దేశీయ ఎయిర్‌లైన్స్ దిగ్గజం జెట్ ఎయిర్‌వేస్‌ పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయి మూసివేతకు దగ్గరైంది. ఇప్పటికే సేవలు నిలిచిపోగా, కీలక వ్యక్తులు, ఉద్యోగులు మరో చోటు వెతుక్కుంటున్నారు. తాజాగా మరో ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగోలోనూ ఇప్పుడు అంతర్గతం ఏదో జరుగుతుందన్న వార్త ఎయిర్‌లైన్స్ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది.

ఇండిగో సహ వ్యవస్థాపకులు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. ఈ ప్రభావం ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై పడుతోంది. షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ క్లాజులు, ఎయిర్‌లైన్స్ వ్యూహాలు, ఆంబిషన్స్ సహా పలు అంశాలపై వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చెబుతున్నారు.

ఈ అంశంపై స్పందించేందుకు కంపెనీ ప్రమోటర్లు నిరాకరించినట్లుగా మార్కెట్ వర్గాల్లో తెలుస్తోంది. వీరిద్దరి మధ్య గత కొన్ని వారాలుగా విభేదాలు ఉన్నాయని.. అవి ఇప్పటికీ కొనసాగుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ విభేదాల నేపథ్యంలో ఇండిగో షేర్లు పతనం అయ్యాయి. మరో వైపు ఈ వ్యవహారం బయటకు రాకముందే సమస్య పరిష్కారం దిశగా లీగల్ ఫర్మ్స్‌ ఖైతాన్ అండ్‌ కో, జే సాగర్ అసోసియేట్స్ పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

సీఈవోగా ఆదిత్య ఘోష్‌ నియామకం తర్వాత రాహుల్ భాటియా, రాకేశ్‌ల మధ్య విభేదాలకు బీజం పడింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, యూఎస్‌ ఎయిర్‌లైన్స్ వెటరన్ రాకేశ్ గాంగ్వాల్ కారణంగా ఇండిగో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ విమానయాన సంస్థగా ఎదిగిందని అంటున్నారు.

అమెరికా సిటిజన్ అయిన గాంగ్వాల్ అక్కడి నుంచి సంస్థను నడిపిస్తుండగా.. రాహుల్ భాటియా ఇండియాలో ఇండిగో గ్రోత్‌కు కృషి చేశారని ఉద్యోగులు అంటున్నారు. గత రెండేళ్లుగా వారి మధ్య విభేదాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

మార్చి 31 నాటికి ఇండిగో మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్‌లో రాహుల్ భాటియా 38 శాతం వాటా, గాంగ్వాల్‌కు 37 శాతం వాటా వుంది. 2006లో భాటియా, గాంగ్వాల్ ఇండిగోను స్ధాపించగా.. 2013లో కంపెనీటి లిస్టింగ్‌ నాటికి ఇండిగోలో ప్రమోటర్లు ఇద్దరు 99 శాతం వాటాను కలిగి ఉన్నారు.

సీఈవోగా ఆదిత్య ఘోష్‌ ఇండిగోను వీడిన ఎనిమిది నెలల తర్వాత ఈ ఏడాది జనవరిలో నూతన సీఈవోగా రొణోజాయ్ దత్తా నియమితులయ్యారు.