వాషింగ్టన్‌: చైనాతో కొన్ని నెలల క్రితం కుదిరిన తొలి దశ వాణిజ్య ఒప్పందంపై అప్పట్లో సంతోషం వ్యక్తం చేసిన తాను ఇప్పుడు అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి విషయంలో చైనా వ్యవహరించిన తీరు తనను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నదని పునరుద్ఘాటించారు. 

చైనాకు డొనాల్డ్ ట్రంప్ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ఒక్కసారి వైరస్‌ వ్యాపించిన తర్వాత నేను చాలా నిరాశకు గురయ్యాను. మూడు నెలల క్రితం కుదిరిన ఒప్పందంపై నా అభిప్రాయం ఇప్పుడు భిన్నంగా ఉంది. అసలు వారు (చైనా) వైరస్‌ ఇతర ప్రాంతాలకు వ్యాపించే వరకు ఏం చేశారు?’ అని నిలదీశారు.

‘చైనాలోని ఇతర ప్రాంతాలకు ఎందుకు పాకలేదు? వుహాన్‌ దాటకుండా ఎలా నిలువరించగలిగారు? కానీ, అమెరికా సహా ఇతర ప్రపంచానికి పాకకుండా మాత్రం ఆపలేకపోయారు. అలా ఎందుకు జరిగింది? బీజింగ్‌ సహా ఆ దేశంలోని ఇతర ప్రాంతాల్లో వైరస్‌ ప్రభావం లేదు.’’ అంటూ చైనా తీరుపై ట్రంప్‌ సందేహాలు వ్యక్తం చేశారు.

మరోవైపు కరోనా వైరస్‌ సంక్షోభం తర్వాత చైనాతో వ్యవహరించే తీరు కఠినంగా ఉండాల్సిందేనని అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. కరోనా మహమ్మారి సమాచారాన్ని తొక్కిపెట్టడం ద్వారా చైనా.. వైరస్‌ను ప్రపంచ దేశాలపైకి ఎగదోసిందన్నారు.

also read అంతా ప్రచారమే...అందులో ఏమీ లేదు.. : మోదీ ప్యాకేజీపై తేల్చేసిన ఫిచ్

చైనా అనుసరించిన వైఖరి వల్ల ఒక్క అమెరికాలోనే 90 వేల మందికి పైగా చనిపోయారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. మరోవైపు 3.5 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తొలుత వైరస్‌ సోకిన వ్యక్తి ఎవరో కూడా తెలియదని.. వైద్యులు, జర్నలిస్టుల నోళ్లు మూయించడం ద్వారా సమాచారాన్ని తొక్కిపెడుతున్నారని ట్రంప్ ఆరోపించారు.

కరోనా వైరస్ ప్రభావం ప్రారంభ దశలో ఉన్నప్పుడు పదేపదే అది కరోనా వైరస్ కాదు.. చైనా వైరస్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానోమ్.. చైనాకు వంత పాడారని నిష్ఠూరాలాడారు. 

తొలుత డబ్ల్యూహెచ్ఓకు నిధులు విడుదల చేయకుండా తాత్కాలికంగా నిలిపివేశారు. తాజాగా శాశ్వతంగా నిధులు నిలిపివేస్తామని బెదిరింపులకు దిగారు డొనాల్డ్ ట్రంప్. దాని కొనసాగింపుగానే చైనాతో కుదుర్చుకున్న తొలి దశ వాణిజ్య ఒప్పందంపై వైఖరి మార్చుకున్నట్లు బెదిరింపులకు దిగారు.. ఇదంతా కరోనా మహమ్మారిపై అమెరికన్ల ద్రుష్టిని మళ్లించి.. నవంబర్ నెలలో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో లబ్ధికి ప్రయత్నిస్తున్నారు ట్రంప్.