బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల సంఖ్య మొత్తం 58 మంది. ఈ జాబితాతో కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాతో పాటు నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీ, నితిన్, చేతన్ సందేస్రా, లలిత్ మోడీ, యూరోపియన్ దళారీ గ్యూడో రాల్ఫ్ హస్చకే, కార్ల్ గెరోసాలను భారత్‌కు రప్పించడానికి కేంద్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులతో పాటు ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేసినట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. ఆర్థిక నేరగాళ్లలో చాలామంది బ్రిటన్, యూఏఈ, బెల్జియం, ఈజిప్ట్, అమెరికా, అంటిగా, బార్బుడా దేశాల్లోనే తలదాచుకుంటున్నారు.

వీరిని తమకు అప్పగించాల్సిందిగా భారత్ ఆయా దేశాల ప్రభుత్వాలను కోరింది. వీటిపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, డీఆర్ఐ వంటి సంస్థలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాయి. రూ.13 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి సంచలనం సృష్టించిన మొహుల్ చోక్సి అప్పగింతపై 2 అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే గుజరాత్‌కు చెందిన వ్యాపారి ఆశిష్ జోబన్‌పుత్ర, ఆయన భార్య ప్రీతిని అమెరికా నుంచి భారత్‌కు రప్పించడానికి అగ్రరాజ్యానికి కేంద్రప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.