Asianet News TeluguAsianet News Telugu

విమానయాన రంగంలో మరో36 వేల ఉద్యోగాలు గోవిందా!

కరోనా మహమ్మారి విసిరిన సవాల్‌తో విమానయాన రంగం తీవ్రంగా కుదేలైంది. దీనితో దిగ్గజ సంస్థలు కూడా ఖర్చులు తగ్గించుకునే పనిలోపడ్డాయి. అమెరికా యునైటెడ్​ ఎయిర్​లైన్స్ 36 వేల మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించేందుకు కసరత్తు చేస్తోంది.
 

United Airlines warns 36,000 workers they ..
Author
Hyderabad, First Published Jul 9, 2020, 1:33 PM IST

వాషింగ్టన్: అమెరికాలోని విమానయాన సంస్థల్లో దిగ్గజం ‘యునైటెడ్​ ఎయిర్‌లైన్స్’ భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తోంది. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో ప్రపంచ విమానయాన రంగం తీవ్రం నష్టపోయింది. 

36 వేల మంది సిబ్బందికి తాత్కాలిక తొలగింపు లేఖలు పంపింది. సంస్థ ఉద్యోగుల్లో ఇది సగానికి సమానం. ఈ ఏడాది అక్టోబర్ నుంచే ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. లేఖలు అందుకున్న అందరినీ తొలగిస్తున్నట్లు కాదని వివరణ ఇచ్చింది యునైటెడ్ ఎయిర్ లైన్స్.

ఎంత మందిని సెలవులపై పంపాలనే విషయంపై తుది నిర్ణయం తర్వాత తీసుకోనున్నట్లు  యునైటెడ్ ఎయిర్​లైన్స్ స్పష్టతనిచ్చింది. విమానయాన రంగం ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించట్లేదని నిపుణులు అంటున్నారు. 

ముఖ్యంగా ఇటీవల అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. దీనితో చాలా రాష్ట్రాలు ప్రయాణాలపై కొత్త నిబంధనలు విధిస్తున్నాయి. ఫలితంగా డిమాండ్ పుంజుకునే పరిస్థితులు కనిపించడం లేదని యునైటెడ్ ఎయిర్​లైన్స్ వెల్లడించింది.

also read ఆరునెలల్లో 11వేలు పెరిగిన బంగారం ధర.. నేడు తులం ఎంతంటే? ...

ప్రయాణాల డిమాండ్​కు తగ్గట్లు కచ్చితంగా ఉద్యోగులను తగ్గించుకునే పరిస్థితులు ఏర్పడ్డట్లు విమానయాన సంస్థలు అంటున్నాయి. ఇందులో భాగంగానే ఉద్యోగులను సెలవులపై పంపడం, ఉద్యోగాల సంఖ్య తగ్గించుకోవడం వంటి ప్రణాళికలు వేస్తున్నాయి.

ఇంతకుముందు ఫ్రాన్స్ కు చెందిన విమానయాన సంస్థ ‘ఎయిర్‌ఫ్రాన్స్‌’ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఎయిర్ ఫ్రాన్స్ , దాని ప్రాంతీయ అనుబంధ సంస్థ హాప్ సంయుక్తంగా 7,500 మందిని ఇంటికి పంపివేయాలని నిర్ణయించామని గత శుక్రవారం ప్రకటించాయి.

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోవడం, భవిష్యత్తులో విమాన ప్రయాణ అవకాశాలపై నీలినీడలు కమ్ముకోవడంతో సంక్షోభంలో పడటంతో సంస్థ ఈ నిర్ణయం ప్రకటించింది. ఎయిర్‌ ఫ్రాన్స్‌ 6500 మందిని, హాప్‌లో వెయ్యిమందిని తొలగిస్తామని ఆ రెండు సంస్థలు వెల్లడించాయి. ఎయిర్‌ ఫ్రాన్స్‌లో మొత్తం 41వేలమంది ఉద్యోగులు, హాప్‌లో 2400 మంది పనిచేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios