యూఏఈ ఇండియా బిజినెస్ కౌన్సిల్-యూఏఈ చాప్టర్‌ని (యూఐబీయూసీయూసీ)ఇరుదేశాలు శనివారం దుబాయ్‌లో ప్రారంభించాయి. భారత్-యూఏఈలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా భారత్-యూఏఈ మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. రాబోయే రోజుల్లో దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గాను యూఏఈ ఇండియా బిజినెస్ కౌన్సిల్-యూఏఈ చాప్టర్‌ని (యూఐబీయూసీయూసీ)ఇరుదేశాలు శనివారం దుబాయ్‌లో ప్రారంభించాయి. యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ థానీ బిన్ అహ్మద్ అల్ జెయోదీ దీనిని ప్రారంభించారు. భారత్-యూఏఈలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనితో పాటు యూఏఈ నుంచి భారత్‌ 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని కూడా లక్ష్యం పెట్టుకుంది. ఈ లక్ష్యాలను సాధించేందుకు యూఐబీయూసీయూసీ సహాయం చేస్తుంది. 

దీనిపై డాక్టర్ థానీ బిన్ అహ్మద్ మాట్లాడుతూ.. యూఏఈ ఇండియా బిజినెస్ కౌన్సిల్ - యూఏఈ చాప్టర్‌ను ప్రారంభించడం ద్వారా ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం అవతాయన్నారు. ఇది ద్వైపాక్షిక వాణిజ్యం ,పెట్టుబడులకు ఊతం ఇవ్వడంతో పాటు ఇది రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని అహ్మద్ ఆకాంక్షించారు. యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ..యూఏఈ - భారతదేశం మధ్య సంబంధాలను బలోపేతమయ్యే క్రమంలో మరో ముఖ్యమైన మైలురాయికి చేరిందన్నారు. యూఏఈ ఇండియా బిజినెస్ కౌన్సిల్ వ్యవస్థాపక సభ్యులందరికీ సంజయ్ అభినందనలు తెలియజేశారు.

UIBC-UC అంటే ఏమిటి?

యూఏఈ ఇండియా బిజినెస్ కౌన్సిల్-ఇండియా చాప్టర్‌ 2016లో న్యూఢిల్లీలో స్థాపించబడింది. 3 సెప్టెంబర్ 2015న న్యూ ఢిల్లీలో జరిగిన ఇండియా-యూఏఈ జాయింట్ కమిషన్ సమావేశంలో యూఐబీసీని యూఏఈ అధ్యక్షుడు (అప్పటి కేబినెట్ మంత్రి) షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ - అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రారంభించారు.

కౌన్సిల్‌లో యూఏఈ నుంచి సావరిన్ వెల్త్ ఫండ్స్ .. భారత్ నుంచి టాటా గ్రూప్, రిలయన్స్, అదానీ వంటి కంపెనీలు వున్నాయి. అలాగే ఓలా, జెరోధా, ఈజీమైట్రిప్ వంటి టెక్ ఇన్నోవేటర్‌లతో సహా రెండు దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సమూహాలు సభ్యులుగా వున్నాయి. ఈ కౌన్సిల్ యూఏఈలో పనిచేస్తున్న అగ్రశ్రేణి భారతీయ పారిశ్రామికవేత్తలను ఒకచోట చేర్చింది. ఇది రెండు దేశాల మధ్య ముఖ్యమైన ప్రాజెక్టులు , వ్యూహాత్మక భాగస్వామ్య సాధనకు ప్రాతినిధ్యం వహిస్తుంది. భారతదేశంలో పెట్టుబడులు కూడా దీని ద్వారా ప్రోత్సహించబడతాయి.