Asianet News TeluguAsianet News Telugu

ఈ-రిటైలర్ల పండుగ ఆఫర్లపై భగ్గు: నిర్మలకు సీఏఐటీ కంప్లయింట్

ఈ-కామర్స్ రిటైల్ దిగ్గజ సంస్థలు పోటీపడి పండుగ ఆఫర్లు ప్రకటిస్తున్న తీరుపై కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌కు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ఫిర్యాదు చేసింది. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థల తీరు 2016 ఎఫ్‌డీఐ నిబంధనలకు వ్యతిరేకమని ఆందోళన వ్యక్తం చేసింది.

Traders Raise Objections Against Festive Online Sale Discounts
Author
New Delhi, First Published Sep 9, 2019, 9:22 AM IST

ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థలు పోటీపడి వెల్లడిస్తున్న పండుగ ఆఫర్లతో రిటైల్ వ్యాపారులు కలత చెందుతున్నారు. ఈ సంస్థలు పోటాపోటీగా ఆఫర్లతో అతితక్కువ ధరలకే వస్తువులను అమ్మడంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ఫిర్యాదు చేసింది.

ఆన్‌లైన్‌ రిటైల్‌ పోర్టల్స్‌ను ఇలాంటి ఎత్తుగడలకు దూరంగా ఉంచాలని వీరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌లకు విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌ కంపెనీలు న్యాయసమ్మతం కాని ధరలకు వస్తువులు విక్రయించడాన్ని ప్రభుత్వం అనుమతించదని మంత్రి గోయల్‌ ఇటీవల చేసిన ప్రకటనను సీఏటీఐ ప్రస్తావించింది.

పలు ఈ కామర్స్‌ పోర్టల్స్‌ అతితక్కువ ధరలకు వస్తువుల అమ్మకాలను చేపట్టడంలో హేతుబద్ధతను సీఏఐటీ అధ్యక్షులు బీసీ బర్తియా, ప్రధాన కార్యదర్శి ఖండేల్వాల్‌ ప్రశ్నించారు. ఆయా వస్తువుల స్టాక్‌ కల వారు మాత్రమే ఈ ధరలకు విక్రయించగలరని, ఈ కామర్స్‌ వెబ్‌సైట్లు కేవలం మార్కెట్‌ సదుపాయం మాత్రమే కల్పిస్తారని, వారు ఆన్‌లైన్‌లో విక్రయించే వస్తువులకు యజమానులు కాదని సీఏఐటీ పేర్కొంది. 

2016 ఎఫ్‌డీఐ విధానానికి అనుగుణంగా ఈకామర్స్‌ పోర్టల్స్‌ అమ్మకాలు లేదా ధరలను ప్రభావితం చేయరాదని స్పష్టంగా ఉన్నా, వీరు తమ పోర్టల్స్‌లో సేల్స్‌ను ప్రకటించడం ద్వారా ఎఫ్‌డీఐ విధానానికి తూట్లు పొడుస్తున్నారని ఆక్షేపించింది. 

ఈ కామర్స్‌ పోర్టల్స్‌ వస్తువులను తమ గోడౌన్లలో నిల్వ చేస్తున్నాయని ఇది భారత ప్రభుత్వ రిటైల్‌ విధానానికి విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేసింది. వివిధ పోర్టల్స్‌ ప్రకటించిన క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను తక్షణమే నిలిపివేయాలని ఇది ధరలపై ప్రభావం చూపుతోందని పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios