వాషింగ్టన్‌: అమెరికాలో నిరుద్యోగం పెరుగుతున్నదన్న సాకుతో  ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ తదితర వీసాల జారీపై ఈ ఏడాది ఆఖరు వరకు నిషేధం విధించారు. అయితే ఈ విధానం ఆ తరువాత కూడా కొనసాగడంతో పాటు వీసా నిబంధనలను మరింత కఠినం చేయనున్నట్టు తెలుస్తున్నది. అమెరికా ఇటీవల విడుదల చేసిన ‘2020 స్ప్రింగ్‌ ఎజెండా’లో వీసా నిబంధనల్లలో మరిన్ని మార్పులు ప్రతిపాదించారు.

ప్రతిపాదిత మార్పుల ప్రకారం ఇక నుంచి హెచ్‌1-బీ వీసా నిర్వచనం మారనున్నది. అత్యంత నైపుణ్యం ఉన్నవారికే ఈ వీసాను ఇవ్వనున్నారు. ఈ వీసా జారీ చేయాలంటే ఆ వ్యక్తి వీసాకు దరఖాస్తు చేసుకున్న సమయంలో అతను పని చేస్తున్న కంపెనీ జీతాన్ని కచ్చితంగా పెంచి ఉండాలి. 

మరోవైపు, హెచ్‌-1బీ వీసాదారుల కుటుంబసభ్యులు అమెరికాలో ఉద్యోగం చేయడానికి అనుమతినిచ్చే హెచ్‌4 వీసాలను పూర్తిగా రద్దు చేయనున్నట్టు తెలుస్తున్నది. స్టూడెంట్‌ వీసాల గడువుపై నిర్దిష్ట కాలపరిమితిని విధించాలని యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రతిపాదించింది. 

గడువు ముగిసిన తర్వాత విదేశీ విద్యార్థులను వారి సొంత దేశాలకు తిప్పి పంపాలని సూచించింది. విద్యార్థులు తమ విద్యాభ్యాసం ముగిసిన తర్వాత కొన్నాళ్లు ఉండి శిక్షణ పొందడానికి ఇచ్చే ఓపీటీ వీసాల దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని ప్రతిపాదించింది.

also read కరోనా కష్టకాలంలో ఆ కంపెనీ ఉద్యోగులకు ప్రోమోషన్లు, ఇంక్రిమెంట్, బోనస్లు ...

ఇదిలా ఉంటే హెచ్‌-1బీ వీసాల రద్దుతో భారత ఐటీ కంపెనీలపై రూ.1,200 కోట్ల వరకు భారం పడనున్నది. దీంతో ప్రస్తుత ఆర్థిక  సంవత్సరంలో ఈ కంపెనీల లాభాలూ 0.25 శాతం నుంచి 0.30 శాతం వరకు తగ్గనున్నాయని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేస్తోంది. మరోవైపు కొవిడ్‌-19 వల్ల ఈ ఏడాది భారత ఐటీ కంపెనీల లాభాలకు 23 శాతం గండిపడనుందని, హెచ్‌-1బీ వీసాల రద్దు భారం దీనికి అదనమని క్రిసిల్‌ వెల్లడించింది. 

తాజాగా ట్రంప్ నిర్ణయంతో వీసాలపై భారత ఐటీ నిపుణుల్ని అమెరికా తీసుకెళ్లి, అక్కడి తమ ఐటీ యూనిట్లలో పని చేయించుకునే అవకాశం భారత ఐటీ కంపెనీలకు పోయింది. అవసరమైన ఉద్యోగుల్ని 25 శాతం అధిక జీతాలతో స్థానికులతోనే భర్తీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

ట్రంప్‌ సర్కార్‌ అధికారం చేపట్టినప్పటి నుంచే అమెరికాలోని భారత ఐటీ కంపెనీలు జాగ్రత్త పడ్డాయి. హెచ్‌-1బీ వీసాల తిరస్కరణ రేటు పెరిగి పోవడంతో స్థానికుల్నే పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్లోకి తీసుకోవడం ప్రారంభించాయి. 

దీంతో ప్రస్తుతం అమెరికాలోని టాప్‌-5 భారత ఐటీ కంపెనీల ఉద్యోగుల్లో హెచ్‌-1 బీ వీసాలపై వచ్చిన వారు 5 శాతానికి మించి లేరని క్రిసిల్‌ పేర్కొంది. 2017లో 30-35 శాతం ఉన్న స్థానికుల నియామకం ప్రస్తుతం 60 శాతానికి  చేరింది.