ఇంధనంతో నడిచే వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయని  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారుతుందని అన్నారు. 

ఎలక్ట్రిక్, ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయని కేంద్ర రవాణా, రహదారుల వ్యవహారాల మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో పరిస్థితి మారుతుందని చెప్పారు. రాజ్యసభలో ఆయన ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానాన్ని పరిశీలిస్తే.. పెట్రోల్, డీజిల్‌ వాహనాల అమ్మకాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతుండగా.. ఎలక్ట్రిక్, ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. 

అయితే ప్రత్యామ్నాయ ఇంధనం, ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాల కోసం ఎలాంటి లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకోలేదు. ఈ కొనుగోళ్లు వినియోగదారుల సహజ ఎంపికగా ఉండేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యం కానీ, లక్ష్యాల మేరకు కొనుగోళ్లు జరిగేలా చూడాలని భావించడం తగదు. ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల కొరత సమస్య తీవ్రంగా ఉందన్న ఆరోపణలు తప్పు. అన్ని కార్యాలయాలతో సహా ప్రతిచోటా ఈవీ ఛార్జింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేసే రోజు త్వరలోనే రానుంది. జాతీయ రహదారుల సంస్థ 650 ఛార్జింగ్‌ స్టేషన్లను నిర్వహిస్తోంది. హైవేలపై ప్రతి 40 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్‌ పాయింట్‌ ఉంది. ఇక స్కూటర్, కార్ల తయారీ సంస్థలు చిన్న ఛార్జర్‌లను అందిస్తున్నాయి. రోజంతా కారును ఉపయోగించవచ్చు. సాయంత్రం ఇంట్లో ఛార్జింగ్‌కు ప్లగ్‌ చేసుకోవచ్చు. ఇది రాత్రిపూట ఛార్జ్‌ అవుతుంది. ఉదయం ఎటువంటి సమస్య ఉండదు. అయితే ఇప్పుడు ప్రధాన సమస్యంతా బ్యాటరీ వ్యయం తీవ్రంగా ఉండడమే. 

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో వినియోగించే లిథియం అయాన్‌ వనరు పెద్ద సవాలు. మన దగ్గర లిథియం అయాన్‌ లేదు. దాదాపు 81శాతం బ్యాటరీలను ఇక్కడ భారతదేశంలోనే తయారు చేస్తున్నాం. ప్రపంచంలో లిథియం అయాన్‌ అందుబాటులో ఉంది. దీనిని దిగుమతి చేసుకుంటున్నాం. ప్రభుత్వం కొన్ని గనులను కొనుగోలు చేసే ప్రక్రియలో ఉంది. ప్రస్తుతం భారత్‌కు ముడి చమురు దిగుమతుల విలువ రూ.8 లక్షల కోట్లుగా ఉంది. ఇది ఐదేళ్లలో రూ.25 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. దేశం, ఆర్థిక వ్యవస్థ, జీవావరణం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఇంధనం, విద్యుత్, ఇథనాల్, మిథనాల్, బయో సీఎన్‌జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ల వైపునకు వ్యవస్థ మారాల్సిన సమయం ఇది. మనం అదే బాటలో ఉన్నామ‌ని కేంద్ర రవాణా, రహదారుల వ్యవహారాల మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.