వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందు ఉన్నది ముసళ్ల పండుగ అని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ వచ్చే రెండేళ్లలో మాంద్యం కోరల్లో చిక్కుకోవడం ఖాయమని వారు జోస్యం చెబుతున్నారు. మెజారిటీ ఆర్థిక విశ్లేషకులు 2020, 2021ల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అమెరికా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే
సోమవారం విడుదలైన ఓ సర్వేలో అమెరికా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నదన్న అభిప్రాయాలు వినిపించాయి. గత వారం అమెరికా ఆర్థిక గణాంకాలు మిశ్రమంగా విడుదలైన నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాంద్యం భయాలను కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేషనల్ అసోసియేషన్ ఫర్ బిజినెస్ ఎకనామిస్ట్స్ (ఎన్‌ఏబీఈ) సర్వేలో మెజారిటీ ఆర్థిక నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు పొంచి ఉన్నదని చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది.

2021 ఆఖరికల్లా మాంద్యం ముప్పు తప్పదన్న నిపుణులు
ఫిబ్రవరి సర్వేతో పోల్చితే ఈ ఏడాది తదుపరి మాంద్యం ప్రారంభం అవుతుందని ఎన్‌ఏబీఈ అధ్యక్షుడు హంటర్ అన్నారు. ఈ ఏడాది సంగతెలా ఉన్నా వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనాలు చాలావరకు వినిపిస్తున్నాయి. కాగా, సర్వేలో పాల్గొన్నవారిలో 34% ఆర్థికవేత్తలు 2021 ఆఖరుకల్లా అమెరికా మాంద్యం బారిన పడుతుందని అంటున్నారు. 

ఫిబ్రవరితో పోలిస్తే మాంద్యం ప్రభావం ఎక్కువని తేల్చిన ఆర్థికవేత్తలు
కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సర్వేలో అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందని చెప్పిన వారు 25 శాతం మంది మాత్రమే ఉండటం గమనార్హం. ఇక తాజా సర్వేలో 38 శాతం మంది 2020లోనే ఆ ఛాయలు కనిపిస్తాయని అంటుండగా, రెండు శాతం మంది ఈ ఏడాదే ఆ ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు. 

అంతర్జాతీయ ఆర్థిక ప్రభావం డాలర్ ప్రభావం సహజమే
అమెరికా ఆర్థిక ఇబ్బందులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సహజంగానే పడతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దదిక్కుగా ఉన్న అమెరికా కరెన్సీ డాలరే ప్రపంచ కరెన్సీగా ఉండటంతో అంతర్జాతీయంగా ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అవుతున్న విషయం తెలిసిందే. నిజానికి అమెరికా ఫెడ్ రిజర్వ్ చాలా ఏళ్ల తర్వాత కీలక వడ్డీరేట్లను తగ్గించింది.

వడ్డీరేట్లు తగ్గించాలని ఫెడ్ రిజర్వుపై ట్రంప్ ఒత్తిడి
దేశ ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహం నింపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నది. ట్రంప్ సైతం వడ్డీరేట్లను తగ్గించాలని ఫెడరల్ రిజర్వ్‌పై ఒత్తిడి తెచ్చారు. అయినా మాంద్యం దెబ్బ అమెరికాకు ఇప్పటికే తగిలిందని, ఇది వచ్చే రెండేళ్లలో తారాస్థాయికి చేరితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలేనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డోంట్ ప్రాబ్లం.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ప్రతి దాన్నీ భయంతో చూడాల్సిన అవసరం లేదని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. భారతీయ ఆర్థిక పరిస్థితులపై విచారం, దిగులు అక్కర్లేదన్న ఆయన అందరు తమ ముందు ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని కోరారు. ఆర్థిక మాంద్యం, జాతీయ - అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్న మాట నిజమేనని అంగీకరించినా.. ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. 

ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరమన్న రఘురామ్ రాజన్
దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగానే ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం భయపడే స్థాయిలోనే ఉందన్నారు. ముఖ్యంగా విద్యుత్, బ్యాంకింగేతర ఆర్థిక రంగాల్లో నెలకొన్న సమస్యలను కేంద్రం వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని ఓ ఇంటర్వ్యూలో సూచించారు. 

అన్ని రంగాల్లో మాంద్యం ఎపెక్ట్ అన్న రాజన్
ప్రస్తుతం అన్ని రంగాల్లో మందగమనం కనిపిస్తున్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఈ పరిస్థితులు మారాలంటే ఉద్దీపనలు అవసరం అని అన్నారు. అలాగే పడకేసిన జీడీపీని పరుగులు పెట్టించాలంటే మళ్లీ కొత్తగా సంస్కరణల బాట పట్టాల్సిందేనన్న ఆయన అంతర్జాతీయ మార్కెట్లలో రుణ సమీకరణ సంస్కరణ కాదని, అదొక వ్యూహాత్మక చర్య మాత్రమేనని పేర్కొన్నారు. 

ఆర్థిక వ్యవస్థకు ఏమీ కాదంటున్న డొనాల్డ్ ట్రంప్
తమ దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమీ కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ‘అన్నింటికీ నేను సిద్ధంగానే ఉన్నా. మాంద్యం గురించి నేను అస్సలు దిగులు చెందడం లేదు. మా పాలనలో అమెరికా ఆర్థిక పరిస్థితులు బలపడ్డాయి. అమెరికన్ కస్టమర్లు చాలా సంపన్నులు అని మీడియాతో అన్నారు. 

మిగతా దేశాలకే ప్రాబ్లం అంటున్న ట్రంప్
‘అద్భుతమైన రీతిలో నేను పన్ను ప్రోత్సాహకాలను అందించాను. అమెరికన్ల వద్ద ఇప్పుడు బోలెడు డబ్బు ఉన్నది. వారి కొనుగోలు శక్తి బాగున్నది. వాస్తవానికి చాలామంది ఆర్థికవేత్తలు అమెరికాకు ఏమీ కాదని అంటున్నారని, ప్రపంచంలోని మిగతా దేశాలకు మాత్రం సమస్యలే’ అని హెచ్చరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ట్రంప్ ముఖ్య ఆర్థిక సలహాదారు లర్రీ కుడ్లో సైతం మాంద్యం ప్రభావాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు.