న్యూఢిల్లీ: కొత్త ఖాతాదారులను చేర్చుకోరాదన్న రిజర్వు బ్యాంకు ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయని పేటియం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ శేఖర శర్మ తెలిపారు. ఈ పరిమితిని ఎప్పుడు సడలిస్తారన్న అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోందని ఓ మ్యూచువల్ ఫండ్ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. 

కొత్తవారిని చేర్చుకోవడంపై ఉన్న పరిమితిని సడలించే విషయమై ఆర్బీఐతో చర్చలు కొనసాగుతున్నాయని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ వర్మ తెలిపారు. అయితే ఇవి ఎప్పుడు ఒక కొలిక్కి వస్తాయన్న విషయంలో తెలియడం లేదని పేర్కొన్నారు. 

కొత్త ఖాతాదారులను చేర్చుకొనే విషయంలో కొన్ని పేమెంట్స్‌ బ్యాంకు అవకతవకలకు పాల్పడుతుండడం, ఖాతా తెరవడం కోసం కేవైసీ నిబంధనలను సరిగ్గా పాటించకపోవడం వంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్బీఐ గత నెలాఖరు నుంచి పేటీఎంలో కొత్త ఖాతాదారులను చేర్చుకోవడంపై నిషేధాన్ని విధించింది. 

టెలికాం వినియోగదారుల అనుమతి తీసుకోకుండానే ఎయిర్‌టెల్‌ సంస్థ తమ ఖాతాదారుల పేరు మీద పేమెంట్‌ బ్యాంక్‌ ఖాతాలను తెరవడం వివాదాస్పదం కావడంతో గత డిసెంబర్లో ఆ సంస్థ లైసెన్స్‌ను రద్దు చేసిన ఆర్బీఐ తరువాత జులైలో ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ను పునరుద్ధరించింది. ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌తో పాటు ఫినో పేమెంట్‌ బ్యాంక్‌లను కూడా కొత్త ఖాతాదారులను చేర్చుకోవడాన్ని నిలిపివేయాలని అప్పట్లో ఆర్బీఐ కోరింది.

బ్యాంకు ఖాతాలను తెరిచే ముందు పేమెంట్‌ బ్యాంకులు కూడా సాధారణ బ్యాంక్‌ మాదిరిగానే సదరు ఖాతాదారు పూర్తి వివరాలను నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) రూపంలో సమీకరించాల్సిందేనంటూ ఆర్బీఐ గత ఫిబ్రవరిలోనే నిబంధనలను జారీ చేసింది. దీనికి తోడు పేమెంట్‌ బ్యాంకు వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్‌ కెవైసి విధానాన్ని కూడా ఆర్బీఐ ఆక్షేపించింది. ప్రత్యేక సంస్థల ద్వారా కేవైసీ చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది.

దీంతో పేమెంట్‌ బ్యాంక్స్‌కు కేవైసీ ఏర్పాట్లు చేసుకోవడం తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో పేమెంట్‌ బ్యాంకులు కొత్త వారిని చేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదరయ్యాయి. ఫలితంగా జులై నుంచి పేటిఎంతో సహా కొన్ని పేమెంట్‌ బ్యాంకుల్లో కొత్త ఖాతాదారుల చేరిక కష్టతరంగా మారింది.