పాయ్ తెలిపారు. ‘5జీ’ భవిష్యత్‌కు సైతం సవాళ్లు ఎదురయ్యే అవకాశం పేర్కొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ, ఆ దేశ సైనిక వ్యవస్థతో ఈ రెండు కంపెనీలకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలిందని అజిత్ పాయ్ పేర్కొన్నారు.

హువావే, జడ్‌టీఈ సంస్థల నిబంధనలు చైనా నిఘా వ్యవస్థలకు సహకరించే చట్టాలకు లోబడి ఉన్నాయని ఎఫ్సీసీ చైర్మన్ అజిత్ పాయ్ తెలిపారు. అమెరికా కాంగ్రెస్ పరిశీలనలు, నిఘా వర్గాల అభిప్రాయాలు, విదేశాల్లోని సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వచ్చిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజిత్ పాయ్ చెప్పారు. అమెరికా సమాచార, టెక్నాలజీ వ్యవస్థలను కొల్లగొట్టేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీకి ఏమాత్రం అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పారు.