డ్రాగన్‌పై మళ్లీ సుంకాల మోత సరే.. అమెరికాకే కష్టం 

వాషింగ్టన్‌/బీజింగ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశాలైన అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు తెరపడే అవకాశాలు కన్పించట్లేదు సరికదా మరింత రాజుకున్నాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సుంకాలు పెంచడమే ఇందుకు కారణం.

మరో 200 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలను ట్రంప్‌ రెట్టింపు చేశారు. ఓ వైపు వాణిజ్య ఉద్రిక్తతలపై ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరుగుతుండగా.. ట్రంప్‌ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు చైనా కూడా ఇందుకు ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచేందుకు సిద్ధమైంది. 

శుక్రవారం లేదా ఆ తర్వాత నుంచి చైనా ఉత్పత్తులపై అధిక సుంకాలు అమలవుతాయని యూఎస్‌ ఫెడరల్‌ రిజిస్టర్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో చైనా నుంచి దిగుమతి చేసుకునే పలు, హ్యాండ్‌బ్యాగులు, దుస్తులు, పాదరక్షలు ఇలా తదితర 200 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై ఉన్న 10శాతం సుంకాన్ని 25శాతానికి పెంచుతూ ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చైనా వాణిజ్య శాఖ కూడా స్పష్టం చేసింది.

‘తాజా పరిణామాలపై చైనా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. అమెరికాకు బదులిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతాం. ఇప్పటికీ సహకారం, సంప్రదింపుల ద్వారా వాణిజ్య సమస్యను పరిష్కరించుకునేందుకు అమెరికా మాతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచుతామని ఇటీవల ట్రంప్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సంప్రదింపుల కోసం చైనా అత్యున్నత వాణిజ్య రాయబార బృందం గురువారం అమెరికా చేరుకుంది. శుక్రవారం మరోసారి రెండు దేశాల అధికారుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇదే సమయంలో ట్రంప్‌ సుంకాలను పెంచడం అంతర్జాతీయ మార్కెట్లలో కలవరం రేపుతుంది. 

ఇదిలా ఉండగా.. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం చివరి దశకు చేరుకుందని, కానీ బీజింగ్‌ మరోసారి చర్చలు కోరుకుంటోందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మరోసారి చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా లేమని వ్యాఖ్యానించారు.

ఒక్కసారి అమెరికా, చైనా మధ్య దిగుమతుల తీరు తెన్నులు గమనిద్దాం..2018లో అమెరికాకు 539 బిలియన్ల డాలర్ల విలువ చేసే ఎగుమతులు చైనా చేసింది. ఇందులో చైనా ఎగుమతి చేసిన వాటిల్లో రసాయనాలు 21.4 బిలియన్ల డాలర్లు, రవాణా సంబంధ వస్తువులు 21.7 బిలియన్ డాలర్లు, ఫర్నీచర్ 25.8 బిలియన్ డాలర్లు, 26.5 బిలియన్ డాలర్ల విలువగల ఫ్యాబ్రికేటెడ్ మెటల్స్ ఉన్నాయి. 

29.8 బిలియన్ డాలర్ల విలువైన దుస్తులు, 38.7 బిలియన్ డాలర్ల విలువ గల మెషినరీ, 40.2 బిలియన్ డాలర్ల విలువైన ప్లాస్టిక్, తోళ్లు, రబ్బర్ వస్తువులు, 44 బిలియన్ డాలర్ల తయారీ వస్తువులు, 49.9 బిలియన్ల డాలర్ల విలువైన విద్యుత్ పరికరాలు, 186.5 బిలియన్ డాలర్ల విలువైన కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను చైనా ఎగుమతి చేస్తోంది. 

ఇక చైనాకు అమెరికా ఎగుమతుల విలువ కేవలం 120.3 బిలియన్ల డాలర్లు మాత్రమే. 3.4 బిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ పరికరాలు, తయారీ రంగ వస్తువులు 3.7 బిలియన్ డాలర్లు, వ్యవసాయ ఉత్పత్తులు 5.9 బిలియన్ డాలర్లు కాగా, 7.1 బిలియన్ డాలర్ల విలువైన చమురు - గ్యాస్ చైనాకు ఎగుమతి అవుతోంది. రవాణా సంబంధ వస్తువులు 27.8 బిలియన్ డాలర్లు, 17.9 బిలియన్ డాలర్ల విలువైన కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, 16.2 బిలియన్ డాలర్ల విలువైన రసాయనాలు, 11.1 బిలియన్ డాలర్ల విలువైన మెషినరీపై చైనా సుంకాలు విధిస్తుంది. 

47 శాతం చైనా దిగుమతులపై అమెరికా సుంకాలు విధించింది. 5700కి పైగా ఉత్పత్తులపై దీని ప్రభావం పడింది. 91 శాతం అమెరికా దిగుమతులపై చైనా సుంకాలు విధిస్తోంది.