Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్లో ఆగని నష్టపాతం, సెన్సెక్స్ 509 పాయింట్ల నష్టం, రూపాయి పతనంతో పండగ చేసుకుంటున్న ఐటీ కంపెనీలు..

స్టాక్ మార్కెట్లు వరుసగా వారంలో మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 500 పాయింట్ల  నష్టపోతే,  నిఫ్టీ దాదాపు 140 పాయింట్లు నష్టపోయింది. ఇండెక్స్ లో వెయిటేజీ పరంగా బలమైన స్టాక్ గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 2.6 శాతం నష్టపోయింది. మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది.
 

Unstoppable losses in the market Sensex 509 points loss IT companies are celebrating with the fall of the rupee
Author
First Published Sep 28, 2022, 6:17 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాల ట్రెండ్ ఆగడం లేదు.  బుధవారం వరుసగా మూడో రోజు స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు బిఎస్‌ఇ సెన్సెక్స్ 509.24 పాయింట్లు (0.89 శాతం) నష్టపోయి 56598.28 వద్ద ముగిసింది. అదే సమయంలో, నిఫ్టీ 148.80 పాయింట్లు (0.87 శాతం) పడిపోయి 16858.60 స్థాయి వద్ద ముగిసింది. గత 6 సెషన్లుగా మార్కెట్ క్షీణత కొనసాగుతుండటం గమనార్హం.

మార్కెట్ ఈరోజు నిరుత్సాహకరంగా ప్రారంభమైంది. ఈ ఉదయం సెన్సెక్స్ 398 పాయింట్ల పతనంతో 56,710 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అదే సమయంలో, నిఫ్టీ 136 పాయింట్ల నష్టంతో 16,848 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ట్రేడింగ్ ప్రారంభ దశలో సెన్సెక్స్ 500 పాయింట్ల దిగువకు పడిపోయింది.

వివిధ రంగాల సూచీలను పరిశీలిస్తే.. నిఫ్టీ మెటల్ ఈరోజు గరిష్టంగా 1.94 శాతం పతనాన్ని చవిచూసింది. దీని తర్వాత, సెక్టోరల్ ఇండెక్స్‌లలో నిఫ్టీ మెటల్ (-1.56 శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (-1.23 శాతం), నిఫ్టీ మీడియా (-1.00 శాతం), నిఫ్టీ గ్యాస్ & ఆయిల్ (-0.91 శాతం) ఎక్కువగా నష్టపోయాయి. మరోవైపు నిఫ్టీ హెల్త్‌కేర్ (0.86 శాతం), ఫార్మా (0.85 శాతం), ఐటీ (0.24 శాతం) లాభాలతో ముగిశాయి.

టాప్ గెయినర్, టాప్ లూజర్
బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఏషియన్ పెయింట్స్ (2.80 శాతం), సన్ ఫార్మా (2.10 శాతం), డాక్టర్ రెడ్డి (1.78 శాతం), ఐషర్ మోటార్స్ (1.72 శాతం), పవర్ గ్రిడ్ (1.20 శాతం) టాప్ గెయినర్లుగా ఉన్నాయి. 

మరోవైపు హిందాల్కో (-3.65 శాతం), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (-3.44 శాతం), యాక్సిస్ బ్యాంక్ (-3.25 శాతం), ఐటీసీ (-3.9 శాతం), రిలయన్స్ (2.74 శాతం) టాప్ లూజర్‌లుగా ఉన్నాయి.

ఇక నిఫ్టీ ఐటి సూచి కూడా ఈ రోజు పాజిటివ్ గా ముగిసింది.  దీనికి కారణం లేకపోలేదు రూపాయి పతనం అవడం వల్ల ఐటీ కంపెనీలకు ఆదాయం పెరుగుతుంది ఎందుకంటే ఐటీ కంపెనీలకు విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి తద్వారా డాలర్ బలపడటం ఆ కంపెనీలకు కలిసివస్తుంది. మైండ్ ట్రీ మినహా డ్యూటీ ఐటి సూచి లోని దాదాపు అన్ని స్టాక్స్ పాజిటివ్గా ముగిశాయి. టెక్ మహీంద్రా టిసిఎస్ సుమారు ఒక శాతం మేర లాభపడ్డాయి

రూపాయి భారీ పతనం
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి ఈరోజు దాదాపు 40 పైసలు క్షీణించి 81.93 స్థాయికి చేరుకుంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, నేటి ట్రేడింగ్‌లో ఇది 81.95 స్థాయికి పడిపోయింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత, డాలర్ రెండు దశాబ్దాల ఎగువకు చేరుకోవడం గమనార్హం. ఇలా డాలర్ పెరగడం వల్ల భారత రూపాయి మాత్రమే కాకుండా యూరప్, జపాన్ కరెన్సీలు కూడా క్షీణించాయి. విదేశీ పెట్టుబడిదారులు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల నుండి మూలధనాన్ని ఉపసంహరించుకోవడం ద్వారా సురక్షితమైన ప్రదేశాలలో పెట్టుబడి పెట్టడానికి ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ కరెన్సీని దెబ్బతీస్తోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios