15 ఏళ్ళ పాత బడ్డ ప్రభుత్వ వాహనాలన్నీ రద్దు చేయడం ఖాయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ సారి కాస్తీ సీరియస్ గా చెప్పేశారు. ఇప్పటికే 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను స్క్రాపింగ్ సెంటర్లకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలకూ ఉత్తర్వులు పంపించామని ఇందులో పునరాలోచనలు ఏమి లేవని తెలిపారు.
15 ఏళ్లు దాటిన వాహనాల స్క్రాప్ విధానంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి తీవ్రంగా స్పందించారు. 15 ఏళ్లు నిండిన ప్రభుత్వ వాహనాలన్నీ కూడా స్క్రాప్ కింద అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన పాలసీని రాష్ట్రాలకు పంపామని ఆయన చెప్పారు. ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ గడ్కరీ మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో నేను నిన్న ఒక ఫైల్‌పై సంతకం చేసాను. దీని ప్రకారం, 15 ఏళ్లు పైబడిన భారత ప్రభుత్వ వాహనాలన్నీ స్క్రాప్ అవుతాయి. నేను భారత ప్రభుత్వ ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలకు పంపాను. వాటిని రాష్ట్ర స్థాయిలో కూడా అడాప్ట్ చేసుకోవాలని అని ప్రకటించారు.
అంతేకాదు పానిపట్‌లో రెండు ఇండియన్ ఆయిల్ ప్లాంట్లు దాదాపుగా పనిచేస్తున్నాయని, అందులో ఒకటి రోజుకు లక్ష లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తుందని, మరో ప్లాంట్ వరి గడ్డిని ఉపయోగించి రోజుకు 150 టన్నుల బయో-బిటుమెన్‌ను ఉత్పత్తి చేస్తుందని గడ్కరీ చెప్పారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గడ్కరీ కృషిని ఆయన అభినందించారు.
స్క్రాప్ పాలసీ అంటే ఏమిటి?
స్క్రాప్ చేయడం అంటే, 15 సంవత్సరాల కంటే ఎక్కువ పాత కారు ఉంటే, దాని రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది. ఆ కారును రోడ్డుపై నడపలేరు. ఒక వేళ ఆ కారుతో పట్టుబడితే, జరిమానా విధించవచ్చు. 10 సంవత్సరాల కంటే పాత వాణిజ్య వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత ప్రైవేట్ ప్యాసింజర్ వాహనాలు తప్పనిసరిగా ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఫిట్‌నెస్ పరీక్షను పూర్తి చేయడం తప్పనిసరి. మీ వాహనం ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమైతే, మీరు మీ వాహనాన్ని దేశవ్యాప్తంగా నమోదైన 60-70 స్క్రాప్ సౌకర్యాలలో ఒకదానిలో తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుంది.
అయితే స్క్రాప్ సెంటర్లలో 15 సంవత్సరాల వయస్సు ఉన్న వాహనాలను డిపాజిట్ చేసిన వారికి అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు స్క్రాప్ సెంటర్లో డిపాజిట్ చేసిన పాత వాహనానికి బదులుగా డిపాజిట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు కొత్త వాహనం కొనడానికి వెళితే, మీరు అనేక బెనిఫిట్స్ పొందుతారు. మీరు పాత వాహనం స్క్రాప్ విలువను పొందుతారు, ఇది కొత్త వాహనం షోరూమ్ ధరలో 5 శాతం ఉంటుంది. అదనంగా, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వాహనాలకు 25% , వాణిజ్య వాహనాలకు 15% వరకు వినియోగదారుల రహదారి పన్నును మాఫీ చేస్తారు.
