Asianet News TeluguAsianet News Telugu

డోంట్ కేర్ ట్రంప్‌: ఫెడ్ వడ్డీరేట్లు పెంపు


అమెరికా ఆర్థిక వ్యవస్థ ద్రవ్యలభ్యత సమస్య నెలకొల్పవద్దని, వడ్డీరేట్లు పెంచవద్దని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన అభ్యర్థనను ఫెడ్ తోసిపుచ్చింది. మరోసారి పావుశాతం వడ్డీరేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు గురయ్యాయి.

US Federal raises interest rates, signals more hikes ahead
Author
Washington, First Published Dec 21, 2018, 9:45 AM IST

వాషింగ్టన్‌: అమెరికా సెంట్రల్‌ బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో ఈ ఏడాది ఫెడ్‌ నాలుగు దఫాలు వడ్డీరేట్లను పెంచినట్లయింది. ఒకపక్క రేట్ల పెంపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నా ఫెడ్‌ రేట్ల పెంపునకు సిద్ధపడడం గమనార్హం. ఈ ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా బలపడిందని, దాదాపు అంచనాలకు తగినట్లే వృద్ధి నమోదు చేస్తోందని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చెప్పారు.

దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక వడ్డీరేట్లను మరో పావు శాతం పెంచుతున్నామని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ పేర్కొన్నారు. తాజా పెంపుదలతో ఫెడ్‌ రేటు 2.25–2.5%కి చేరింది. ఇదేమీ అసాధారణమైన పెంపుదల కాదని తెలిపారు. 

ఫెడ్‌ సమావేశానికి ముందు రేట్లను పెంచొద్దని, మరో తప్పు చేయొద్దని ఫెడ్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. రేట్ల పెంపుపై నిర్ణయానికి ముందు ఫెడ్‌ సభ్యులు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఎడిటోరియల్‌ చదవాలని కూడా ట్వీట్‌లో సూచించారు. రేట్లను పెంచి మార్కెట్లో లిక్విడిటీ కొరతను తీసుకురావద్దని కోరారు. 

ఇంత చెప్పినా అమెరికా సెంట్రల్ ఫెడ్‌ మాత్రం రేట్లను పెంచేందుకే సిద్ధమైంది. కాకపోతే దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటిదాకా స్పందించలేదు. మరోవైపు బ్యాంకు నిర్ణయాలపై ట్రంప్‌ అభిప్రాయాలు ఎలాంటి ప్రభావం చూపవని ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ వ్యాఖ్యానించారు.

‘2019లో మరో మూడుసార్లు రేట్లు పెంచేందుకు అవసరమైన ఆర్థిక పరిస్థితులుంటాయని ఫెడ్‌ సభ్యుల్లో ఎక్కువమంది గతంలో అభిప్రాయపడ్డారు. కానీ తాజా పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే ఏడాది మరో రెండుసార్లు రేట్లు పెంచితే సరిపోవచ్చు. అయితే మా నిర్ణయాలను ముందుగానే నిర్ధారించలేం. అప్పటికి అందే ఆర్థిక గణాంకాలే విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. దేశీయ ఆర్థిక స్థితిగతులనే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలను సైతం పరిశీలిస్తూ ఉంటాం’’ అని ఫెడ్ చైర్మన్ పావెల్‌ వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios