ముంబై: ఇంటా, బయటా అనిశ్చితి ఆందోళనలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ పతనం చవి చూశాయి. ఆకాశాన్ని మబ్బులు కమ్మినప్పుడు మెరుస్తున్న ఏకైక తారలా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్లు జిగేల్‌మన్నాయి. 


అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, హాంకాంగ్‌లో నిరసనలు, అర్జెంటీనా కరెన్సీ పతనంతో గ్లోబల్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. ప్రతికూల గ్లోబల్‌ సంకేతాలతో పాటు దేశీయ ఆర్థిక సవాళ్లు, వృద్ధి మందగమన ఆందోళనలు పలు రంగాల్లో తగ్గుతున్న గిరాకీ వంటి అంశాలు దేశీయ మార్కెట్లోనూ స్టాక్స్‌లో అమ్మకాలు పోటెత్తాయి. మంగళవారం బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ ఒక దశలో దాదాపు 700 పాయింట్ల మేర క్షీణించింది. చివర్లో 623.75 పాయింట్ల నష్టంతో 36,958.16 వద్ద ముగిసింది.

గడిచిన నెల రోజులకు పైగా కాలంలో సూచీకిదే అతిపెద్ద ఒక్కరోజు పతనం. నిఫ్టీ 183.80 పాయింట్లు తగ్గి 10,925.85 వద్ద స్థిరపడింది. కానీ, 11 వేల కీలక స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. రిలయన్స్‌ షేర్లు భారీగా పుంజుకోవడం దలాల్‌ స్ట్రీట్‌ నష్టాలకు కొంత వరకు అడ్డుకట్ట వేసినా  మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రతికూలతల్లోంచి గట్టెక్కించలేకపోయింది. 


హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఐటీసీ వంటి దిగ్గజ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వల్ల మిగతా ఇండెక్స్‌లు నేల చూపులు చూశాయి. సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో అన్నింటికంటే అత్యధికంగా యెస్‌ బ్యాంక్‌ షేర్ 10.35 శాతం నష్టపోయింది.

మహీంద్రా అండ్‌ మహీం ద్రా 6.11 శాతం క్షీణించగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎ్‌ఫసీ 5 శాతం పైగా పతనమయ్యాయి. మారుతీ సుజుకీ 4.72 శాతం, టాటా స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, ఐటీసీ షేర్లు మూడుశాతానికి పైగా తగ్గాయి. ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, టీసీఎస్‌ కంపెనీలు 2 శాతం పైగా మార్కెట్‌ విలువను కోల్పోయాయి.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, వేదాంత లిమిటెడ్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ సైతం నష్టాల నావలోనే పయనించాయి. రిలయన్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలవగా.. సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌లు కూడా లాభాల్లో ముగిశాయి.
 
ప్రధాన కంపెనీలతో పాటు చిన్న, మధ్య స్థాయి సంస్థల షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ 2.25 శాతం, స్మాల్‌ క్యాప్‌ 1.42 శాతం పడిపోయాయి. రంగాలవారీగా చూస్తే, బీఎ్‌సఈ టెలికాం, ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌, ఫైనాన్స్‌, టెక్నాలజీ, పవర్‌, ఇండస్ట్రియల్‌, ఐటీ సూచీలు 4.34 శాతం వరకు తగ్గాయి. బీఎ్‌సఈ ఎనర్జీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 5.98 శాతం వరకు పెరిగాయి.
 
రిలయన్స్‌ షేర్లు ఉవ్వెత్తున ఎగిశాయి. అంతర్గత ట్రేడింగ్‌లో షేరు ధర 12 శాతానికి పైగా పెరిగి రూ.1,302.50 స్థాయిని తాకింది. చివర్లో మాత్రం 9.72 శాతం లాభంతో రూ.1,275 వద్ద స్థిరపడింది. దాంతో సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. రిలయన్స్‌ మార్కెట్‌ విలువ ఒక్క రోజులోనే రూ.71,637.78 కోట్లు పెరిగి రూ.8,08,233.78 కోట్లకు చేరుకుంది. బీఎస్‌ఈలో రిలయన్స్‌కు చెందిన 20.92 లక్షల షేర్లు ట్రేడవగా.. ఎన్‌ఎ్‌సఈలో 4.79 కోట్లకు పైగా షేర్లు చేతులు మారాయి.
 
పోటెత్తిన అమ్మకాల వరదలో రూ.2 లక్షల కోట్లకు పైగా మార్కెట్‌ సంపద గల్లంతైంది. బీఎస్ఈ లిస్టెడ్‌ కంపెనీలన్నింటి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2,21,837.81 కోట్లు తగ్గి రూ.1, 39,46,997.40 కోట్లకు తగ్గింది.
 
మరోవైపు దేశీయ కరెన్సీ విలువ 6 నెలల క్రితం స్థాయికి బలహీనపడింది. డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో 62 పైసలు క్షీణించి 71.40 వద్ద ముగిసింది. గడిచిన రెండు ట్రేడింగ్‌ సెషన్లలో రూపాయి మారకం విలువ 71 పైసలు పతనమైంది.

మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో 71.15 వద్ద ప్రారంభమైన డాలర్‌-రూపాయి ఎక్స్ఛేంజ్‌ రేటు.. ఒక దశలో 71.02 స్థాయికి మెరుగైంది. కానీ ట్రేడింగ్‌ ముగిసేసరికి 71.40 వద్దకు బలహీనపడింది. అంతర్జాతీయంగా, దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు భారీగా క్షీణించడంతోపాటు అర్జెంటీనా కరెన్సీ పతనం రూపాయి విలువకు మరింత గండికొట్టాయని ఫారెక్స్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.