వాషింగ్టన్: కరోనా మహమ్మారి అంతు తేల్చేందుకు అగ్ర రాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ సన్నద్ధమయ్యారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కావడం ఆయన తీవ్రంగా పరిగణించారు. ఇందుకు తనదైన శైలిలో రియాక్టవుతున్నారు. 

అమెరికన్లకు ఏకంగా లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ (అమెరికా చట్టసభ ప్రతినిధుల సభ)లో ప్రతిపాదించడానికి ట్రంప్ సిద్ధం అవుతున్నారు. గతంలో ఇంతకంటే తీవ్రమైన ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కూడా అమెరికా అధ్యక్షులు ఇంత పెద్ద ప్యాకేజీని ప్రతిపాదించలేదు. 

ఈ చెక్కులను రెండు వారాల్లో ప్రజల వద్దకు చేరుకోవడానికి ఏర్పాట్లు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ ముందుకు తీసుకొచ్చిన రోజుల వ్యవధిలో ఈ ప్యాకేజీకి ఆమోద ముద్ర వేయించుకోవాలని ఆయన తలపోస్తున్నారు.

అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారిపోతుందని విశ్లేషకులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ ప్యాకేజీని ప్రతిపాదించడం గమనార్హం. రెండు రోజుల క్రితం వాషింగ్టన్ నగరంలో రిపబ్లికన్ పార్టీ సెనెటర్ మిట్స్ మెక్ కొనెల్ పని పూర్తయ్యే వరకు సెనెట్ వాయిదా వేయకూడదని వ్యాఖ్యానించారు. 

‘ఇప్పుడు మనం స్పందించాల్సిన టైం. ఒక బిల్లును తయారు చేసి ఆమోదించే వరకు ఈ నగరాన్ని వీడం సిక్ పే, ఉచిత వైద్య పరీక్షలు, అత్యవసర ఆహారం తదితర అంశాలకు సంబంధించిన బిల్లును హౌస్ ఆఫ్ రిప్రజెంటివ్స్ ఆమోదించేందుకు తొలుత ఓటేస్తాం. సహచరులు ఎలాగైనా ఈ ఓటింగ్ లో పాల్గొనాలి‘ అని మెక్ కొనెల్ వ్యాఖ్యానించారు.

మరోవైపు ట్రంప్ అధికార యంత్రాంగం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదేందుకు ప్యాకేజీలను సిద్ధం చేస్తోంది. 2008 నాటి ఆర్థిక మాంద్యం సమయంలో ప్రకటించిన 700 బిలియన్ల డాలర్లు, 2009లో ప్రకటించిన 800 బిలియన్ డాలర్ల రికవరీ యాక్ట్ కంటే అధికంగా ఈ ప్యాకేజీ ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

దీంతో ఉద్యోగులకు భారీగా పన్ను రాయితీ ఇవ్వడంతోపాటు విమానయాన పరిశ్రమకు 50 బిలియన్ల డాలర్ల సాయం, చిన్న వ్యాపారాలకు 250 బిలియన్ల డాలర్ల సాయం అందించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ప్రజలకు 1000 డాలర్ల చెక్కులు పంపిణీ చేయాలని సెనెటర్ మాట్ రోమన్ని ప్రతిపాదించారు. అయితే, దీనిపై ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్టీవ్ మ్యుచెన్ మాట్లాడుతూ ‘ఇది అత్యంత అరుదైన సందర్భం అని మేం భావిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ప్యాకేజీని చట్టసభలోకి తీసుకొస్తాం. ఇది ఆర్థిక వ్యవస్థలోకి లక్ష కోట్ల డాలర్లను పంపుతుంది’ అని పేర్కొన్నారు.