ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లకు 4జీ సేవలకు అనువైన తరంగాలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ చెబుతున్నది.

ఈ రెండు సంస్థలకు 4జీ స్పెక్ట్రం కేటాయించాలని ట్రాయ్‌కి సిఫారసు చేసినట్లు గత నెల టెలికం శాఖ (డీవోటీ) చెప్పిన నేపథ్యంలో ట్రాయ్ సీనియర్ అధికారి ఒకరు చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకున్నది. 

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ , మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్‌లకు 4జీ సేవల సౌకర్యం కల్పించాలని డీవోటీ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ట్రాయ్‌కి చెప్పామని డీవోటీ చెబుతుండగా, అదేమీ లేదని ట్రాయ్ ఖండిస్తున్నది. 

బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లకు 4జీ స్పెక్ట్రం కేటాయింపుపై డీవోటీ నుంచి మాకు ఎలాంటి సిఫార్సులు అందలేదు అని సదరు అధికారి చెప్పారు. ప్రైవేట్ టెలికం ప్రొవైడర్లు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు 4జీ సేవల్లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.

ప్రైవేట్ సంస్థలకు మాత్రం కేంద్రం, టెలికం శాఖల సిఫారసులతో సంబంధం లేకుండా నిబంధనలకు లోబడి స్పెక్ట్రం కేటాయిస్తుంది టెలికం మరి. కానీ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విషయంలో అలా ఎందుకు చేయదో ఎవరికీ అర్థం కాదు మరి.

ప్రైవేట్ సంస్థలే 2జీ స్థాయి సెల్ ఫోన్లు విడుదల చేసిన తర్వాత పుష్కర కాలానికి బీఎస్ఎస్ఎల్ ఫోన్లను మార్కెట్లోకి అనుమతించింది కేంద్రం. అంటే సర్కార్ వారికి ప్రైవేట్ సంస్థలపైనే ప్రేమ ఎక్కువ అని అనుమానాలు ఉన్నాయి. 

4జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం అనుమతి పొందని ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం వీటితో పోటీపడలేక నష్టాల్లో కూరుకుపోతున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ రుణం భారం రూ.35,000 కోట్లపైనే ఉన్నది. ఫలితంగా ఉద్యోగులకు జీతాలను కూడా చెల్లించలేని దుస్థితిలో ఈ సంస్థలున్న సంగతీ విదితమే.

ఐపీఎల్ కోసం బీఎస్ఎన్ఎల్ ఆఫర్లు ఇలా
ఐపీఎల్ టీ-20 లీగ్ సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. తెలంగాణ, ఏపీలోని ప్రీ-పెయిడ్ మొబైల్ వినియోగదారులకు ఎస్టీవీ-199, ఎస్టీవీ-499 ఆఫర్లను తెచ్చింది.

ఎస్టీవీ-199ను రీచార్జి చేసుకుంటే..అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ), రోజూ వన్ జీబీ డేటా, క్రికెట్ ఎస్‌ఎంస్ అలర్ట్స్, ఫ్రీ అన్‌లిమిటెడ్ సాంగ్ ఛేంజ్‌ను 28 రోజుల కాలపరిమితితో పొందవచ్చు.

ఎస్టీవీ-499 రీచార్జిపై వీటన్నిటితోపాటు రోజు వంద ఎస్‌ఎంఎస్‌లు, ఫ్రీ అన్‌లిమిటెడ్ సాంగ్ ఛేంజ్‌ను 90 రోజుల కాలపరిమితితో పొందవచ్చని తెలంగాణ టె లికం సర్కిల్ సీజీఎం వి సుందర్ ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. పూర్తి వివరాలకు 1503 లేదా 18001801503 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.